జల శక్తి మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 జాగ్రత్తల మధ్యన చక్కని వినోదం, వేడుకలతో గంగా ఉత్సవ్ ప్రారంభం

Posted On: 02 NOV 2020 7:02PM by PIB Hyderabad

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గంగా ఉత్సవ్ 2020 సోమవారం ప్రారంభమయింది. ఈ సందర్భంగా నిర్వహించిన మహియాపై చర్చలో పాల్గొన్న జాతీయ స్వచ్ఛ గంగా కార్యక్రమం డైరెక్టర్ జనరల్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా బాల్యదశ నుంచి గంగానదితో తనకు గల అనుబంధాన్ని వివరించారు. “ఇది గంగానది పూర్వవైభవం పునరుద్ధరణ కోసం జరుగుతున్న వేడుక. యువ జనాభాకు గంగా నది పవిత్ర చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యత తెలియచేసినట్టయితే వారు గంగానదిని ఒక నీటి వనరుగానే కాకుండా మన భారత నాగరికతలో అంతర్భాగంగా కూడా గౌరవిస్తారు” అని శ్రీ మిశ్రా అన్నారు. మనలో ఎంతో లోతుగా పాదుకున్న విశ్వాసం ప్రాతిపదికగా గంగానది పట్ల మనకు గల కర్తవ్యాన్ని నెరవేర్చాలని ఆయన సూచించారు. గంగానది దేశంలోని అన్ని నదులకు, జలవనరులకు ప్రాతినిథ్యం వహిస్తుంది. దీన్ని నదీ ఉత్సవంగా కూడా డిజైన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ ఉత్సవం తొలిరోజు కార్యక్రమాలు వైవిధ్యంతో ఉర్రూతలూగించాయి. భారత సెమీ క్లాసికల్ గాయని డాక్టర్ రేవతి సకాల్కర్ గళంలో వినిపించిన గంగా మాతపై భక్తి  ఎవరి దృష్టిని దాటిపోలేదు. “చలో మా గంగా యమునా తీర్” అనే పాటతో సహా వివిధ భజనల ద్వారా కాశీ కోకిల నదీ వైభవాన్ని వీక్షకుల ముందు ఆవిష్కరించారు.

“ఇది ఎవరి నది” అనే శీర్షికతో ప్రముఖ కథకురాలు శ్రీమతి రీతూపర్ణా ఘోష్ చెప్పిన కథతో కహానీ జంక్షన్ సుసంపన్నం అయింది. మనం ప్రకృతిని గౌరవించకపోతే ప్రకృతి మనని రక్షించదు అనే స్పష్టమైన సందేశంతో ఆ కథ సాగింది. మరో ప్రముఖ కథకుడు శ్రీ ఆనంద్ నీలకంఠన్ మహాభారతం, ప్రాచీన పురాణాల నుంచి పవిత్ర గాథలను వివరించారు. మరో ప్రముఖ కథకుడు శ్రీ కపిల్ పాండే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్రీ క్రేజ్ ఫౌండేషన్ సహకారంతో రెండు రోజుల క్రితమే ప్రారంభమైన మినీ గంగా క్వెస్ట్ కు అద్భుత స్పందన లభించింది. ఈ క్విజ్ లో ఇప్పటికి 4 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణ సమస్యలు, పర్యావరణ పరిరక్షణ పట్ల యువతను, విద్యార్థులను చైతన్యవంతులను చేయడానికి ఈ క్విజ్ రూపొందించారు. గంగా ఉత్సవ్ జరుగుతున్నంత కాలం ఈ మినీ గంగా క్వెస్ట్ కొనసాగుతుంది. చివరి రోజున ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్ఎంసిజి సహకారంతో భావనా శర్మ నాయకత్వంలోని ట్రీ క్రేజ్ ఫౌండేషన్ ప్రతి ఏడాది ఏప్రిల్-మే నెలల్లో గంగా క్వెస్ట్ ను నిర్వహిస్తుంది. ఈ ఏడాది దానికి లక్షల్లో స్పందన వచ్చింది. 

