యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

శాయ్‌ ఎఫ్‌ఐఆర్‌పై యూపీ పోలీసుల చర్యలు; ఖేలో ఇండియా నకిలీ ప్రకటనలతో క్రీడాకారులను మోసం చేస్తున్న ముగ్గురి అరెస్ట్‌

Posted On: 06 NOV 2020 6:01PM by PIB Hyderabad

హర్యానాలోని పంచకులలో 2021లో నిర్వహించనున్న ఖేలో ఇండియా క్రీడల్లో పాల్గొనేందుకు అథ్లెట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ, రుసుముగా ఒక్కొక్కరు రూ.6 వేలు కట్టాలని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రకటనలు ప్రచారం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్‌) ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు, నిందితులను అరెస్టు చేశారు.

    నిందితుల పేర్లు సంజయ్‌ ప్రతాప్‌ సింగ్‌, అనూజ్‌ కుమార్‌, రవి. సంజయ్‌ ఆగ్రాకు చెందిన మాజీ కబడ్డీ ఆటగాడు. ఖేలో ఇండియా క్రీడల్లో పాల్గొనాలకునే అథ్లెట్లను ఆకర్షించడానికి, రుద్రప్రతాప్‌ సింగ్‌ పేరుతో సంజయ్‌ ఒక నకిలీ ఐడీ సృష్టించాడు. అథ్లెట్లు నగదు జమ చేయడానికి, కెనరా బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంకుల్లోని ఖాతా నంబర్లను అనూజ్‌, రవి ఇచ్చారు. ఈ ఖాతాలను ఆయా బ్యాంకులు జప్తు చేశాయి. ఆ ఖాతాల్లో ఎంతమంది అథ్లెట్లు, ఎంత నగదు జమ చేశారో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

***


(Release ID: 1670807) Visitor Counter : 129