ఆర్థిక మంత్రిత్వ శాఖ
జమ్ము&కశ్మీర్, లద్దాఖ్‌లో "సబ్ కా విశ్వాస్ (లెగసీ డిస్ప్యూట్ రిసొల్యూషన్)" పథకం కింద దరఖాస్తుల దాఖలు గడువు డిసెంబర్ 31 వరకు పెంపు
Posted On:
12 NOV 2020 6:43PM by PIB Hyderabad
కొత్తగా ఏర్పడిన జమ్ము&కశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాపారాలు, పరిశ్రమలకు బాసటగా నిలిచేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన పన్ను చెల్లింపుదారుల కోసం, "సబ్ కా విశ్వాస్ (లెగసీ డిస్ప్యూట్ రిసొల్యూషన్)" పథకం (ఎస్‌వీఎల్‌డీఆర్‌ఎస్)-2019ను ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది.
అమల్లో ఉన్న సమయంలో ఈ పథకాన్ని పొందడంలో నిజమైన ఇబ్బందులు ఎదుర్కొన్న రెండు యూటీల పన్ను చెల్లింపుదారులకు ఈ నిర్ణయం గొప్ప ఊరటగా మారనుంది. గత పన్ను వివాదాలను పరిష్కరించుకోవడానికి వారికి ఇది కొత్త అవకాశంగా మారుతుంది.
ఎస్‌వీఎల్‌డీఆర్‌ఎస్ పథకాన్ని 2019 సెప్టెంబర్ 1వ తేదీన ప్రవేశపెట్టారు. కేంద్ర ఎక్సైజ్, సేవా పన్ను వంటివాటికి సంబంధించిన వివాదాలను తగ్గించే లక్ష్యంతో దీనిని తీసుకొచ్చారు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు జీఎస్‌టీపై దృష్టి పెట్టడానికి వీలవుతుంది. వివాదాస్పద పన్ను మొత్తాల్లో 70-40 శాతం చెల్లించేలా ఈ పథకం పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించడంతోపాటు, వడ్డీ, జరిమానాలను పూర్తిగా మాఫీ చేసింది. 30.06.2020తో ఈ పథకం గడువు ముగిసింది.
కొవిడ్ ప్రభావంలోనూ, ఎస్‌వీఎల్‌డీఆర్‌ఎస్ అద్భుతమైన ప్రతిస్పందనలు అందుకుంది. రూ.89,823 కోట్ల పన్ను బకాయిలకు సంబంధించి 1,89,225 డిక్లరేషన్లు అందాయి. మొత్తం రూ.27,866 కోట్లు ఖజానాకు చేరాయి. పరోక్ష పన్నుల చరిత్రలోనే ఇది అత్యుత్తమ పనితీరు.
ఈ పథకం పొడిగింపు నిర్ణయంతో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న పన్ను చెల్లింపుదారులతో సమానంగా ప్రయోజనం పొందడానికి జమ్ము&కశ్మీర్, లద్దాఖ్ పన్ను చెల్లింపుదారులకు కూడా అవకాశం దక్కినట్లయింది. పథకం పొడింగింపునకు సంబంధించిన సవివర మార్గదర్శకాలు త్వరలోనే విడుదలవుతాయి.
***
(Release ID: 1672430)
Visitor Counter : 301