గంగా ఉత్సవ్ కు ప్రపంచంలోని భిన్న దేశాల మద్దతు కూడా లభించింది. భారత ఆధ్యాత్మికతకు చిహ్నం అయిన గంగా నది ఒక్క భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఎంతో ప్రధానమని  కొరియన్ రాయబారి షిన్ బాంగ్ కిల్ అన్నారు. గంగానది స్వచ్ఛతలో ఎన్ఎంసిజి పాత్రను జర్మన్ రాయబారి వాల్టర్ జె లిండ్నర్ ప్రశంసిస్తూ గంగా ఉత్సవ్ ను అభినందించారు. గంగా ఉత్సవ్ కు నెదర్లాండ్స్ రాయబారి మార్టిన్ వాన్ డెన్ బెర్గ్ అభినందనలు తెలుపుతూ “భారతదేశంతో కలిసి పని చేయడానికి నెదర్లాండ్స్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉభయులం కలిసి గంగా నదిని శుద్ధి చేసి గంగా స్వచ్చతకు పాటు పడదాం” అన్నారు.

రింటూ థామస్, సుశ్మిత్ ఘోష్ రూపొందించిన అవార్డు చిత్రం ద “మిరాకిల్ వాటర్ విలేజ్” పూర్తిగా దుర్భిక్షంలో చిక్కుకున్న ఒక గ్రామాలన్నీసంఘటితమై వాననీటి సంరక్షణ విప్లవం ఏ విధంగా ప్రారంభించింది వివరించింది. అలాగే ఉషా దేవాని, నిలుత్పత్ దాస్ దర్శకత్వంలో రూపొందిన “లోకల్స్ బికమ్ జియో హైడ్రాలజిస్ట్స్ ఇన్ రాపార్” అనే చిత్రంలో ముందు చూపు గల గ్రామస్థులు నిత్యం దుర్భిక్షం వికటాట్టహాసం చేసే కచ్ ప్రాంతాన్ని ఏ విధంగా జలవనరులు పుష్కలంగా గల ప్రాంతంగా మార్చింది వివరించి స్ఫూర్తిని నింపారు. శివగంగేశ్వరరావు థర్స్ట్, ఆదిత్య శేఠ్ యాంజియోప్లాస్టీ ఆఫ్ డ్రీమ్స్, నూతన్ మన్మోహన్ వారియర్స్, సౌమిత్ర డే ఆహార్ పైన్స్ సిస్టమ్స్ పునరుజ్జీవం వంటి ప్రముఖ చిత్రాలు కూడా ప్రదర్శించారు. ప్రజల్లో విమర్శనాత్మక ఆలోచనలు రేకెత్తించి పర్యావరణం, పరిసరాల పట్ల తాదాత్మ్య భావాన్ని పెంచడం ఈ గంగా ఫిలిం ఫెస్టివల్ నిర్వహణ వెనుక గల ప్రధానోద్దేశం.

గంగా డైలాగ్స్ పేరిట ప్రముఖులతో గోష్ఠి కార్యక్రమం కూడా నిర్వహించారు. వైష్ణవ పండితుడు శ్రీ సత్యనారాయణ దాసతో ప్రముఖ రచయిత, పరిశోధకుడు రాజీవ్ మల్హోత్రా నిర్వహించిన గోష్ఠితో ఈ కార్యక్రమం ప్రారంభమయింది. గాంజెస్ అనే పదం కన్నా గంగా అనే పదానికి గల ప్రాధాన్యతపై వారు చర్చించారు. సంస్కృతం నుంచి తర్జుమా చేయదగనివి అనే పేరిట త్వరలో ప్రచురణ కాబోతున్న గ్రంథంలోని ఒక అంశం ఆధారంగా నిర్వహించిన ఈ గోష్ఠిలో గంగా అనే పదం జీవం కలిగినదని, దాన్ని గాంజెస్ గా మార్చి కేవలం ఒక జలవనరు స్థాయికి తగ్గించడంతో పాటు దోపిడీకి, నిర్లక్ష్యానికి గురయ్యేలా చేశారని వారు వివరించారు.

