మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
అరుణాచల్ ప్రదేశ్ ఎన్.ఐ.టి. శాశ్వత భవనాలు ప్రారంభం
విద్యాసంస్థలు విద్యార్థుల్లో శాస్త్రీయ స్పృహను కలిగించాలని
వర్చువల్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి పోఖ్రియాల్ సూచన..
విద్యావ్యవస్థ మెరుగుదల లక్ష్యాంగా నూతన విద్యావిధానం తేవడంలో
విద్యా మంత్రిత్వ శాఖ కృషికి కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు అభినందన
Posted On:
26 OCT 2020 7:18PM by PIB Hyderabad
అరుణాచల్ ప్రదేశ్ లోని జాతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (ఎన్.ఐ.టి.)లో కొత్త భవన సముదాయాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన మెకానిక్ ఇంజినీరింగ్ బ్లాక్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్ బ్లాక్.లను, సెంట్రల్ ఇన్ స్ట్రుమెంటేషన్, రియాక్షన్ ఇంజినీరింగ్ లేబరేటరీ భవనాలను కేంద్రమంత్రి ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ, కేంద్ర యువజన, క్రీడా వ్యవహారాల సహాయ (ఇన్చార్జి) మంత్రి కిరెణ్ రిజిజు, అరుణాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి తాబా తెదీర్, అరుణాచల్ ప్రదేశ్ ఎన్.ఐ.టి. డైరెక్టర్ పణికేశ్వర్ మహంత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోఖ్రియాల్ మాట్లాడుతూ, అరుణాచల్ ప్రదేశ్ ఎన్.ఐ.టి. ఈశాన్య భారతావనికి అంతటికీ పథనిర్దేశక సంస్థగా పనిచేసిందన్నారు. “సమాజానికి మరింత మెరుగైన సేవలందించేందుకు అవసరమైన ప్రాంతీయ, ప్రపంచ స్థాయి ఆవశ్యకతను గుర్తించడం” అనే లక్ష్యాన్ని ఎంచుకోవడం,...ఎన్.ఐ.టి. చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఒకటని అన్నారు. విద్యార్థుల మనసుల్లో శాస్త్రీయపరమైన స్పృహను అలవరుచుకునేలా మన విద్యాసంస్థలు కృషిచేయాలని, పుస్తక పరిజ్ఞానానికి అతీతంగా యువత తమ మేథస్సుకు పనిపెట్టేలా విద్యాసంస్థలు తగిన ప్రోత్సాహం అందించాలని కేంద్ర మంత్రి సూచించారు. ఎలాంటి సవాలునైనా అవకాశంగా తీసుకోగలిగిన స్ఫూర్తిని విద్యార్థుల్లో రగిలించి, సద్వర్తునులైన మానవులుగా వారిని తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.
అరుణాచల్ ప్రదేశ్ ఎన్.ఐ.టి.లో విద్యా బోధనా, పరిశోధనా కార్యకలాపాలు గత కొన్నేళ్లుగా ఎంతగానో మెరుగుపడ్డాయని, అనేక విజయాలను సంస్థ సాధించిందని కేంద్రమంత్రి అన్నారు. 2020వ సవంత్సరానికి ఇంజినీరింగ్ కేటగిరీలో జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ నిర్వహించిన సర్వేలో ఈ సంస్థ 200వ ర్యాంక్ సాధించిందన్నారు. అలాగే,..2020వ సంవత్సరానికి జాతీయ ప్రాధాన్యం కలిగిన సంస్థలపై, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, సి.ఎఫ్.టి.ఐ.లపై ఎ.ఆర్.ఐ.ఐ.ఎ. నిర్వహించిన సర్వేలో ఈ సంస్థ బాండ్-ఏ (అంటే 11-25ర్యాంక్)ని సాధించిందన్నారు. అరుణాచల్ ఎన్.ఐ.టి.కి చెందిన బోధనా సిబ్బందిలో ఎక్కువమంది ఇంజినీరింగ్, మౌలిక వైజ్ఞానిక శాస్త్రాలు, మానవ శాస్త్రాల రంగాల్లో ఎన్నో ప్రచురణలు తీసుకురావడం, పేటెంట్లు సాధించడం, విద్యా, పరిశోధనా రంగాల్లో సంస్థ విజయాలకు నిదర్శనమన్నారు.
అగ్రశ్రేణి సంస్థగా పేరుపొందిన అరుణాచల్ ప్రదేశ్ ఎన్.ఐ.టి.,.. 53మంది అధ్యాపకులతో, దాదాపు 800మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పి.హెచ్.డి. విద్యార్థులతో నడుస్తోందని, ఇటీవల పి.హెచ్.డి. స్థాయిలో పరిశోధక విద్యార్థుల నమోదు 80శాతం పెరిగిందని, సంస్థ పరిశోధనా, అభివృద్ధి కార్యక్రమాల్లో సంస్థ తప్పనిసరిగా ముందంజవేసే అవకాశాలు ఉన్నాయని కేంద్రమంత్రి పోఖ్రియాల్ అన్నారు. కొత్త భవన సముదాయాలు ప్రారంభం కావడంతో అరుణాచల్ ప్రదేశ్ ఎన్.ఐ.టి. శాశ్వత భవనాలనుంచి మొదలైనట్టేనని, ప్రతి ఉత్తమ సంస్థా తన సిసలైన లక్ష్యాలు సాధించేందుకు శాశ్వత భవనాల ఆవరణ ఆవశ్యకమని అన్నారు.
కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు మాట్లాడుతూ, అరుణాచల్ ప్రదేశ్ ఎన్.ఐ.టి.కి, దేశంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ ఎన్.ఐ.టి.లోని విద్యార్థుల భద్రతకు, వారి అభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకున్నందుకు కేంద్ర విద్యామంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రాథమిక స్థాయినుంచి ఉన్నత స్థాయివరకూ విద్యా వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యంతో కొత్త విద్యా విధానంకోసం కృషిచేసిన విద్యా మంత్రిత్వ శాఖను ఆయన అభినందించారు. ఎన్.ఐ.టి. ఇప్పటివరకూ చేసిన కృషిని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా సత్ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.
ఎన్.ఐ.టి.కి చెందిన మెకానికల్ ఇంజినీరింగ్ బ్లాకును, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్ బ్లాకును రూ. 17.40కోట్ల వ్యయంతో నిర్మించారు. ఒక్కో బ్లాకును 7,143 చదరపు మీటర్ల విస్తీర్ణంతో నిర్మింపజేశారు. ఒక్కో బ్లాకులోను 360మంది చొప్పున సామర్థ్యంతో 7 తరగతి గదులను, వర్చువల్ తరగతి గదులతో సహా 9 లేబరేటరీలను, ఒక సమావేశ గదిని, 27 ఫ్యాకల్టీ కాబిన్లను నిర్మించారు.
కేంద్రీయ ఇన్ స్ట్రుమెంటేషన్ సదుపాయాన్ని రూ. 35లక్షల వ్యయంతో,.. రియాక్షన్ ఇంజినీరింగ్ లేబరేటరీని రూ. 5లక్షల వ్యయంతో నిర్మించారు. ప్రపంచ బ్యాంకు టి.ఇ.క్యు.ఐ.పి. నిధులతో ఈ భవనాలను నిర్మించారు. రెండు లేబరేటరీల్లోనూ పరిశోధనకోసం అధునాతన పరిజ్ఞానంతో కూడిన సదుపాయాలున్నాయి.
***
(Release ID: 1667702)