ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రపంచబ్యాంకు అభివృద్ధి కమిటీ 102వ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

Posted On: 16 OCT 2020 7:57PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రపంచ బ్యాంకు అభివృద్ధి కమిటీ 102వ ప్లీనరీ సమావేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు.


కోవిడ్-19 సంక్షోభానికి ప్రపంచ బ్యాంకు స్పందన : ప్రాణాల పరిరక్షణ, ప్రభావవంత చర్యల పరిధి పెంపు,  వ్యవస్థను తిరిగి పట్టాలకెక్కించడం;  ఐఎంఎఫ్-డబ్ల్యుబిజి సిబ్బంది ఉమ్మడి తాజా నివేదిక :  రుణాలపై వడ్డీ రద్దు అమలు, విస్తరణ అనే అంశాలపై ఈ సమావేశం నిర్వహించారు.


ఏప్రిల్ నాటి సమావేశం కన్నా ముందే ప్రవేశించిన కోవిడ్-19 మహమ్మారి వర్థమాన, అభివృద్ధి చెందిన దేశాలను ఇప్పటికీ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నదని, పేదరిక నిర్మూలనకు ఎన్నో సంవత్సరాల పాటు శ్రమించి ఇంతవరకు సాధించిన లాభాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పెద్ద ముప్పు పొంచి ఉన్నదని శ్రీమతి సీతారామన్ తన ప్రసంగంలో హెచ్చరించారు.  మహమ్మారిని అదుపు చేయడానికి, సామాజిక, ఆర్థిక రంగాలపై దాని ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్రప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నదని ఆమె చెప్పారు.


పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీకి, ఆహార భద్రత కల్పించడానికి తొలి విడతగా 2300 కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజి ప్రభుత్వం ప్రకటించిందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఆ తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వయంసమృద్ధ భారత్ పిలుపు ఇస్తూ జిడిపిలో 10 శాతంతో సమానమైన 27,100 కోట్ల డాలర్ల విలువ గల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి ప్రకటించామన్నారు. వ్యాపార సంస్థలకు ఉపశమనం కలిగించడంతో పాటు కార్మిక చట్టాలను సరళీకృతం చేస్తూ పెను సంస్కరణలు ప్రతిపాదించామని, కేంద్రస్థాయిలో 44 కార్మిక చట్టాలను హేతుబద్ధం చేసి విలీనం చేశామని, రేషన్ కార్డులు దేశంలో ఎక్కడైనా చెల్లుబాటయ్యే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా వలస కార్మికులకు సామాజిక రక్షణ కల్పించామని ఆమె వివరించారు. నబార్డ్ కు రీఫైనాన్స్ సదుపాయం కల్పించడం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజిఎన్ఆర్ఇజిఎస్) కేటాయింపులు పెంచడం వంటి చర్యల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు 2713 కోట్ల డాలర్ల నిధులు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.


కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎదురైన సంక్లిష్ట పరిస్థితిని దీటుగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య మౌలిక వసతుల పటిష్ఠతకు 203 కోట్ల డాలర్ల నిధులు కేటాయించినట్టు శ్రీమతి సీతారామన్ తెలిపారు. ప్రపంచ సౌభ్రాతృత్వం కోసం పాటుపడే బాధ్యతాయుతమైన సభ్యదేశంగా భారత్ తన అనుభవాలను ఇతరులతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అలాగే ఇరుగుపొరుగు వారికి ప్రాధాన్యం విధానం కింద దక్షిణాసియా ప్రాంతంలో నాయకత్వ పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. 


మహమ్మారిపై పోరాటంలో ఉమ్మడి కార్యాచరణే సమర్థవంతమైన సాధనమని ఆర్థికమంత్రి అన్నారు. కోవిడ్-19 స్పందన చర్యల కోసం ప్రపంచ బ్యాంకు బృందం 4500 కోట్ల డాలర్ల నిధుల సహాయం ప్రకటించడం పట్ల హర్షం తెలుపుతూ 2020 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ శక్తివంతమైన పనితీరుకు ఇది దర్పణం పడుతుందన్నారు.  

***
 


(Release ID: 1665378) Visitor Counter : 145