మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఢిల్లీలో రేపటినుంచి మళ్లీ “హునర్ హాట్” ప్రదర్ళన.
కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చేతుల మీదుగా ప్రారంభం
“స్వదేశీ ఉత్పాదనలకే ప్రాధాన్యం” నినాదంతో
నవంబరు 11నుంచి 22వరకూ నిర్వహణ
ప్రధాన ఆకర్షణలుగా స్వదేశీ కళాఖండాలు, ఉత్పాదనలు
బంకమట్టి, లోహం, కలప, జనపనారతో తయారైన కళారూపాల అమ్మకం
“హునర్ హాట్”లో వందకు పైగా స్టాల్స్ ఏర్పాటు.
అరుదైన స్వదేశీ హస్తకళాఖండాలకు నమ్మకమైన బ్రాండ్
“హునర్ హాట్”: ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం, తదితర మార్గదర్శక సూత్రాలు తప్పనిసరి
Posted On:
10 NOV 2020 1:06PM by PIB Hyderabad
కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా దాదాపు 7 నెలలుగా మూతబడిన “హునర్ హాట్” ప్రదర్శన రేపు మళ్లీ ప్రారంభం కాబోతోంది. పితంపురలోని ఢిల్లీ హాట్.లో “హునర్ హాట్” ప్రదర్శనను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ లాంఛనంగా ప్రారంభిస్తారు. “స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యం” అన్న నినాదంతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో,.. బంకమట్టితో తయారైన సుందరమైన వస్తువులు, వివిధ లోహాలు, కలప, జనపనారతో తీర్చిదిద్దిన కళా రూపాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. బంకమట్టితో, వివిధ రకాల లోహాలతో, కలపతో తయారు చేసిన వస్తువులు, వెదురు బొంగులతో తయారైన ఉత్పాదనలు, మనసును దోచే కళాత్మకమైన కుండలు, తదితర కళారూపాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని, ఢిల్లీ హాట్ లో నవంబరు 11నుంచి 22వరకూ వాటి ప్రదర్శన, అమ్మకం సాగుతుందని నఖ్వీ చెప్పారు.
దేశంలోని ప్రతి ప్రాంతం స్వదేశీ కళాత్మక ఉత్పత్తులకు, ప్రాచీన, సంప్రదాయ కళారూపాలకు నిలయాలని నఖ్వీ అన్నారు. అంతరించే దశలో ఈ సంప్రదాయ కళలలకు.., ప్రధానమంత్రి “స్వదేశీ” నినాదం ఒక వరంగా పరిణమించిందన్నారు. “స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యం” అన్న మోదీ పిలుపుతో భారతీయ స్వదేశీ పారిశ్రామిక రంగానికి ఎనలేని ఊపు వచ్చిందన్నారు. ఈ స్వదేశీ ఉత్పత్తులను తీర్చిదిద్దుతున్న కళాకారులకు వివిధ రకాల సంస్థల ద్వారా, ఆకర్షణీయమైన ప్యాకేజీల ద్వారా ఎంతో ప్రోత్సాహం, సహాయ సహకారాలు అందుతున్నాయని అన్నారు. “ఆత్మనిర్భర్ భారత్” భావనను ఇది ఎంతో బలోపేతం చేస్తోందన్నారు. దేశంలోని ప్రతి మూలనా కలప, ఇత్తడి, వెదురు, గాజు, వస్త్రం, కాగితం, బంకమట్టి వంటి వాటితో తయారయ్యే ఉత్పత్తులు విభిన్నమైన స్వదేశీ స్వభావాన్ని, సంప్రదాయ కళను చాటుతున్నాయన్నారు. చక్కని సౌందర్యం ఉట్టిపడే ఈ కళా రూపాలను తయారు చేసే హస్తకళాకారులకు మార్కెట్ సదుపాయం కల్పించడానికి “హునర్ హాట్” చక్కని వేదికగా ఉపయోగపడుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి, సృజనాత్మకతకు, ప్రపంచ ప్రమాణాలకు దీటైన నాణ్యత కలిగిన ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు నఖ్వీ చెప్పారు.
