ఆర్థిక మంత్రిత్వ శాఖ

బిహార్‌లో ఆదాయ పన్ను విభాగం తనిఖీలు

Posted On: 21 OCT 2020 6:39PM by PIB Hyderabad

ఇద్దరు ప్రభుత్వ కాంట్రాక్టర్ల కేసుల్లో; బిహార్‌లోని పుర్నియా, కతిహార్, సహరసాలోని వివిధ ప్రాంతాల్లో ఆదాయ పన్ను అధికారులు ఈనెల 19వ తేదీన తనిఖీలు చేపట్టారు. ఓ పట్టు వ్యాపారి కేసులోనూ భాగల్‌పూర్‌లో సోదాలు చేశారు. భారీ స్థాయిలో నల్లధనాన్ని పోగుచేసి, వివిధ అవసరాలకు ఉపయోగిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ తనిఖీలు జరిగాయి.

    సరైన పత్రాలు లేకుండానే ఈ కాంట్రాక్టర్లు కార్మిక, రవాణా, ఇంధన ఖర్చులు చూపించారు. నకిలీ పేర్లతో బ్యాంకు ఖాతాలు సృష్టించి నగదు తీసుకున్నట్లు కూడా తేలింది. సంతకాలున్న ఖాళీ బ్యాంకు చెక్కులు సహా వివిధ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చేయని ఖర్చులను కూడా పుస్తకాల్లో చూపినట్లు అధికారులు గుర్తించారు. రహస్య ఖాతాల్లో భారీగా డబ్బులు దాచుకుని, వాటినే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లుగా మార్చి, ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు పొందడానికి హామీలుగా చూపుతున్నట్లు కనుగొన్నారు. ఈ బ్యాంకు ఖాతాల నుంచి భారీ మొత్తాల్లో నగదు తీసిన్నట్లు అధికారులు సోదాల్లో గుర్తించారు. ఆ నగదు ఎందుకు తీసారో సదరు కాంట్రాక్టర్లు వివరించలేకపోయారు. ఆ రహస్య ఖాతాల లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సోదాల్లో రూ.2.4 కోట్లకుపైగా విలువైన నల్లధనం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

    పట్టు వ్యాపారి కేసులోనూ అక్రమ సరకు నిల్వలను అధికారులు గుర్తించారు. స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టిన నల్లధనానికి సంబంధించిన పత్రాలు సహా సుమారు రూ.10 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు జప్తు చేశారు. వీటి కచ్చితమైన విలువను గుర్తించి, అటాచ్‌ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. విచారణ ఇంకా కొనసాగుతోంది.

***

 



(Release ID: 1666628) Visitor Counter : 152