జల శక్తి మంత్రిత్వ శాఖ

పంజాబ్ లో పూర్తి స్థాయిలో అమలౌతున్న - జల్ జీవన్ మిషన్;

2022 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సిద్ధమైన ప్రణాళిక;

నీటి వ్యర్థాలను తగ్గించడం కోసం నీటి వినియోగం ఆధారంగా చార్జీల వసూలుకు ప్రత్యేక ప్రాధాన్యత

Posted On: 13 NOV 2020 4:00PM by PIB Hyderabad

 

2022 నాటికి అన్ని గ్రామీణ గృహాలకు కుళాయిల ద్వారా నీటిని అందించాలని పంజాబ్ లక్ష్యంగా పెట్టుకుంది.  2020-21లో 7.60 లక్షల గృహ కనెక్షన్లను ప్రారంభించాలని కూడా రాష్ట్రం ప్రణాళిక సిద్ధం చేసింది.  జల్ జీవన్ మిషన్ కింద, గ్రామస్తుల, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లల జీవితాలను మెరుగుపర్చడానికీ, వారికి మంచి నాణ్యమైన జీవితాన్ని అందించాలానే లక్ష్యంతో రాష్ట్రం కృషి చేస్తోంది.

2024 నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికీ ట్యాప్ కనెక్షన్ (ఎఫ్.హెచ్.టి.సి.ద్వారా నీటి సరఫరాను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమంజల్ జీవన్ మిషన్ (జె.జె.ఎం) రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలులో ఉంది.

ఈ మిషన్ ద్వారా, ప్రతి గ్రామీణ గృహానికి రోజుకు 55 లీటర్ల తలసరి (ఎల్.పి.సి.డి) సేవా స్థాయిలో, నిర్ణీత నాణ్యతతో త్రాగునీటిని, సాధారణ మరియు దీర్ఘకాలిక ప్రాతిపదికన అందించనున్నారు.    

హోషియార్ ‌పూర్ జిల్లాలోని కంది ప్రాంతంలోని తఖ్ని గ్రామంలో ‘తఖ్ని ఎస్.‌వి.ఎస్’ పథకం పేరుతో ఒక మంచి ఒకే గ్రామ పథకం అమలులో ఉంది. ఈ భూగర్భజల ఆధారిత ఎస్.వి.ఎస్. పధకం 2020 జూన్ నెలలో ప్రారంభమయ్యింది.  గ్రామంలోని మొత్తం 165 గృహాలతో పాటు పాఠశాలలు మరియు అంగన్‌వాడీలకు ఈ పధకం పంపు నీటి కనెక్షన్‌లను అందిస్తుంది.  ఎత్తులో ఉన్న 40 గృహాలకు బూస్టర్ పంపింగ్ ద్వారా నీటిని సరఫరా చేయడం, ఈ పథకం ప్రత్యేకత.  అధిక ఎత్తులో ఉన్న గృహాలు 40 సంవత్సరాల తరువాత, ఈ పథకం ద్వారా, తగినంత పరిమాణంలో త్రాగు నీటిని పొందుతున్నాయి.  ప్రాథమిక నీటి నాణ్యత పరీక్ష కోసం క్షేత్ర స్థాయి పరీక్షా పరికరాలను ఉపయోగించి నీటి నాణ్యతపై సమాజ నిఘా పెట్టడం జరుగుతోంది.  గ్రామ పంచాయితీ కి చెందిన నీరు మరియు పారిశుధ్య కమిటీ (జి.పి.డబ్ల్యు.ఎస్.సి) ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేసి, నిర్వహిస్తోంది.  జి.పి.డబ్ల్యూ.ఎస్.సి. ప్రతి ఇంటి నుండి నెలకు 150 రూపాయల చొప్పున చార్జీలను వసూలు చేస్తుంది, ఈ మొత్తాన్ని ఈ పధకం నెలవారీ ఓ. & ఎమ్. ఖర్చుల కోసం వినియోగిస్తారు.  దీర్ఘకాలిక సుస్థిరత కోసం గ్రామంలో మౌలిక సదుపాయాలను నిర్మించి, అమలు చేసి, నిర్వహించే బాధ్యతలను ప్రజలే భరించే విధంగా రూపొందిందిన జల్ జీవన్ మిషన్ కింద ఈ పధకం అమలౌతోంది.   

 

   

