రక్షణ మంత్రిత్వ శాఖ
ఐఎన్ ఎస్ ఐరావత్ ద్వారా సూడాన్ దేశానికి ఆహార పదార్థాల అందజేత
Posted On:
02 NOV 2020 8:58PM by PIB Hyderabad
మిషన్ సాగర్ -2లో భాగమైన భారతదేశ నావికాదళ నౌక ఐరావత్... నవంబర్ 2, 2020న సూడాన్ నౌకాశ్రయాన్ని చేరుకుంది. ప్రకృతి విపత్తులు, కోవిడ్ -19 మహమ్మారిలాంటివాటిని ఎదుర్కొంటున్న మిత్ర దేశాలకు భారతదేశం తన వంతు సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వంద టన్నుల ఆహార పదార్థాల సాయాన్ని తీసుకొని బయలుదేరిన ఐఎన్ ఎస్ ఐరావత్ సూడాన్ దేశాన్ని చేరుకుంది.
మిషన్ సాగర్ -1 ద్వారా ఈ ఏడాది మే, జూన్ నెలల్లో భారతదేశ మిత్ర దేశాలైన మాల్దీవులు, మారిషస్, సెషెల్స్, మడగాస్కర్ , కామ్రోజ్ దేశాలకు ఆహారం, మందులను అందించడం జరిగింది. దీని తర్వాత మన దేశం సాగర్ -2ను మొదలుపెట్టింది. భారతదేశ నావికాదళ నౌక ఐరావత్ సాయంతో ఆహార పదార్థాలను సూడాన్, దక్షిణ సూడాన్, జిబౌటి, ఎరిత్రియా దేశాలకు అందించాలని సంకల్పించారు.
ఎస్ ఏ జి ఏ ఆర్ (సాగర్) ప్రాంతంలో వున్న దేశాల భద్రత, వృద్ధి సాధనకోసం ప్రధాన మంత్రి కనబరుస్తున్న దార్శనికత ప్రకారమే మిషన్ సాగర్ -2ను ప్రారంభించారు. సముద్ర జలాల్లో ఇరుగుపొరుగులాగా వుండే దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి భారతదేశం ఇస్తున్న ప్రాధాన్యతను ఇది చాటుతోంది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, ఇంకా ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ భారతదేశ నావికాదళం ఈ మిషన్ ను ముందుకు తీసుకుపోతోంది.
****
(Release ID: 1669665)
Visitor Counter : 252