ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండియా ఎనర్జీ ఫోరమ్ ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
Posted On:
26 OCT 2020 7:01PM by PIB Hyderabad
అమెరికా శక్తి శాఖ మంత్రి, శ్రేష్ఠులు శ్రీ డాన్ బ్రోయిలెట్,
సౌదీ అరేబియా శక్తి శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్- అజీజ్,
ఐహెచ్ ఎస్ మార్కిట్ వైస్ ఛైర్ మన్ డాక్టర్ డేనియల్ యెర్ గిన్,
నా మంత్రివర్గ సహచరుడు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్,
ప్రపంచ చమురు- గ్యాస్ పరిశ్రమ సారథులారా,
నమస్తే.
ఇండియా ఎనర్జీ ఫోరమ్ సెరా వారోత్సవం నాలుగో ఎడిషన్ సందర్భం లో మిమ్ములను అందరినీ కలుసుకొంటున్నందుకు సంతోషంగా ఉంది. శక్తి రంగానికి విశిష్ట సేవలందిస్తున్నందుకుగాను డాక్టర్ డేనియల్ యెర్ గిన్ కు ఇవే అభినందనలు. ఆయన ‘‘ద న్యూ మ్యాప్’’ అనే పుస్తకాన్ని ఇటీవలే రాశారు. అందుకుగాను ఆయనను ప్రశంసిస్తున్నాను.
మిత్రులారా,
ఈ సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక అంశం ఎంతో సముచితమైంది. మారుతున్న ప్రపంచం లో భారతదేశ శక్తి భవిష్యత్తు అనేది ఈ ఏడాది ప్రత్యేక అంశంగా ఉంది. మీ అందరకీ భరోసాను ఇస్తున్నాను.. భారతదేశంలో కావలసినంత శక్తి ఉంది. భారతదేశ శక్తి రంగ భవిష్యత్తు ఉజ్వలంగా, భద్రంగా ఉంది. అది ఎలాగో వివరిస్తాను.
మిత్రులారా,
ఈ ఏడాది శక్తి రంగానికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. శక్తి డిమాండు దాదాపుగా మూడింట ఒక వంతు కు పడిపోయింది. ధరలకు సంబంధించి అస్థిరత నెలకొంది. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు ప్రభావితమయ్యాయి. రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా శక్తి గిరాకీ ఇలాగే ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ సంస్థల అంచనాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇవే సంస్థలు వేస్తున్న అంచనా ప్రకారం ప్రధాన ఇంధన వినియోగదారుల్లో భారతదేశం ముందువరసలో ఉంటుంది. దీర్ఘకాలానికి చూసినప్పుడు భారతదేశ శక్తి వినియోగం రెండింతలు కానుంది.
మిత్రులారా,
ఈ శక్తి వినియోగ వృద్ధిని పలు రంగాల్లో మనం చూడవచ్చు. ఉదాహరణకు విమానయాన రంగాన్నే తీసుకుందాం. దేశీయ విమానయాన రంగాన్ని తీసుకుంటే ఈ రంగం లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం మూడో స్థానం లో ఉంది. 2024 కల్లా భారతదేశ విమాన సంస్థలు వాటి విమానాల సంఖ్య ను 600 నుంచి 1200 కు పెంచుకొంటాయి. ఇది ఈ రంగం లో ఒక పెద్ద ముందడుగు.
మిత్రులారా,
శక్తి అనేది నాణ్యంగా ఉండి, అందరికీ అందుబాటులోకి రావాలని భారతదేశం నమ్ముతోంది. సామాజిక రంగంలో, ఆర్ధిక రంగంలో మార్పు వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. ప్రజలను సాధికారులను చేయడానికి శక్తి రంగం దోహదం చేస్తుందని, అది సులభతర జీవనాన్ని ముందుకు తీసుకుపోతుందనేది మన భావనగా ఉంది. భారతదేశం నూటికి నూరు శాతం విద్యుదీకరణ ను సాధించింది. ఎల్ పిజి కవరేజీ పెరిగింది. ఈ మార్పులు ముఖ్యంగా మా గ్రామీణ ప్రాంతాలకు, మధ్యతరగతి వారికి, మహిళలకు ఉపయోగపడ్డాయి.
మిత్రులారా,
భారతదేశ శక్తి ప్రణాళిక అనేది ఈ రంగం లో న్యాయం చేయడానికి ఉద్దేశించింది. అది కూడా సుస్థిర వృద్ధికి సంబంధించి అంతర్జాతీయంగా అనుసరించవలసిన నిబద్దత ను కలిగి ఉంటూనే సాధించాలి. దీని అర్థం భారతీయుల జీవితాలను మెరుగుపరచడానికిగాను శక్తి వినియోగాన్ని పెంచుకోవలసి ఉంటుంది. అయితే అదే సమయంలో తక్కువ కర్బన ఉద్గారాలతో వినియోగం ఉంటుంది.
