విద్యుత్తు మంత్రిత్వ శాఖ

భవిషత్ అవసరాలను తీర్చడానికి ఎన్ టి పి సి సిద్ధం : వైవిధ్య ప్రణాళికలకు రూపకల్పన ... ఇంధనశాఖ మంత్రి శ్రీ ఆర్ కె సింగ్

45 వసంతాలు పూర్తి చేసుకుని 46వ వసంతంలోకి అడుగుపెట్టిన సంస్థ

సమర్ధత, ఉత్తమ యాజమాన్యం, దేశ ప్రగతిలో కీలక పాత్ర .. మంత్రి కితాబు

Posted On: 07 NOV 2020 6:13PM by PIB Hyderabad

దేశ భవిషత్ ఇంధన అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ( ఎన్ టి పి సి) ప్రణాళికలను సిద్ధం చేస్తున్నదని కేంద్ర ఇంధన శాఖ సహాయ ( స్వతంత్ర) మంత్రి శ్రీ. ఆర్ కె సింగ్ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకోడానికి సంస్థ ప్రణాళికలను రూపొందిస్తున్నదని మంత్రి అన్నారు. ఎన్ టి పి సి 46వ స్థాపక దినోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. డిజిటల్ పద్దతిలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సంస్థ యాజమాన్యాన్ని, సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. అత్యంత వేగంగా తన స్థాపిత శక్తిని పెంపొందించుకుంటూ ఎన్ టి పి సి దేశ భవిషత్ ఇంధన అవసరాలను తీర్చడానికి చర్యలను తీసుకుంటున్నదని మంత్రి తెలిపారు. ' కొవిడ్ మహమ్మారి దేశాన్ని కుదిపివేసిన సమయంలో కూడా విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూసి ఎన్ టి పి సి దేశ ప్రజల అవసరాలను తీర్చగలిగింది' అని మంత్రి పేర్కొన్నారు. ' ఇంధన ఉత్పత్తిలో దేశంలో అతిపెద్ద సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఎన్ టి పి సి భవిషత్ లో ప్రపంచంలో ఇంధన రంగంలో స్థానం సంపాదించడానికి కృషి చేయాలి. సమర్ధతను పెంపొందించుకుంటూ సంస్థ ప్రతీ ఏటా ప్రగతిపథంలో ప్రయాణిస్తున్నది ' అని సింగ్ పేర్కొన్నారు.

45 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఎన్ టి పి సిని కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీ సంజీవ్ నందన్ సహాయ్ అభినందించారు. ' పునరుత్పాదక ఇంధన రంగంలో కీలక నిర్ణయాలను అమలు చేస్తూ దీనికి అవసరమైన పెట్టుబడులను పెడుతూ భవిషత్ కోసం ఎన్ టి పి సి రంగం సిద్ధం చేసుకొంటున్నది ' అని ఆయన అన్నారు. తన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో 10 నుంచి 20 శాతం వరకు బయోమాస్ ను వినియోగిస్తూ ఎన్ టి పి సి కాలుష్య నివారణకు కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. భవిషత్ లో హైడ్రోజన్ ప్రధాన ఇంధన వనరుగా మారనున్నదని గుర్తించిన ఎన్ టి పి సి ఈ దిశలో ప్రయత్నాలను మొదలు పెట్టిందని ఆయన అన్నారు.

ఎన్ టి పి సి సి ఎం డి శ్రీ గురుదీప్ సింగ్ మాట్లాడుతూ సంస్థ పురోగతికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అభివృధికి కృషి చేసిన సిబ్బంది వారి కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. ' ప్రస్తుత సంవత్సరంలో కొవిడ్ రూపంలో ఎదురైన సవాలును ఎదుర్కొని స్థాపిత శక్తికి 1784 మెగావాట్లను జోడించి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసాం. 2025నాటికి లక్ష మెగావాట్ల సామర్ధ్యాన్ని సాధించడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నాం. దీనికి అవసరమైన సరఫరా , ఉత్పత్తి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం 'అని ఆయన వివరించారు.

ఛతీస్ ఘర్ లో ఎన్ టి పి సి రెండవ 880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఈ రోజు ప్రారంభించారు.

ఆవిర్భావ దినోత్సవాలను నోయిడా లోని ఇంజినీరింగ్ కార్యాలయ ఆవరణలో పతాక ఆవిష్కరణతో ప్రారంభమైన కార్యక్రమంలో దేశం వివిధ ప్రాంతాలలో ఉన్న ఎన్ టి పి సి కేంద్రాల అధికారులు ఆన్ లైన్ లో పాల్గొన్నారు. ఉత్పత్తి, భద్రత, పర్యావరణ పరిరక్షణ, రాజభాష అమలు, ఉత్తమ ఆరోగ్య సౌకర్యాలు, సామాజిక కార్యక్రమాల అమలుకు స్వర్ణ శక్తి అవార్డులను ప్రధానం చేశారు.

కొవిడ్ వ్యాప్తితో దేశవ్యాపితంగా విధించిన లాక్ డౌన్ సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడడంలో విజయం సాధించిన ఎన్ టి పి సి సిబ్బందికి ఆవిర్భావ వేడుకల రూపంలో పండుగ వాతావరణం కనిపించింది. లాక్ డౌన్ సమయంలో విధ్యుత్ గిరాకీ పెరగడంతో ఎన్ టి పి సి కొత్త సవాల్ ఎదురయింది. ఇంజినీర్లు ఇతర సిబ్బంది అహర్నిశలు శ్రమించడంతో లక్ష్యాన్ని ఎన్ టి పి సి సాధించగలిగింది.

***

 

 



(Release ID: 1671133) Visitor Counter : 159