ఏడాది పొడవునా జరిగే నమామి గంగే ఉత్సవాల్లో భాగంగా వినూత్నరీతిలో కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. గంగా ఘాట్ల వెంబడి కళాకృతులు, కుడ్యచిత్రాల ప్రాజెక్టు గురించి మీనాక్షి పాయల్ మాట్లాడారు. ఎన్ఎంసిజి సహకారంతో తమ బృందం సభ్యులు మొజార్టో వద్ద రూపొందించిన అద్భుతమైన డిజైన్లను ఆమె ప్రదర్శించారు. నమామి గంగే ప్రాజెక్టులో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ కింద చేపట్టిన ప్రాజెక్టు ఇది. ప్రముఖ అంతర్జాతీయ చిత్రకారులు ఇందులో భాగంగా కుడ్యచిత్రాలు చిత్రించి చండీఘాట్, హరిద్వార్ లోని క్లాక్ టవర్, వారణాసిలోని పలు ఘాట్లకు మరింత ఆకర్షణ తెచ్చారు. 

ఆహారం లేకుండా ఏ ఉత్సవానికి పరిపూర్ణత చేకూరదు. కాని వర్చువల్ ఉత్సవంలో ఆహారం అందించడం అంత తేలికైన పని కాదు. గంగానది గట్టుపై విభిన్న ప్రాంతాల్లో దేశంలోని వివిధ నగరాలకు చెందిన నోరూరించే రుచులతో కూడిన ఆహారం అందించేందుకు ఢిల్లీ ఫుడ్ వాక్స్ కు చెందిన ఫుడీ ఇన్ చీప్ అనుభవ్ సప్రా “జయాకా గంగా కినారే వాలా” పేరిట ఒక కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మణ్ ఝూలాలో ప్రముఖమైన రాంఫల్, ప్రయాగ్ రాజ్ లో ప్రముఖమైన పాలక్ హల్వా, పాట్నాకు చెందిన భుజా వంటి అరుదైన రుచులతో 100కి పైగా ఫుడ్ జాయింట్లు నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖ జాతీయనాయకులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రణాళికలు రూపొందించేందుకు తరచు కలుసుకునే  కోల్కతాలోని పారమౌంట్ రెస్టారెంట్ కు కూడా ఆయన వచ్చారు.

గంగా ఉత్సవ్ లో భాగంగా పలు జిల్లాల్లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్ సిసి కాడెట్లతో కలిసి గంగా టాస్క్ ఫోర్స్ అడవుల పెంపకం కార్యక్రమం చేపట్టింది. స్థానిక యువత కోసం ప్రాజెక్టు ప్రాంతానికి ఎడ్యుకేషనల్ టూర్ నిర్వహించింది. ఉత్తరాఖండ్ తో పాటు బులంద్ షహర్, రాయబరేలి, వారణాసి, కస్ గంజ్, రాంచి నగరాల్లో నీటి వనరుల శుద్ధి, క్విజ్, పెయింటింగ్, నది గట్లపై మొక్కలు నాటడం, స్వచ్ఛత కార్యక్రమం చేపట్టారు. పలు కార్యక్రమాల్లో గంగా ప్రహారీలు, గంగా మిత్రలు, ఎన్ వైకె గంగాదూతలు చురుగ్గా పాల్గొన్నారు. రాయబరేలిలో నిర్వహించిన క్విజ్, పెయింటింగ్ కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది. వందల సంఖ్యలో పాఠశాల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. 

ఈ ఉత్సవంమరో రెండు రోజులు మంగళ, బుధవారాల్లో జరుగుతుంది. గౌరవనీయ కేంద్ర సహాయమంత్రి శ్రీ రతన్ లాల్ కటారియా ప్రసంగం, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి సందేశం, సద్గురు జగ్గీ వాసుదేవ్ సందేశం, రిచా అనిరుధ్ తో రాజీవ్ ఖండేల్వాల్ చర్చ, తపస్యతో పద్మశ్రీ అనిల్ జోషి చర్చ వంటివి రాబోయే ఆకర్షణలు. వీటికి తోడు త్రిచూర్ బ్రదర్స్ నమామి గంగే గీతం, ఇంకా ఎన్నో కథలు, చిత్రాలు రెండో రోజు ప్రదర్శనల్లో ఉన్నాయి.
కార్యక్రమాల కోసం ఈ లింక్ లు సందర్శించండి...

Links to join
http://www.gangautsav.in/
https://www.youtube.com/namamigange
https://www.facebook.com/cleanganganmcg
https://twitter.com/cleanganganmcg 

 

****


(Release ID: 1669668) Visitor Counter : 239