జల్ జీవన్ మిషన్ ఆశయాలను అనుసరించి ఒకే గ్రామ నీటి సరఫరా పథకం యొక్క ప్రణాళిక, అమలు, నిర్వహణ కు సంబంధించి, సమాజ భాగస్వామ్యానికి తానా మరియు నౌలఖా గ్రామాలు ఒక మంచి ఉదాహరణగా నిలిచాయి.   ఈ గ్రామాల్లో ఐదేళ్ల క్రితం జి.పి.డబ్ల్యూ.ఎస్.సి. లు ఏర్పడి, సమర్థవంతంగా పనిచేస్తున్నాయి.  ఈ రెండు గ్రామాల్లో, జి.పి.డబ్ల్యూ.ఎస్.సి. ఏర్పాటులో 50 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. గ్రామస్తులందరూ గ్రామ అభివృద్ధి పనులలో చురుకుగా పాల్గొంటున్నారు. గ్రామంలో ప్రతి రోజూ, 24 గంటలూ నీటి సరఫరా అందుబాటులో ఉండే విధంగా ఈ పధకాన్ని రూపొందించారు.  భూగర్భంలో ఉన్న జలాలను, ఓవర్ హెడ్ ట్యాంకుకు పంపుతారు.  ట్యాంకుల్లోని నీటి మట్టాలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నీటి పంపులను నియంత్రిస్తారు.  ఓవర్ హెడ్ ట్యాంకు లో అమర్చిన, నీటి మట్టాన్ని గుర్తించే పరికరాన్ని, నీటి పంపులను నడపడానికీ, ఆపుచేయడానికీ, వినియోగిస్తున్నారు. తద్వారా ఆపరేటర్ యొక్క ప్రమేయం తగ్గుతుంది. అందువల్ల, మీటర్ రీడింగ్ నమోదుచేయడం, రెవెన్యూ వసూలుతో పాటు వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడం వంటి కార్యకలాపాలలో ఆపరేటర్ సేవలు వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది.  ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి నీరు ప్రతి వ్యక్తి ఇంటి పైకప్పులో ఉండే ట్యాంకుకు ప్రవహించే విధంగా, ఈ రెండు గ్రామాలలో నీటి సరఫరా వ్యవస్థ రూపకల్పన జరిగింది. తద్వారా గ్రామంలోని సుదూర ప్రాంతాల్లోని ఇంటికి కూడా నీటి సరఫరా సక్రమంగా జరుగుతుంది.  ప్రతి ఇంటి పైకప్పుపై ఉన్న నీటి ట్యాంకు ఫ్లోట్ వాల్వు అమర్చబడి ఉంటుంది, ఇది ట్యాంకు నిండగానే నీటి సరఫరాను నిరోధిస్తుంది, తద్వారా నీరు పొంగి పొర్లకుండా నివారించి, నీటి వృథా అరికట్టబడుతుంది.  అలాగే, గృహ వినియోగంలో రోజువారీ ఉపయోగం కోసం అవసరమైన కుళాయిలను పైకప్పు ట్యాంకుతో అనుసంధానించబడి ఉంటాయి. ఇది రోజంతా ఇంటి నీటి లభ్యతను నిర్ధారిస్తుంది.  అదే సమయంలో పైకప్పు ట్యాంకులో నీటి మట్టం తగ్గుతున్న కొద్దీ తిరిగి నీరు  భర్తీ అవుతూవుంటాయి.  

గ్రామ పంచాయతీ సేకరించిన తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు అయ్యే వ్యయానికి సమాజం నుండి నిధులు సేకరించే విధానం పంజాబ్‌లో ఉంది.  సమాజ భాగస్వామ్యం ద్వారా సేకరించిన మొత్తాన్ని, ఆయా గ్రామ పంచాయతీలకు చెందిన నీరు & పారిశుధ్య కమిటీ (జి.పి.డబ్ల్యు.ఎస్.సి) ల  బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన తర్వాతే,  కొత్త నీటి సరఫరా పనులు చేపట్టాలనే విషయాన్ని ఒక విధానంగా అమలుచేస్తున్నారు.  నీటి సరఫరా పథకాలకు తామే యజమానులమనే భావన, ఒక విధమైన గర్వం  స్థానిక సమాజంలో తీసుకురావాలన్నదే ఈ విధానం అమలులోని ప్రధాన లక్ష్యం.

పంజాబ్ ‌లోని చాలా గ్రామాలు, ఆయా గ్రామ పంచాయతీకి చెందిన నీరు మరియు పారిశుధ్య కమిటీ (జి.పి.డబ్ల్యు.ఎస్.సి) లు ఈ పథకాల నిర్వహణ మరియు యాజమాన్యం (ఓ. & ఎం) లో చురుకైన సమాజ భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి.  రాష్ట్రంలోని మొత్తం 12,030 గ్రామాలకు గాను, ఇప్పటికే 7,871 గ్రామాలు జి.పి.డబ్ల్యు.ఎస్.సి. లను ఏర్పాటు చేశాయి.

పంజాబ్ లోని అనేక గ్రామాలలో గృహ స్థాయిలో నీటి మీటర్లు ఏర్పాటు చేయడం జరిగింది.  కొన్ని గ్రామాల్లో, నీటి మీటరు లో సూచించిన నీటి వాడకం పరిమాణం ఆధారంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే, ఇంకా చాలా గ్రామాల్లో ఇప్పటికీ గ్రామస్థులందరికీ ఒకే మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నారు. జి.పి.డబ్ల్యూ.ఎస్.సి. లు నడుపుతున్న చాలా నీటి సరఫరా పథకాలు ఆర్థికంగా స్థిరంగా ఉన్నాయి.  అవి మొత్తం ఓ. & ఎమ్. ఖర్చులను గృహ స్థాయి చార్జీలు విధించడం ద్వారా సేకరిస్తున్నాయి.  రాష్ట్రం ఇప్పుడు, గృహాల వారీగా వినియోగించిన నీటి పరిమాణం ఆధారంగా చార్జీలు వసూలు చేయాలని యోచిస్తోంది; ఇది నీటి వృధాను తగ్గించడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది.

పంజాబ్ కు చెందిన ఈ గ్రామాల్లోని విజయ గాధలు ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంలో సమాజ భాగస్వామ్యం యొక్క పాత్రను తెలియజేస్తున్నాయి.

*****



(Release ID: 1672787) Visitor Counter : 145