శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

'సితార్‌-గీతి', 'సృష్టి-గీతి' విభాగాల్లో 'గాంధియన్‌ యంగ్‌ టెక్నోలాజికల్‌' పురస్కారాలు అందించిన డా.హర్షవర్ధన్‌

సితార్‌-గీతి కింద 14 పురస్కారాలు, 11 ప్రశంసాపత్రాలు; సృష్టి-గీతి కింద 7 పురస్కారాలు, 16 ప్రశంసాపత్రాలు అందజేత

89 ఆవిష్కరణలు, 39 పేటెంట్లు కాకుండా; ఇప్పటివరకు రూ.10 కోట్లకు పైగా విలువైన ఇతర అవార్డులు, పెట్టుబడులు సృష్టి గీతి విజేతలు అందుకున్నారు: కేంద్ర మంత్రి

Posted On: 05 NOV 2020 5:13PM by PIB Hyderabad

కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డా.హర్షవర్ధన్‌, "స్టుడెంట్స్‌ ఇన్నోవేషన్స్‌ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ - గాంధీయన్‌ యంగ్‌ టెక్నోలాజికల్‌ ఇన్నోవేషన్‌ (సితార్‌ గీతి)", "సొసైటీ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ఇనిషియేటివ్స్‌ ఫర్‌ సూటబుల్‌ టెక్నోలాజికల్‌ ఇన్నోవేషన్స్‌ - గాంధియన్‌ యంగ్‌ టెక్నోలాజికల్‌ ఇన్నోవేషన్‌ (సృష్టి గీతి)" పురస్కారాలను విజేతలకు అందించారు. వర్చువల్‌ కార్యక్రమం ద్వారా పురస్కారాలను ప్రదానం చేశారు. సితార్‌-గీతి కింద 14 పురస్కారాలు, 11 ప్రశంసాపత్రాలు; సృష్టి-గీతి కింద 7 పురస్కారాలు, 16 ప్రశంసాపత్రాలు అందజేశారు. సంబంధిత రంగాల్లో ఉన్న ఆచార్యులు, శాస్త్రవేత్తలు ఆయా ప్రాజెక్టులను క్షుణ్నంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు.

   

    గాంధియన్‌ యంగ్‌ టెక్నోలాజికల్‌ ఇన్నోవేషన్‌ పురస్కారాల్లో రెండు విభాగాలున్నాయి. 'డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ' (డీబీటీ) ఆధ్వర్యంలోని 'బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌' (బిరాక్‌) కింద సితార్‌-గీతి అవార్డులు; 'సొసైటీ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ఇనిషియేటివ్స్‌ ఫర్‌ సూటబుల్‌ టెక్నోలాజికల్‌ ఇన్నోవేషన్స్‌' కింద సృష్టి-గీతి అవార్డులు అందజేస్తారు. బయోటెక్‌, ఇతర అంకుర సంస్థలు స్థాపించేలా సాంకేతిక విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ పురస్కారాలు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేస్తారు.

    విద్యార్థులందరినీ కేంద్రమంత్రి డా.హర్షవర్ధన్‌ అభినందించారు. సామాజిక, పారిశ్రామిక, పర్యావరణ అవసరాలు తీర్చే ఆవిష్కరణలు తేవాలని, వాటి గురించి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. సృష్టి-గీతి విజేతలు ఇప్పటివరకు రూ.10 కోట్లకు పైగా విలువైన ఇతర అవార్డులు, పెట్టుబడులు అందుకున్నారని; అంతేగాక, 89 ఆవిష్కరణలు వచ్చాయని, 39 పేటెంట్లు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. మహాత్మాగాంధీ 150వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న వేళ, సామాజిక సమస్యల పరిష్కారానికి శాస్త్ర, సాంకేతికతలను ఉపయోగించిన ఆయన వారసత్వానికి మనమిచ్చే సరైన నివాళి ఇది అని అన్నారు. 

    యువ విద్యార్థులు, మహిళా స్కాలర్లు, ఇతర పరిశోధనలకు నిధుల పెంపు కోసం ప్రత్యేక శ్రద్ధతో తీసుకొచ్చిన సంస్కరణలను కేంద్ర మంత్రి గుర్తు చేశారు. డీబీటీ, బిరాక్‌, సీఎస్‌ఐఆర్‌, ఐసీఏఆర్‌ వంటివి ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్లను వినియోగించుకోవాలని, దేశాన్ని ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా తీసుకెళ్లేందుకు సాయపడాలని ఆవిష్కర్తలకు సూచించారు. "విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని పాఠశాల దశలోనే బయటకు తెచ్చేందుకు ప్రయత్నించాలి. దానివల్ల, శాస్త్ర విజ్ఞానం పట్ల అప్పుడే వారిలో ఆసక్తి ప్రారంభమవుతుంది" అని స్పష్టం చేశారు. "ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌లో ఒక్క కొవిడ్‌ పరీక్ష కిట్‌ లేదా పీపీఈ, కనీసం వెంటిలేటర్‌ కూడా తయారుకాలేదు. కానీ వంద రోజుల్లోపే వాటిలో స్వయంసమృద్ధిని సాధించడమేగాక, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరాం. శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ అందించిన వేదికలకు, బయోటెక్‌ పారిశ్రామికవేత్తలకు ధన్యవాదాలు. దేశంలో తయారయ్యే టీకాను ఇతర దేశాలతో పంచుకుంటామని భారత్‌ హామీ కూడా ఇచ్చింది" అని డా.హర్షవర్ధన్‌ వెల్లడించారు. 

