సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
"భారత్‌లో టెలివిజన్ రేటింగ్ ఏజెన్సీలపై మార్గదర్శకాల" సమీక్షకు కమిటీని నియమించిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
Posted On:
04 NOV 2020 8:14PM by PIB Hyderabad
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, "భారత్‌లోని టెలివిజన్ రేటింగ్ ఏజెన్సీలపై మార్గదర్శకాల"ను సమీక్షించేందుకు ఒక కమిటీని నియమించింది. ఈ మార్గదర్శకాలను 2014లో మంత్రిత్వ శాఖ జారీ చేసింది.
పార్లమెంటరీ కమిటీ, ఎంఐబీ ఏర్పాటు చేసిన టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్‌పీ) కమిటీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ సిఫారసులపై సమగ్రంగా చర్చించిన తర్వాత, ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాలను 2014లో మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
గత కొన్నేళ్లుగా జరుగుతున్న మార్గదర్శక అమలు తీరు, ఇటీవల ట్రాయ్ చేసిన సిఫారసులు, మారిన సాంకేతికత దృష్ట్యా ప్రస్తుతమున్న మార్గదర్శకాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. నమ్మకమైన, పారదర్శక రేటింగ్ వ్యవస్థ కోసం విధానాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించారు.
భారత్‌లో టెలివిజన్ రేటింగ్ వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తుతం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రస్తుత వ్యవస్థను మదిస్తుంది. ఎప్పటికప్పుడు ప్రకటించిన ట్రాయ్ సిఫారసులను, మొత్తం వ్యవస్థను పరిశీలిస్తుంది. సంబంధిత వర్గాల అవసరాలను గుర్తిస్తుంది. ప్రస్తుతమున్న మార్గదర్శకాల్లో ఏమైనా మార్పులు చేయవలసిన అవసరం ఉంటే, బలమైన, పారదర్శకత, జవాబుదారీతనమున్న రేటింగ్ వ్యవస్థ కోసం సిఫారసులు చేస్తుంది.
కమిటీ సభ్యులు:
i) శ్రీ శశి ఎస్. వెంపటి, ప్రసారభారతి సీఈవో... (కమిటీ ఛైర్మన్)
ii) డా.శలభ్, గణాంక ఆచార్యుడు, ఐఐటీ కాన్పూర్... (సభ్యుడు)
iii) డా.రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్, సీ-డాట్ కార్యనిర్వాహక డైరెక్టర్... (సభ్యుడు)
iv) ప్రొ.పులక్ ఘోష్, డెసిషన్ సైన్సెస్, సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ... (సభ్యుడు)
కమిటీ విధులు:
a. భారత్‌లో టెలివిజన్ రేటింగ్ వ్యవస్థలు, సంబంధిత అంశాలపై గతంలో వివిధ సంఘాలు చేసిన సిఫారసులపై అధ్యయనం
b. ఇటీవల ట్రాయ్ చేసిన సిఫారసులపై అధ్యయనం
c. ఈ రంగంలో పోటీ పెంచేందుకు చర్యల సూచన
d. ప్రస్తుతమున్న మార్గదర్శకాల ఉద్దేశం కాల పరీక్షకు తట్టుకుని నిలబడిందా, సంబంధిత వర్గాల అవసరాలను తీర్చిందా, ఇంకేమైనా ఉన్నాయా, అన్న విషయాలపై ప్రత్యేక పరిశీలన
e. రేటింగ్స్ అంశాలకు సంబంధించిన సమస్యలు
f. భారత్‌లో బలమైన, పారదర్శక, బాధ్యతాయుత రేటింగ్ వ్యవస్థ కోసం సిఫారసులు చేయడం
g. ఎంఐబీ ఎప్పటికప్పుడు ఇచ్చే సంబంధిత అంశాల పరిశీలన
ఈ కమిటీ, తన విధుల కోసం ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏ నిపుణుడినైనా ఆహ్వానించవచ్చు. సమాచార, ప్రసార శాఖ మంత్రికి రెండు నెలల్లో ఈ కమిటీ నివేదికను సమర్పిస్తుంది.
***
(Release ID: 1670283)
Visitor Counter : 186