“హునర్ హాట్”లో వందకు పైగా దుకాణాలను ఏర్పాటుచేసినట్టు నఖ్వీ తెలిపారు. అస్సాంనుంచి ఎండు పువ్వులు, బీహార్ నుంచి కృత్రిమ ఆభరణాలు, కర్ణాటక, మణిపూర్ ప్రాంతాల చక్కని కొయ్య ఆటబొమ్మలు, ఉత్తరప్రదేశ్ నుంచి గాజు బొమ్మలు, కొయ్య ఆట వస్తువులు, ఢిల్లీనుంచి సొగసైన దస్తూరీతో కూడిన వర్ణ చిత్రాలు, పెయింటింగులు, గోవానుంచి చేతి అద్దకం ఉత్పత్తులు, గుజరాత్ అజ్రక్ అద్దకం వస్త్రాలు, జమ్ము కాశ్మీర్ పాశ్మనా శాలువలు, జార్ఖండ్, మహారాష్ట్ర నుంచి టస్సర్ సిల్క్ వస్త్రాలు, వెదురు ఉత్పత్తులు, మధ్యప్రదేశ్ నుంచి బాగ్ అద్దకం వస్త్రాలు, బాటిక్ ప్రింట్లు, నాగాలాండ్ చేనేత ఉత్పత్తులు, బంకమట్టి, లోహాలు తదితర ముడిపదార్థాలతో తయారైన వివిధ రాష్ట్రాల ఆటబొమ్మలు, ఆట వస్తువులు వంటివి పితంపుర హునార్ హాట్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. దీనికి తోడు, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్ము కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా వంటి రాష్ట్రాల సంప్రదాయ వంటకాలను కూడా హునార్ హాట్ సందర్శకులు రుచిచూడవచ్చు.
గత ఐదేళ్లుగా 5లక్షలమంది భారతీయ స్వదేశీ హస్తకళాకారులకు, పాకశాస్త్ర నిపుణులకు, ఇతరులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న “హునర్ హాట్” జనంలో ఎంతో ఆదరణ సంపాదించిందని నఖ్వీ తెలిపారు. హస్తకళా కారులకు, నిపుణులకు మార్కెటింగ్ సదుపాయం, ఉపాధి కల్పిస్తున్న “హునర్ హాట్” అరుదైన సుందరమైన స్వదేశీ కళారూపాలకు విశ్వసనీయమైన బ్రాండుగా మారిందన్నారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రెండు డజన్లకు పైగా “హునర్ హాట్”లను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. వీటి ద్వారా లక్షలాదిమంది కళాకారులు, హస్తకళా నిపుణులు ఉపాధిని గుర్తింపును పొందారు. రాబోయే రోజుల్లో,..జైపూర్, చండీగఢ్, ఇండోర్, ముంబై, హైదరాబాద్, లక్నో, ఇండియా గేట్, న్యూఢిల్లీ, రాంచీ, కోట, సూరత్/అహ్మదాబాద్ నగరాల్లో “హునర్ హాట్”లు నిర్వహించనున్నారు. ఈ “హునర్ హాట్”లను వర్చువల్ పద్ధతిలో కూడా అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని నఖ్వీ చెప్పారు. ప్రజలు డిజిటల్ విధానంలో “హునర్ హాట్” ఉత్పాదనలను కొనుగోలు చేసేందుకు ఈ సారి అవకాశం కల్పిస్తున్నామని, ఆన్ లైన్ ద్వారా http://hunarhaat.org వెబ్ సైట్ లో ఇవి అందుబాటులో ఉంటాయని చెప్పారు. హస్తకళాకారులను, వారు తయారు చేసిన స్వదేశీ ఉత్పత్తులను ప్రభుత్వ మార్కెట్ వేదికపై (“GeM”పై ) కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నమోదు చేస్తోందని చెప్పారు.
రేపు తిరిగి ప్రారంభం కానున్న “హునర్ హాట్”లో సందర్శకుల మధ్య భౌతిక దూరం నిబంధన కచ్చితంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని, “హునర్ హాట్” మళ్లీ ప్రారంభం కాబోతుండటం దేశంలోని కళా వస్తువుల తయారీదార్లు, హస్తకళాకారులను ఆనందంలో ముంచెత్తుతోందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు.
(ఫైల్ పొటోలు)
************
(Release ID: 1671721)
Visitor Counter : 234