    ప్రజా జీవితాల్లో మార్పు తెచ్చేలా ఆవిష్కరణలన్నీ ఉండాలని డా.హర్షవర్ధన్‌ సూచించారు. "మన శాస్త్రవేత్తల ప్రయత్నాలు సమాజానికి ఎలా ఉపయోగపడతాయన్న అంశంపై దృష్టి పెట్టి, శాస్త్రీయ సామాజిక బాధ్యత విధానం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం" అని అన్నారు.

    "దేశవ్యాప్తంగా ఉన్న 'శోధ్‌యాత్ర'ల ద్వారా కూడా, మారుమూలన ఉన్న ఆవిష్కర్తలను 'హనీ బీ నెట్‌వర్క్‌' వెలికితీసి, మద్దతునిస్తోంది. బిరాక్‌ మద్దతునిస్తున్న 'బయోటెక్నాలాజికల్‌ ఇన్నోవేషన్‌ ఇగ్నిషన్‌ స్కీమ్‌' ద్వారా, ఆవిష్కరణలు, సంప్రదాయ విజ్ఞానాలపై పనిచేసేలా అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. డీబీటీ, సీఎస్‌ఐఆర్‌, డీఎస్‌టీ ల్యాబులు యువ ఆవిష్కర్తల ఇంక్యుబేటర్లుగా మారవచ్చు. విద్యార్థులకు మార్గదర్శనం చేసేలా, అనేక విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలతో బిరాక్‌ ఈ-యువ పథకం పని చేస్తుంది. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రోత్సహించేలా పాన్‌ ఇండియా నెట్‌వర్క్‌ సృష్టికి ఇది సాయపడుతుంది" అని కేంద్ర మంత్రి వివరించారు.

    డీబీటీ కార్యదర్శి డా.రేణు స్వరూప్‌ అవార్డు గ్రహీతలను అభినందించారు. యువతలో సృజనాత్మక, ఆవిష్కరణల శక్తి పెంపు కోసం సితార్‌ను బిరాక్‌ రూపొందించడాన్ని గుర్తు చేసుకున్నారు. సీఎస్‌ఐఆర్‌ ల్యాబుల నెట్‌వర్క్‌ తరపున వీలైనంత సాయం అందిస్తామని సీఎస్‌ఐఆర్‌ కార్యదర్శి డా.శేఖర్‌ మండే భరోసా ఇచ్చారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆవిష్కరణలను వెలికితీసేందుకు 'హనీ బీ నెట్‌వర్క్‌' తరహా సహకారం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని సీఎస్‌ఐఆర్‌ మాజీ డీజీ డా.ఆర్‌.ఏ.మషేల్కర్‌ స్పష్టం చేశారు. లైఫ్‌ సైన్సెస్‌, బయోటెక్నాలజీ, వ్యవసాయం, వైద్య పరికరాలు వంటి వాటిలో విద్యార్థులు అభివృద్ధి చేసిన మంచి సాంకేతికతలకు ఏటా సితార్‌-గీతి పురస్కారాలు ఇస్తున్నట్లు 'హనీ బీ నెట్‌వర్క్‌' వ్యవస్థాపకుడు ప్రొ.అనిల్‌ గుప్తా చెప్పారు. వివిధ ఇంజినీరింగ్‌ విభాగాల్లో సృష్టి-గీతి అవార్డులు ఇస్తున్నట్లు వెల్లడించారు.

 


 
    సితార్‌-గీతి అవార్డుల కింద,  దేశవ్యాప్తంగా 96 విశ్వవిద్యాలయాలు, సంస్థల నుంచి, ఆరు విభాగాల్లో, విద్యార్థుల నుంచి 250 దరఖాస్తులు వచ్చాయి. సృష్టి-గీతి కింద, దేశవ్యాప్తంగా 270 విశ్వవిద్యాలయాలు, సంస్థల నుంచి, 42 సాంకేతిక విభాగాల్లో 700కుపైగా దరఖాస్తులు వచ్చాయి. నిపుణులు ఆన్‌లైన్‌లోనే వీటన్నింటినీ పరిశీలించి ఎంపిక చేసిన దరఖాస్తులతో జాబితా రూపొందించారు. వందలాది మంది నిపుణులు, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఐఐటీ, ఐఐఎస్సీలు, జేఎన్‌సీఏఎస్‌ఆర్‌, డీబీటీ, సీఎస్‌ఐఆర్‌, ఐసీఎంఆర్‌, ఐసీఏఆర్‌ సంస్థల డైరెక్టర్లతోపాటు ఇంకా అనేకమంది కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు.

అవార్డు గ్రహీతల జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

***



(Release ID: 1670467) Visitor Counter : 193