ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

నవభారత నిర్మాణానికి యువతే రథసారథులు: ఉపరాష్ట్రపతి

- దేశాభివృద్ధిలో భాగస్వాములై దేశపునర్వైభవానికి యువత పాటుపడాలని పిలుపు

- సానుకూల దృక్పథంతో ముందుడుగేస్తే తిరుగుండదని దిశానిర్దేశం

- ఉన్నతవిద్యాసంస్థలు విశిష్ఠ నైపుణ్యకేంద్రాలుగా పరివర్తనం చెందాలి

- ప్రపంచంలో ఉన్నత విద్యాసంస్థల జాబితాలో చోటు దక్కించుకునేలా మన విశ్వవిద్యాలయాలు మరింత శ్రమించాలని సూచన

- నూతన జాతీయ విద్యావిధానం నాణ్యమైన విద్యనందించడంపై దృష్టిపెట్టడం శుభపరిణామమన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు
వెంకయ్యనాయుడు

- హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అదనపు సౌకర్యాల కేంద్రం (అమెనిటీస్ సెంటర్‌ను) ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

- కరోనాకు పూర్తిస్థాయి టీకా వచ్చేంతవరకు అలసత్వం వహించవద్దని సూచన

Posted On: 16 NOV 2020 1:01PM by PIB Hyderabad

భారత యువత దేశాభివృద్ధిలో భాగస్వాములై తమ శక్తియుక్తులతో నవ, ఆత్మనిర్భర భారత నిర్మాణం కోసం కృషి చేయాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి యువతే రథసారథులన్న ఉపరాష్ట్రపతి.. నేటి సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కారాలను కనుగొనే దిశగా కృషి చేయాలని యువతకు సూచించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాయంలో అదనపు సౌకర్యాల కేంద్రం (అమెనిటీస్ సెంటర్‌)ను సోమవారం ప్రారంభించిన ఉపరాష్ట్రపతి.. యువత ప్రతికూల ఆలోచనలను పక్కనపెట్టి సానుకూల దృక్పథంతో ముందుకెళ్తే సాధించలేనిది ఏదీ ఉండదని దిశానిర్దేశం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ సవాళ్లు తలెత్తుతున్న నేపథ్యంలో యువత అన్నిరంగాల్లో తమ శక్తియుక్తులను వెచ్చించి.. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడంతోపాటు, ప్రపంచ పురోగతిని భారత్ ముందుండి నడిపించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. నిరక్షరాస్యత, లింగవివక్షత, అత్యాచారాలు, అవినీతి వంటి సాంఘిక దురాచారాలను తొలగించడంతోపాటు, వ్యాధులపై జరుగుతున్న పోరాటంలో, వ్యవసాయరంగంలో అవసరమైన మార్పులను తీసుకురావడంలో తమ వంతు పాత్ర పోషించాలని ఉపరాష్ట్రపతి  సూచించారు.  
కరోనా, వాతావరణమార్పులు వంటి సమస్యల పరిష్కారానికి యువత వినూత్న, సృజనాత్మకమైన ఆలోచనలతో ముందుకురావాలని సూచించిన ఉపరాష్ట్రపతి, దేశప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడంలో పరిపూర్ణ విద్య పాత్ర చాలా అవసరమన్నారు. 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేందుకు మన విద్యావిధానంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, నైతిక విలువలను జోడించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతోపాటు.. ప్రైవేటురంగం, విద్యారంగంలోని ఇతర భాగస్వామ్య పక్షాలు.. ఉన్నత విద్యా సంస్థలను విశిష్ఠ అధ్యయన కేంద్రాలుగా పరివర్తనం చేయడంలో తమవంతు పాత్రను పోషించాలన్నారు.
ప్రపంచ ఉత్తమ విద్యా సంస్థల జాబితాలో భారత్ నుంచి కొన్ని విద్యా సంస్థలకే చోటు దక్కడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి.. అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునే దిశగా మన విశ్వవిద్యాలయాలు మరింత కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. సృజనాత్మక పరిశోధనకు ప్రాధాన్యతనిస్తూ, పరిశోధన క్లస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా పరిశోధకులు, అధ్యయనకారులను ప్రోత్సహించాలని సూచించారు.
ప్రపంచ వినూత్న, సృజనాత్మక ఆలోచనల కేంద్రంగా భాసిల్లే సత్తా భారత్ కు ఉందన్న ఉపరాష్ట్రపతి.. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వంటి ఉన్నతవిద్యాసంస్థలు ఈ దిశగా మరింత కృషిచేయాలని సూచించారు. పరిశ్రమలతో అనుసంధానమై.. విద్యార్థులకు అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు పూర్తయినా.. ఇంకా 100 శాతం అక్షరాస్యత సాధించలేకపోయిన విషయాన్ని గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి, సంపూర్ణ అక్షరాస్యత కలిగిన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఇందుకోసం ప్రభుత్వాలతోపాటు అన్ని భాగస్వామ్య పక్షాలు ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని సూచించారు. 
భవిష్యత్ భారతానికి నాణ్యమైన విద్యతోపాటు ఉత్తమ ప్రవర్తన, శాస్త్రసాంకేతిక దృక్పథం, సృజనాత్మకత, సేవాతత్పరత, నైతిక విలువలను అందించడంతోపాటు 21వశతాబ్దపు అవసరాలు, అవకాశాలకు అనుగుణంగా రూపుదిద్దే దిశగా నూతన జాతీయ విద్యావిధానాన్ని రూపొందించడంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.
కరోనా మహమ్మారిని నిరోధించేందుకు పూర్తిస్థాయిలో టీకా వచ్చేంతవరకు అలసత్వం వహించరాదని ఉపరాష్ట్రపతి సూచించారు. శారీరక వ్యాయామం, ఆరోగ్యవంతమైన భోజనంతోపాటు మాస్కు ధరించడం, సురక్షిత దూరాన్ని, చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం ద్వారా కరోనా నుంచి దూరంగా ఉండొచన్నారు. యోగా, ధ్యానం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఉపరాష్ట్రపతి సూచించారు.
కరోనా సవాళ్లతోపాటు అవకాశాలను కూడా కల్పిస్తోందన్న ఉపరాష్ట్రపతి ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో యువత ముందుండాలన్నారు.ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కులపతి శ్రీ ఎల్ నర్సింహారెడ్డి, ఉపకులపతి, శ్రీ పొదిలి అప్పారావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, విద్యారంగ ప్రముఖులు హాజరయ్యారు.

****



(Release ID: 1673132) Visitor Counter : 935