జల శక్తి మంత్రిత్వ శాఖ
గుజరాత్ లో 8.5లక్షల ఇళ్లకు జలజీవన్ మిషన్ నీటి కనెక్షన్లు
76శాతం జనాభాకు నీటి సదుపాయం, 2023నాటికి లక్ష్యం సంపూర్ణం
Posted On:
29 OCT 2020 2:58PM by PIB Hyderabad
దేశంలోని 18కోట్ల మంది గ్రామీణ జనాభాకోసం 2024నాటికల్లా ఇంటింటికి కుళాయిల ద్వారా నీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది ప్రకటించిన జలజీవన్ మిషన్ పథకం అమలుకోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విశేషంగా కృషి చేస్తోంది. ఇందుకోసం ఆయా రాష్ట్రాలతో, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్ర ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తోంది. ప్రతి మనిషికీ రోజుకు 55లీటర్ల పరిశుద్ధమైన నీరు సరఫరాచేయాలన్న బృహత్తర లక్ష్యంతో జలజీవన్ మిషన్ రూపొందింది. ఈ పథకం అన్ని రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటింటికి శుద్ధమైన తాగునీటి సరఫరాతో మహిళలకు, చిన్న పిల్లలకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. భౌగోళిక పరిస్థితుల రీత్యా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు ఈ పథకం మరింత ప్రయోజనకరం.
మెట్టప్రాంతం, మరుభూమి ఎక్కువగా ఉన్న గుజరాత్ రాష్ట్రంలో నీటి సమస్య పరిష్కారానికి, నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ప్రజలకు జలజీవన్ మిషన్ ఒక వరంలా పరిణమించింది. జలజీవన్ మిషన్ పనుల ప్రగతిపై దేశవ్యాప్త సమీక్షలో భాగంగా తన మధ్యంతర సమీక్షను గుజరాత్ ఈ రోజు కేంద్ర జలజీవన్ మిషన్ అధికారులకు సమర్పించింది. జలజీవన్ మిషన్ కింద 2022-23 సంవత్సరానికల్లా రాష్ట్రంలో వందశాతం ఇళ్లకు నీటి కుళాయిల కనెక్షన్లు ఏర్పాటు చేయాలని గుజరాత్ సంకల్పించింది. రాష్ట్రంలోని మొత్తం 33జిల్లాల్లో 18,191 గ్రామాలు, 13,931 పంచాయతీలు, 247 బ్లాకులు, 35,996 ఆవాసాలు, 93,02,583 ఇళ్లు ఉన్నాయి. ఈ రోజువరకూ జరిగిన పనులమేరకు, 8,50,871 ఇళ్లకు నీటి కుళాయిల కనెక్షన్లు ఏర్పాటు చేశారు. అంటే, 76.29శాతం లక్ష్యాన్ని గుజరాత్ ప్రభుత్వం పూర్తి చేసింది.
జలజీవన్ మిషన్ పనుల్లో గుజరాత్ సాధించిన ప్రగతిని మధ్యంతర సమీక్ష ప్రతిబింబించింది. గ్రామస్థాయి నీటి సరఫరా, పారిశుద్ధ్య కమిటీల ఏర్పాటులో గుజరాత్ రాష్ట్రం చక్కని నమూనాగా నిలిచింది. సెన్సార్ల వినియోగ ప్రాతిపదికన జలజీవన్ మిషన్ పనుల ప్రగతిని సమీక్షించాలని సంకల్పించింది. అన్ని అంగన్ వాడీ కేంద్రాలకు, పాఠశాలలకు వందరోజుల్లోగా పైపులు ద్వారా నీటి సరఫరా చేయాలని 2020 అక్టోబరు 2న చేపట్టిన కార్యక్రమం విజయవంతమయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గుజరాత్ అధికారులను కోరింది. పథకంద్వారా ఆశించిన ఫలితాలను సాధనకు సులభతరమైన పనులను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్న అంశాన్ని సమీక్షలో ప్రధానంగా ప్రస్తావించారు. నీటి నాణ్యతకు సంబంధించి 7,843 గ్రామాల్లో ఎలాంటి సమస్యాలేదు. వాటిలోని 5,328 గ్రామాల్లో తగిన పరిమాణంలో నీరు అందుబాటులో ఉన్నందున, ఆ గ్రామాలకు సత్వరం మంచినీటి సరఫరా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించవచ్చని సమీక్షలో ప్రతిపాదించారు. ఈ గ్రామాల్లో నీటిసరఫరా కనెక్షన్ల ఆధునీకరణను ఈ ఏడాదిలోనే పూర్తిచేయాలని సంకల్పించారు. గుజరాత్ లో దహోద్, నర్మద అనే ఆశావహ జిల్లాలు ఉన్నాయి. దహోద జిల్లాలోని 722 గ్రామాల్లో 703 గ్రామాలకు ప్రజా నీటి సరఫరా ఏర్పాట్లు ఉన్నాయి. అయితే, వీటిలో 107 గ్రామాలకు మాత్రమే 100శాతం ఇంటింటి నీటి కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. నర్మదా జిల్లాలో మొత్తం 541 గ్రామాలకూ ప్రజా నీటి సరఫరా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, కేవలం 122 గ్రామాల్లో మాత్రమే ఇంటింటికి నీటి కుళాయి కనెక్షన్లు పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యాయి. 