శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సి.ఎస్.ఐ.ఆర్.-సి.ఐ.ఎం.ఎఫ్.ఆర్.
ప్లాటినమ్ జూబిలీ ఉత్సవాల ప్రారంభం

వేడుకలకు కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శ్రీకారం,

సంస్థ రూపొందించిన 3 స్వదేశీ పరిజ్ఞాన విధానాలు జాతికి అంకితం

Posted On: 17 NOV 2020 6:07PM by PIB Hyderabad

కేంద్ర శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి (సి.ఐ.ఎస్.ఆర్.) ఆధ్వర్యంలోని కేంద్ర మైనింగ్, ఇంధన పరిశోధనా సంస్థ (సి.ఐ.ఎం.ఎఫ్.ఆర్.-ధన్ బాద్) వ్యవస్థాపక దినోత్సవ ప్లాటినం జూబిలీ వేడుకలను కేంద్ర, సైన్స్-టెక్నాలజీ, భూగోళ శాస్త్రాలు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. సి.ఎస్.ఐ.ఆర్. కు చెందిన ప్రతిష్టాత్మక పరిశోధనాగారాల్లో ధన్ బాద్ లోని సి.ఐ.ఎం.ఎఫ్.ఆర్. కూడా ఒకటి.

  ఈ సందర్భంగా, బొగ్గును సీన్ గ్యాస్ గా మార్చే ప్లాంటును, వ్యూహాత్మక, మౌలిక సదుపాయాల ప్రతిభా సంస్థను, బొగ్గు గ్యాసిఫికేషన్ సంస్థను కూడా కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వర్చవల్ పద్ధతిలో ప్రారంభించారు. కోకింగ్ కోల్ దిగుమతికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఆయన జాతికి అంకితం చేశారు.

   దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా సాగిన ప్రయాణంలో పలు విజయాలతో అనేక మైలురాళ్లు దాటిన సి.ఎస్.ఐ.ఆర్.-సి.ఐ.ఎం.ఎప్.ఆర్.ను డాక్టర్ హర్షవర్ధన్ అభినందించారు. “గనుల తవ్వకం కార్యకలాపాలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో యాంత్రీకరణ చేయడానికి సి.ఐ.ఎం.ఎఫ్.ఆర్. బహుళ శాస్త్రీయ అధ్యయం, పరిశోధన నిర్వహించాల్సి ఉంది. గనుల తవ్వకంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఒ.టి.) వంటి డిజిటల్ పరిష్కారాల వినియోగం అవసరం.“ అని అన్నారు. “గనుల తవ్వకం నేపథ్యంలో భూసార రక్షణ, జీవ వైవిద్య పరిరక్షణ, సామాజక ఆర్థిక, వ్యవసాయక సానుకూల వ్యవస్థలు, వన్య జీవన సంరక్షణ ప్రణాళిక,  వంటి అంశాలపై శ్రద్ధచూపడం చాలా ముఖ్యం.” అని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.

 

 “వివిధ రకాల పరిశ్రమల మౌలిక అవసరాలకోసం విద్యుత్ ను ఉత్పత్తికి దేశం శిలాజ ఇంధనాలపైనే ఆధారపడవలసి వస్తోంది. ఈ పరిస్థితిలో పర్యావరణానికి తలెత్తే ముప్పును నివారించేందుకు విద్యుత్ ఉత్పాదనకోసం మరింత స్వచ్ఛమైన, పర్యావరణ హితమైన మార్గాలను మనం రూపొందించుకోవలసిన అవసరం ఉంది”.  అని అన్నారు.“వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భాగంగా కాలుష్యకారక వాయువుల బెడదను అరికట్టే లక్ష్యంతో పారిస్ ఒప్పందం అంశాలను మనం పాటించగలమని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు కృషిచేయగలమని ఆశిస్తున్నట్టు చెప్పారు.