మిత్రులారా,
భారతదేశం శక్తి రంగమనేది వృద్ధి కేంద్రంగా, పారిశ్రామిక హితంగా, పర్యావరణ స్పృహతో ఉంది. అందుకే, నవీకరణీయ శక్తి వనరుల విషయంలో భారతదేశం అత్యధిక చైతన్యవంతమైన దేశంగా లెక్కకు వస్తోంది.
మిత్రులారా,
గత ఆరేళ్లలో, దేశవ్యాప్తంగా 36 కోట్లకు పైగా లేదా 360 మిలియన్లకు పైగా ఎల్ఇడి బల్బులను పంపిణీ చేయడం జరిగింది. అంతే కాదు ఎల్ఇడి బల్బుల ధర కూడా పదింతలు తగ్గించగలిగాం. గత ఆరేళ్లలో దేశవ్యాప్తంగా 1.1 కోట్ల లేదా 11 మిలియన్ స్మార్ట్ ఎల్ఇడి వీధి దీపాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పని చేయడంవల్ల ప్రతి ఏడాది సుమారు 60 బిలియన్ యూనిట్ల శక్తి ని పొదుపు సాధ్యపడింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఏడాది 4.5 కోట్ల లేదా 45 మిలియన్ టన్నుల కార్బన్ ఉత్పత్తిని తగ్గించి, ఆ మేరకు గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించగలిగాం. దీంతోపాటు ఈ కార్యక్రమంద్వారా ప్రతి ఏడాది 24 వేల కోట్ల రూపాయలు, లేదా 240 బిలియన్ రూపాయలను ఆదా చేయగలుగుతున్నాం. ఇలాంటి చర్యల కారణంగా స్వచ్ఛ ఇంధన పెట్టుబడి విపణి గా భారతదేశం అవతరిస్తోందని నివేదికలు చెబుతున్నాయి.
మిత్రులారా,
నేను ముందే చెప్పినట్టుగా, ప్రపంచ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనే భారతదేశం ఎల్లప్పటికీ పని చేస్తుంది. ప్రపంచ ప్రజల కోసం ఇచ్చిన హామీ ని నెరవేర్చే పనిలో మేం నిబద్దత తో పని చేస్తున్నాం. 2022వ సంవత్సరానికల్లా 175 గీగా వాట్ నవీకరణీయ శక్తి సామర్థ్యాన్ని పెంచుతామనే లక్ష్యాన్ని పెట్టుకొన్నాం. ఈ లక్ష్యాన్ని 2030వ సంవత్సరానికల్లా 450 గీగావాట్ కు పెంచుకోవడం జరిగింది. పారిశ్రామిక దేశాలతో పోల్చితే భారతదేశం అతి తక్కువ కార్బన్ ఉద్గారాలను కలిగి వుంది. అయినప్పటికీ మేం జల వాయు పరివర్తన పై పోరాటాన్ని కొనసాగిస్తున్నాం.
మిత్రులారా,
గత ఆరేళ్లుగా భారతదేశ సంస్కరణల ప్రయాణం అత్యంత వేగంగా కొనసాగుతోంది. శక్తి రంగంలో అసాధారణమైన సంస్కరణలను తీసుకురావడం జరిగింది. గత ఏడాది ఫిబ్రవరి నాటికి అన్వేషణ, లైసెన్సుల విధానం లో సంస్కరణలు కొలిక్కి వచ్చాయి ఇప్పుడు మా దృష్టి అంతా ఆదాయం నుంచి అధిక ఉత్పత్తి సాధన మీద ఉంది. 2025వ సంవత్సరానికల్లా మా అన్వేషణ సామర్థ్యాలను ఏటా 250 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 400 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచడానికి విధానాలను రూపొందించుకుంటున్నాం. దీనికి సంబంధించి అత్యధిక పారదర్శకతకు ప్రాధాన్యమిస్తున్నాం. దేశీయంగా సహజవాయువు ఉత్పత్తిని పెంచడమే ప్రభుత్వం ముందు ఉన్న ముఖ్య ప్రాధమ్యం. ఒకే దేశం- ఒకే గ్రిడ్ అనే విధానాన్ని సాధించడానికి, గ్యాస్ ఆధారిత ఆర్ధిక వ్యవస్థ వైపు మళ్లడానికి మేం ప్రణాళికలను రూపొందించుకుంటున్నాం.
మిత్రులారా,
చాలా రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడం, తగ్గడం, మళ్లీ పెరగడం అన్నట్టుగా కొనసాగుతున్నాయి. బాధ్యతాయుతమైన ధరలను మనం సాధించవలసి ఉంది. చమురు, సహజవాయువు ఈ రెండు మార్కెట్లకు సంబంధించి పారదర్శకమైన, అనువైన మార్కెట్లను రూపొందించుకునే దిశ లో కృషి చేయాలి.
