రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ప్రయాణికుల బస్సుల్లో అగ్ని ప్రమాదాలను పసిగట్టి నివారించే వ్యవస్థ
డి.ఆర్.డి.ఒ. ప్రదర్శించిన ఎఫ్.డి.ఎస్.ఎస్. వ్యవస్థ పనితీరును
వీక్షించిన కేంద్ర రక్షణ, రవాణా మంత్రులు
Posted On:
09 NOV 2020 4:18PM by PIB Hyderabad
ప్రయాణికుల బస్సుకోసం రూపొందించిన అగ్నిప్రమాద నిర్ధారణ, అగ్నిమాపక పర్యవేక్షణ వ్యవస్థ (ఎఫ్.డి.ఎస్.ఎస్.) పనితీరును రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తిలకించారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ.) రూపొందించిన ఈ సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థ పనితీరుపై ప్రదర్శనను 2020 నంవబరు 9న ఢిల్లీలోని డి.ఆర్.డి.ఒ.భవన్ లో నిర్వహించారు. ఇంజిన్ లో అగ్రిప్రమాదం తలెత్తినపుడు దాన్ని నీటి తుంపరతో అదుపు చేసేందుకు నీటి బిందువుల ఆధారంగా పనిచేసే ఎఫ్.డి.ఎస్.ఎస్. వ్యవస్థను కేంద్ర మంత్రులు వీక్షించారు. వ్యవస్థ నిర్వహించే ఇతర విధులను గురించి కూడా అధికారులు ఈ సందర్భంగా మంత్రులకు వివరించారు.
ఢిల్లీలోని డి.ఆర్.డి.ఒ.కు చెందిన అగ్నిప్రమాద, పేలుడు పదార్థాల నిరోధక, పర్యావరణ రక్షణ కేంద్రం (సి.ఎఫ్.ఇ.ఇ.ఎస్.) ఈ వ్యవస్థను రూపొందించింది. ప్రయాణికుల బస్సులో అగ్ని ప్రమాదం తలెత్తే ముప్పును 30సెకన్లలో పసిగట్టడమేకాకుండా, మరో 60సెకన్లలోనే ప్రమాదాన్ని కూడా ఇది నివారిస్తుంది. తద్వారా గణనీయమైన స్థాయిలో ప్రాణనష్టాన్ని, ఆస్తి నష్టాన్ని నివారించుకోవచ్చు. 80లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి ట్యాంకు, 200-కడ్డీ స్థాయికి కుదించిన 6.8కిలోగ్రాముల నైట్రోజెన్ సిలిండర్ ఈ వ్యవస్థలో అంతర్భాగాలు. బస్సులో అనువైన చోట, ఈ వ్యవస్థను అమర్చుకోవచ్చు. ఇంజన్ లో తలెత్తే మంటలను అదుపుకోసం నీటి తుంపరను ఉత్పత్తి చేసే ప్రత్యేక ఏర్పాటు ఎఫ్.డి.ఎస్.ఎస్. పరికరంలో ఉంటుంది. పరికరం క్రియాశీలకంగా మారిన 5 సెకన్లలోనే ఈ పరికరం మంటలను సమర్థవంతంగా అదుపు చేయగలుగుతుంది.
అగ్నిప్రమాదం ముప్పును అంచనా వేయడం, విభిన్నమైన పద్ధతిలో మంటలను అదుపు చేయడం తదితర అంశాల్లో డి.ఆర్.డి.ఒ.కు చెందిన సి.ఎఫ్.ఇ.ఇ.ఎస్. నిపుణులకు ఎంతో సామర్థ్యం ఉంది. యుద్ధ ట్యాంకులు, నౌకలు, జలంతర్గాములకు అవసరమైన అగ్ని ప్రమాద నియంత్రణ వ్యవస్థలను కూడా వారు రూపొందించారు. ప్రయాణికుల బస్సుల్లో తరచూ తలెత్తే అగ్నిప్రమాదాల ముప్పును పరిష్కరించేందుకు చురుకైన ఈ రక్షణ వ్యవస్థను సి.ఎఫ్.ఇ.ఇ.ఎస్. రూపొందించింది. అగ్ని ప్రమాదం ముప్పునకు అన్ని వాహనాల్లో ఆస్కారం ఉన్నప్పటికీ, ప్రత్యేకించి, పాఠశాలల ప్రత్యేక బస్సులపై, ఎక్కువ దూరం ప్రయాణించే స్లీపర్ కోచ్ లపై ఈ విషయంలో ఎక్కువ ఆందోళన ఉంది. అయితే, ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న పరికరాలు కేవలం ఇంజన్ లో తలెత్తిన మంటలను మాత్రమే అదుపు చేయగలిగాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త తరహా అగ్ని మాపక వ్యవస్థను రూపొందించారు.
అగ్ని ప్రమాదాన్ని తక్కువ వ్యవధిలో పసిగట్టి, నివారించే సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించిన శాస్త్రవేత్తల కృషిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఎఫ్.డి.ఎస్.ఎస్. వ్యవస్థను రూపొందించడం బస్సు ప్రయాణికుల భద్రతకు సంబంధించి గణనీయమైన పరిణామమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభివర్ణించారు. అగ్ని ప్రమాదాలనుంచి రక్షణ కల్పించే అంశంపై డి.ఆర్.డి.ఒ. శ్రద్ధ వహించడం చాలా సంతృప్తికరమని ఆయన అన్నారు. అగ్ని ప్రమాద నియంత్రణ వ్యవస్థ రూపకల్పనలో శాస్త్రవేత్తల కృషికి,.. రక్షణ, పరిశోధన అభివృద్ధి వ్యవహారాల డైరెక్టరేట్ (డి.డి.ఆర్.డి.) కార్యదర్శి, డి.ఆర్.డి.ఒ. చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి కూడా అభినందనలు తెలిపారు.
*********
(Release ID: 1671622)
Visitor Counter : 191