రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

టీవోటీ మూడో దశ కింద రూ.5,011 కోట్లను ముందస్తుగా పొందిన ఎన్‌హెచ్‌ఏఐ

Posted On: 19 OCT 2020 7:33PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌, ఝార్ఖండ్‌, బిహార్‌, తమిళనాడులో 9 టోల్‌ కేంద్రాలున్న టీవోటీ (టోల్‌-ఆపరేట్‌-ట్రాన్స్‌ఫర్‌) మూడో దశ (566 కి.మీ.)కు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అనుమతినిచ్చింది. క్యూబ్‌ మొబిలిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (క్యూబ్‌ హైవేస్‌)కు ఈ ప్రాజెక్టును అప్పగించింది. ఇందుకుగాను, రూ.5011 కోట్లను ముందస్తుగా పొందింది. కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ అధ్యక్షతన, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. సహాయ మంత్రి శ్రీ వి.కె.సింగ్‌, ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌ శ్రీ ఎస్‌.ఎస్‌.సంధు, హెన్‌హెచ్‌ఏఐ, క్యూబ్‌ హైవేస్‌ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ప్రస్తుత ప్రాజెక్టు రాయితీ కాలం 30 ఏళ్లు. ఈ వ్యవధిలో టోల్ కార్యకలాపాలు, నిర్వహణ, వసూళ్లను క్యూబ్‌ హైవేస్‌ చేపడుతుంది. టీవోటీ పద్ధతిలో ఇచ్చిన రెండో అనుమతి ఇది. మొదటి అనుమతిగా, 10 టోల్‌ కేంద్రాలున్న 681 కి.మీ. ప్రాజెక్టును ఎంఏఐఎఫ్‌ సంస్థకు 2018లో ఎన్‌హెచ్‌ఏఐ అప్పగించింది. ఇందుకుగాను, రూ.9,681.5 కోట్లను ముందస్తుగా పొందింది. పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా నిధుల ఆర్జన కోసం, టీవోటీ పద్ధతిలో మరిన్ని విస్తరణలు అప్పగించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు చేపట్టింది. 

***


(Release ID: 1665951) Visitor Counter : 119