భారత ఎన్నికల సంఘం
వ్యయ పరిమితి సంబంధిత సమస్యల పరిశీలనకు కమిటీని నియమించిన ఈసీఐ
Posted On:
21 OCT 2020 7:09PM by PIB Hyderabad
వ్యయ పరిమితి సంబంధిత సమస్యల పరిశీలనకు ఇద్దరు సభ్యుల కమిటీని భారత ఎన్నికల సంఘం నియమించింది. విశ్రాంత ఐఆర్‌ఎస్, డీజీ (పరిశోధన) శ్రీ హరీష్ కుమార్, సెక్రటరీ జనరల్, డీజీ (వ్యయం) కమిటీలో సభ్యులు. ఓటర్ల సంఖ్య పెరుగుదల, వ్యయ ద్రవ్యోల్బణ సూచికలో వృద్ధి, ఇతర అంశాల్లో పెరుగుదల దృష్ట్యా; అభ్యర్థికి సంబంధించిన ఖర్చు పరిమితి సమస్యలను ఈ కమిటీ పరిశీలిస్తుంది.
కొవిడ్-19ను దృష్టిలో ఉంచుకుని, ఎన్నికల నిర్వహణ నియమాల్లోని 90వ నిబంధనలో కేంద్ర న్యాయ శాఖ సవరణ చేసింది. దీనివల్ల, ప్రస్తుతమున్న వ్యయ పరిమితి మరో 10 శాతం పెరిగింది. ఈ పెంపు, ప్రస్తుత ఎన్నికల్లో తక్షణం అమల్లోకి వస్తుంది.
28.02.2014న చేసిన ప్రకటన ద్వారా, అభ్యర్థి చేయాల్సిన వ్యయ పరిమితిని చివరిసారిగా సవరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి, 10.10.2018 నాటి నోటిఫికేషన్ ద్వారా దానిని సవరించారు.
గత ఆరేళ్లలో వ్యయ పరిమితిని పెంచలేదు. ఓటర్ల సంఖ్య 834 మిలియన్ల నుంచి 2019లో 910 మిలియన్లకు, ఇప్పటికి 921 మిలియన్లకు పెరిగినా ఈ పరిమితిని సవరించలేదు. అలాగే, వ్యయ ద్రవ్యోల్బణ సూచిక 220 నుంచి 2019లో 280కి, ఇప్పటికి 301కి పెరిగినా పరిమితి మాత్రం పెరగలేదు.
ఈసీఐ నియమించిన ద్విసభ్య కమిటీ ఈ క్రింది అంశాలను పరిశీలిస్తుంది:
i. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్యలో వచ్చిన మార్పు, వ్యయంపై దాని ప్రభావం అంచనా
ii. వ్యయ ద్రవ్యోల్బణ సూచికలో మార్పును అంచనా వేయడం, ఇటీవలి ఎన్నికల్లో అభ్యర్థులు చేసిన ఖర్చుల తీరుపై దాని ప్రభావం
iii. రాజకీయ పార్టీలు, సంబంధిత వర్గాల నుంచి సమాచారం, అభిప్రాయాల సేకరణ
iv. వ్యయంపై ప్రభావం చూపే ఇతర అంశాల పరిశీలన
v. సంబంధింత ఇతర అంశాల పరిశీలన
కమిటీ నియామకం నుంచి 120 రోజుల్లోగా, సభ్యులు తమ నివేదికను సమర్పిస్తారు.
***
(Release ID: 1667012)