4,71,629 ఇళ్లకుగాను, 4,68,424ఇళ్లు మాత్రమే ప్రజానీటి సరఫరా వ్యవస్థతో అనుసంధానమై ఉన్నాయి. అయితే, 2,31,920 ఇళ్లకు (అంటే 49.17శాతం ఇళ్లకు) నీటి కుళాయిల కనెక్షన్లు ఏర్పాటయ్యాయి. కాగా, 2022 నాటికి ఒక ఆశావహ జిల్లాలో సంతృప్త స్థాయిలో నీటి కుళాయిల కనెక్షన్లు ఏర్పాటు చేయాలని గుజరాత్ ప్రభుత్వం సంకల్పించింది.
గుజరాత్ భూభాగంలో ఎక్కువ భాగం మెట్ట, మరుభూమి ఉంది. అందువల్ల జలజీవన్ మిషన్ పథకం కింద ఎడారి ప్రాంతాలు, దుర్భిక్ష ప్రభావిత ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించింది. అలాగే, ఆశావహ జిల్లాలకు, సంసద్ ఆదర్శ్ గ్రామయోజన అమలు ప్రాంతాలకు, ఎస్.సి., ఎస్.టి. ప్రాంతాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. పథకంలో అన్ని లక్ష్యాల సాధనకు కేంద్ర ప్రభుత్వం రూ. 883.07కోట్లు కేటాయించింది. 15వ ఆర్థిక సంఘం కూడా రూ. 3,195 కోట్లను కేటాయించింది. దీనికి తోడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు, 2020-21వ సంవత్సరపు స్వచ్ఛ భారత్ (గ్రామీణ) పథకం నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంది.
రాష్ట్రంలో తాగునీటి వ్యవస్థను మెరగుపరిచేందుకు తీసుకున్న పలు చర్యలను గురించి గుజరాత్ ప్రభుత్వం వివరించింది. నీటి వృథాను అరికట్టేందుకు గుజరాత్ ప్రభుత్వం 2019లో నీటిసరఫరా (రక్షణ) చట్టాన్ని ఆమోదించింది. ఇక కోస్తా గ్రామాల్లో రోజుకు 50నుంచి 200కిలో లీటర్ల నీటిని శుద్ధిచేసే సోలార్ థర్మల్ ప్లాంటును, బాబా అణు పరిశోధనా సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టింది. నీటి సరఫరా పథకాల నిర్వహణ మెరుగుదలకోసం అనేక చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం బయోమెట్రిక్ హాజరు విధానం, రోజువారీగా నీటి నాణ్యత పరిమాణాలను పరిశీలన తదితర చర్యలు తీసుకున్నారు
తాగునీటి నాణ్యతను పరీక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, నీటి నాణ్యతా పరీక్షల పరిశోధనశాలలను సామాన్య ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా చూడాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. నీటి వనరుల సుస్థిరత, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ అంశాలపై దృష్టిని కేంద్రీకరించాలని సూచించింది. క్షేత్రస్థాయి టెస్టు కిట్ల సహాయంతో నీటి నాణ్యతపై నిఘా కోసం ప్రతి గ్రామంలోనూ ఐదుగురు వ్యక్తులకు, ప్రధానంగా మహిళలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ ప్రక్రియలో సహాయంగా ఉండేందుకు గ్రామ స్థాయిలో శిక్షణతో కూడిన మానవ వనరుల సమూహాన్ని ఏర్పాటు చేయాలని, ఇందుకు గ్రామపంచాయతీ సిబ్బంది, ఇతర భాగస్వామ్య వర్గాల సామర్థ్యాల నిర్మాణం కోసం తగిన శిక్షణ ఇవ్వాలని కూడా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి సూచించింది.
******
(Release ID: 1668673)
Visitor Counter : 130