  కొత్త తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడం, ఇంధన పరిశోధనా, రూపకల్పన రంగంలో సృజనాత్మక పద్ధతులతో ఇంధన భద్రతను సాధించడం, భారతీయల అవసరాలన్నింటికీ సరిపోయే ఇంధనాన్ని అందుబాటులోకి తేవడం వంటి చర్యల ద్వారా ఈ లక్ష్యం సాధించవచ్చని  అన్నారు. “ఈ పరిస్థితుల్లో, సి.ఐ.ఎం.ఎఫ్.ఆర్. వంటి పరిశోధనా సంస్థలు తన వినూత్నమైన పద్ధతులతో, దేశానికి అవసరమైన ఇంధనాన్ని అందుబాటులోకి తేగలవని భావిస్తున్నట్టు చెప్పారు.

  వ్యూహాత్మక, మౌలిక రంగాల్లో సి.ఐ.ఎం.ఎఫ్.ఆర్. అగ్రగామిగా కొనసాగడం సంతోషదాయకమని హర్షవర్ధన్ అన్నారు. ప్రధాన రహదారులు, రైలుమార్గాలు, సొరంగాలు, హైడ్రాలిక్ ప్రాజెక్టులు, ఓపెన్ కాస్ట్ గనులు, భూగర్భ గనుల రంగంలో పనిచేసే రాక్ ఎక్సవేషన్ ఇంజినీరింగ్ గ్రూపునకు  సి.ఐ.ఎం.ఎఫ్.ఆర్.  ప్రతిభావంతమైన సేవలను అందిస్తోందన్నారు. “ఎంతో కీలకమైన ఇండో చైనా, ఇండో పాక్ సరిహద్దు రహదారుల నిర్మాణంలో సి.ఎస్.ఐ.ఆర్.-సి.ఐ.ఎం.ఎఫ్.ఆర్. అందించిన సాంకేతిక పరిజ్ఞానం ఎంతో దోహపడింది.” అని అన్నారు. “ఉత్తర భారతం, ఈశాన్య భారత ప్రాంతాల్లో సరిహద్దు రహదారుల అభివృద్ధిలో,.. సరిహద్దు రహదారుల సంస్థ (బి.ఆర్.ఒ) భాగస్వామిగా సి.ఎస్.ఐ.ఆర్.-సి.ఐ.ఎం.ఎఫ్.ఆర్. ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తోంది.” అని ఆయన అన్నారు.

  “భారతదేశంలోనేకాక, పలు దేశాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణానికి కావలసిన శాస్త్రీయ నైపుణ్యాన్ని మన ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు అందిస్తూ వస్తున్నారు. మిజోరాం మయన్మార్ లో కలాదన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్టు, ఆఫ్ఘనిస్తాన్ లో సల్మా డ్యామ్, భూటాన్ లో తలా, పునత్సాగ్చూ హైడల్ ప్రాజెక్టుల తొలిదశ, రెండవ దశల నిర్మాణం తదితర ప్రాజెక్టులకు మన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు నైపుణ్యం అందించారు.” అని హర్షవర్ధన్ అన్నారు.

  ప్లాటినమ్ జూబిలీ ఉత్సవాల లోగోను కూడా డాక్టర్ హర్షవర్ధన్ ఆవిష్కరించారు. ఆయన సమక్షంలో సి.ఐ.ఎం.ఎఫ్.ఆర్.కు, వివిధ ఇతర సంస్థలకు మధ్య  ఐదు ఒప్పందాలు కుదిరాయి. నీతీ ఆయోగ్ (సైన్స్-టెక్నాలజీ) సభ్యుడు డాక్టర్ వి.కె. సారస్వత్, సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్ జనరల్, శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా శాఖ (డి.ఎస్.ఐ.ఆర్.) కార్యదర్శి  డాక్టర్ శేఖర్ సి. మాండే, సి.ఎస్.ఐ.ఆర్.- సి.ఐ.ఎం.ఎఫ్.ఆర్.  డైరెక్టర్,. డాక్టర్ ప్రదీప్ సింగ్, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

**********(Release ID: 1673568) Visitor Counter : 11