ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19పై పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిఎస్ఆర్ ప్రచారాన్ని ప్రారంభించిన డాక్టర్ హర్షవర్థన్
“కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళిక త్వరిత గతిన సిద్ధం అవుతోంది”
Posted On:
26 OCT 2020 10:31PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ కోవిడ్-19పై పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్ బి) చేపట్టిన అఖిల భారత ప్రచారోద్యమాన్ని ప్రారంభించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిఎస్ఆర్ ఆల్బమ్, సిఎస్ఆర్ వీడియోను కూడా ఆయన విడుదల చేశారు.
మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో పిఎన్ బి చురుకైన పాత్ర పోషిస్తోంది. 10 వేల బ్రాంచిల ద్వారా దేశంలోని 662 జిల్లాల్లో అవసరంలో ఉన్న వర్గాలకు 10 లక్షల మాస్కులు, శానిటైజర్లు సరఫరా చేసింది అని పిఎన్ బి చేపట్టిన సిఎస్ఆర్ కార్యక్రమాలను ప్రశంసిస్తూ హర్షవర్థన్ అన్నారు.
దేశంలోని 500 జిల్లాల్లోని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల రైతులకు ప్రత్యేక సదుపాయాలు అందుబాటులో ఉంచేందుకు మూడు నెలల కాలం పాటు అమలులో ఉండేలా బ్యాంకు 2020 అక్టోబర్ 2వ తేదీన గ్రామ్ సంపర్క్ యోజన కార్యక్రమం చేపట్టడాన్ని కూడా ఆయన ప్రశంసించారు.
జాతీయ దృక్పథంతో పిఎన్ బి చేపట్టిన కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ “గాల్వన్ లోయపై శత్రుమూకలు జరిపిన దాడిలో మరణించిన సాహస యోధుల కుటుంబాలను బ్యాంకు 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్కరించింది. సాయుధ దళాల పట్ల బ్యాంకుకు గల కట్టుబాటు, గౌరవానికి ఈ సంఘటన నిదర్శనం” అని డాక్టర్ హర్షవర్థన్ అన్నారు.
సిఎస్ ఆర్ కార్యకలాపాల్లో భాగంగా భావ్ రావ్ దేవ్ రస్ సేవా న్యాస్ కు వాహనం కొనుగోలు కోసం రూ.10.37 కోట్లు సహాయం అందించడాన్ని ప్రశంసిస్తూ అనారోగ్యానికి పాలైన వారిని ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించేందుకు న్యాస్ కు ఆ వాహనం ఉపయోగపడుతుందని చెప్పారు.
“కోవిడ్ పై భారతదేశం పోరాటం పదో నెలలోకి ప్రవేశించింది. పలు విభాగాల్లో ఆత్మనిర్భర్ ను ప్రవేశపెట్టిన దేశంగా భారత్ గుర్తింపు పొందింది. దేశంలో రికవరీ కేసులు అద్భుతంగా పెరుగుతూ యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడం కేంద్ర పర్యవేక్షణలోని కోవిడ్-19 కట్టడి వ్యూహం విజయానికి నిదర్శనం. కోవిడ్-19 మహమ్మారిని తుదముట్టించేందుకు చికిత్స, వ్యాక్సిన్ అభివృద్ధి విభాగాల్లో జరుగుతున్న శాస్ర్తీయ పరిశోధనలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ పోరాటంలతో భారత్ మరింత విజయం సాధిస్తుంది” అని డాక్టర్ హర్షవర్థన్ అన్నారు.
వివిధ విద్యాబోర్డులు నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభను నిరూపించుకుని మంచి స్కోర్ సాధించిన విద్యార్థులను బ్యాంకు సత్కరించిందని, విద్యార్థులను అసాధారణ పౌరులుగా మలచిన 10 వేల మంది ప్రముఖ ఉపాధ్యాయులను కూడా సత్కరించిందని కేంద్ర మంత్రికి బ్యాంకు అధికారులు నివేదించారు.
దేశంలోని ప్రతీ ఒక్కరికీ, సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి కూడా వ్యాక్సిన్ అందించడం ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యం అని డాక్టర్ హర్షవర్థన్ వక్కాణిస్తూ వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళిక వేగంగా సిద్ధం అవుతున్నదని చెప్పారు. “ఏ కార్యక్రమంలో అయినా చిత్తశుద్ధితో పాల్గొనే బాధ్యతాయుతమైన సంస్థగా పిఎన్ బి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల్లో కూడా భాగస్వామి అయి జాతి పురోభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నాను. దేశంలోని ప్రతీ ఒక్కరి సహకారంతోనే కోవిడ్ పై పోరాటంలో విజయం సాధ్యం అవుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
బ్యాంకు ఎండి, సిఇఒ ఎస్.ఎస్.మల్లికార్జునరావు, పిఎన్ బి ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పిఎన్ బి జోనల్ కార్యాలయాల అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1667757)
Visitor Counter : 215