మిత్రులారా,
దేశీయంగా సహజవాయువు ఉత్పత్తిని పెంచుకోవడానికిగాను, సహజవాయువు మార్కెట్ ధరలను ఒకే విధంగా ఉండేలా చేయడానికిగాను ఈ నెల మొదట్లో మేం సహజవాయువు మార్కెట్ సంస్కరణల్ని ప్రకటించడం జరిగింది. వీటి కారణంగా ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ద్వారా సహజవాయువు అమ్మకాలకు సంబంధించి అత్యధిక మార్కెట్ స్వేచ్ఛ లభిస్తుంది. ఈ ఏడాది జూన్ లో భారతదేశ మొట్టమొదటి ఆటోమేటిక్ జాతీయ స్థాయి సహజవాయువు వాణిజ్య వేదికను ప్రారంభించడం జరిగింది. సహజవాయువు మార్కెట్ ధరను నిర్ణయించడానికిగాను ప్రమాణాలతో కూడిన విధివిధానాలను ఈ వేదిక రూపొందిస్తుంది.
మిత్రులారా,
ఆత్మనిర్భర్ భారత్ అనే దార్శనికత తో మేం ముందుకు సాగుతున్నాం. ప్రపంచ ఆర్ధిక రంగాన్ని బలోపేతం చేయడానికి స్వయంసమృద్ధియుత భారతదేశం కూడా ఉపయోగపడుతుంది. మా కృషి లో ముఖ్యమైంది శక్తి భద్రత ను సమకూర్చుకోవడం. మా కృషి సానుకూల ఫలితాలను ఇస్తోందనే విషయం తెలిస్తే మీరు సంతోషిస్తారు. ఈ కరోనా సవాళ్ల కాలంలో కూడా చమురు, సహజవాయువు రంగం నుంచి మాకు పెట్టుబడులు వచ్చాయి. ఇతర రంగాల్లో కూడా మాకు అలాంటి సూచనలు కనిపిస్తున్నాయి.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా గల ప్రతిష్టాత్మక ఇంధన కంపెనీలతో వ్యూహాత్మక, సమగ్ర శక్తి భాగస్వామ్యాలను కుదుర్చుకొంటున్నాం. ‘నైబర్ హుడ్ ఫస్ట్’ విధానం మా దేశానిది. దీని ప్రకారం పరస్పర ప్రయోజనాల కోసం మా ఇరుగుపొరుగు దేశాల్లో ఇంధన కారిడార్లను అభివృద్ధి చేసుకోవడం జరుగుతోంది.
మిత్రులారా,
మానవ ప్రగతి ప్రయాణాన్ని వెలుగులతో నింపేది సూర్య కిరణాలే. భగవాన్ సూర్యనారాయణుని రథాన్ని ఏడు గుర్రాలు నడుపుతున్నట్టే భారతదేశ శక్తి రథాన్ని కూడా ఏడు ప్రధాన అంశాలు ముందుకు తీసుకుపోతున్నాయి. మార్పునకు ఉపయోగపడుతున్న ఆ అంశాలు ఇలా ఉన్నాయి.. :
1. భారతదేశాన్ని సహజవాయువు ఆధారిత ఆర్ధిక శక్తిగా రూపొందించడానికిగాను చేపట్టిన చర్యలను వేగవంతం చేయడం;
.
2. శిలాజ ఇంధనాలను ముఖ్యంగా చమురు, బొగ్గులను పర్యావరణహితంగా వినియోగించడం;
3. జీవ ఇంధనాల వినియోగం పెంచడానికిగాను దేశీయ వనరులపై అధికంగా ఆధారపడడం;
4. 2030 నాటికి 450 గీగావాట్ నవీకరణీయ శక్తి లక్ష్యాన్ని సాధించడం;
5. కార్బన్ రహిత మొబిలిటీ కోసం విద్యుత్తు వాటా ను పెంచడం;
6. హైడ్రోజన్ తో సహా వెలుగు లోకి వస్తున్న ఇంధనాల వినియోగం వైపు మరలడం;
7. అన్ని ఇంధన వ్యవస్థల్లో డిజిటల్ ఆవిష్కరణలను ప్రవేశపెట్టడం.
గత ఆరు సంవత్సరాలుగా అమలులో ఉన్న ఈ ఉజ్వలమైన శక్తి విధానాలను కొనసాగించడం జరుగుతుంది.
మిత్రులారా,
పరిశ్రమలకు, ప్రభుత్వానికి, సమాజానికి మధ్యన ఒక ముఖ్యమైన వేదికగా ఇండియా ఎనర్జీ ఫోరమ్ - సెరా వీక్ కృషి చేస్తోంది. మెరుగైన శక్తి భవిష్యత్ కోసం ప్రయోజనకరమైన ఆలోచనలను అందించడానికిగాను ఈ సమావేశం ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. భారతదేశ శక్తి రంగం ప్రపంచ శక్తి రంగానికి కావలసిన శక్తి ని ఇస్తుందని నేను మరో మారు ప్రత్యేకంగా చెప్తున్నాను. ధన్యవాదాలు.
మరో మారు ధన్యవాదాలు.
***
(Release ID: 1667738)
Visitor Counter : 239
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam