యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

లక్నో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భారత మహిళల కుస్తీ జట్లకు శిక్షణా శిబిరం ప్రారంభం పరిశుభ్రత,భద్రతతో ఏర్పాట్లు

Posted On: 16 OCT 2020 6:01PM by PIB Hyderabad

లక్నోలోని  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భారత మహిళల కుస్తీ జట్లకు జాతీయ శిబిరం ప్రారంభం అయ్యింది. అక్టోబర్ 10 వ తేదీ నుంచి  పరిశుభ్రమైన వాతావరణం కట్టుదిట్టమైన భద్రతతో ఏర్పాట్ల మధ్య ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చినెలలో కరోనా ప్రభావంతో విధించిన లాక్ డౌన్ తరువాత భారత మహిళల కుస్తీ జట్టుకు శిక్షణా శిబిరాన్నితొలిసారిగా నిర్వహిస్తున్నారు. శిక్షణా శిబిరానికి క్రీడాకారిణులు చేరుకొంటున్నారు. ఏడు రోజుల క్వారంటైన్ కాలం ముగిసిన తరువాత వీరు శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

   అక్టోబర్ 10 వ తేదీ నుంచి డిసెంబర్ 31 వ తేదీ వరకు సాగే ఈ శిభిరంలో 16 మంది క్రీడాకారులు వారికి సహాయ పడేందుకు నలుగురు సహాయ సిబ్బంది పాల్గొంటారు. లక్నోలోని  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వీరికి వసతి కల్పిస్తున్నారు.

       కోవిద్-19 బారినపడకుండా చూడడానికి లక్నోలోని  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సురక్షితంగా ఉండే బయో బబుల్ ను క్రీడాకారుల కోసం ఏర్పాటు చేశారు. క్రీడాకారులతోపాటు సేవలు అందించేవారు, కార్యాలయ సిబ్బందికి రక్షణ చర్యలను అమలు చేస్తున్నారు. దీనికోసం ప్రాంగణంలో గ్రీన్ జోన్,ఎల్లో జోన్, రెడ్ జోన్లను ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ లక్షణాల కోసం సందర్శకులను ముందు గానే స్క్రీనింగ్ చేయడం జరుగుతున్నది.

     “ కుస్తీ అనేది భారతదేశంలో ప్రధానమైన క్రీడ. ఏదో ఒక సమయంలో ఇది ప్రారంభం కావల్సిందే.కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని మొదటి వారంరోజుల పాటు సామాజిక దూరాన్ని పాటిస్తూ శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. ఆ తరువాత సాధారణ శిక్షణ ప్రారంభం అవుతుంది. ఆదివారంనాటికి శిబిరంలో ఉన్నవారందరి కోవిడ్ రిపోర్టులు వస్తాయి. అందరికి నెగటివ్ వస్తుందని ఆశిస్తున్నాము. ముమ్మర శిక్షణ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు అందుబాటులోకి వస్తాయని అనుకొంటున్నాము. " అని భారత మహిళల కుస్తీ జట్టు ప్రధాన కోచ్ కుల్దీప్ మాలిక్ అన్నారు. డిసెంబర్ లో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత జట్టు ఎక్కువ పతకాలను సాధించడం ఖాయమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

      అన్ని సౌకర్యాలతో శిక్షణ లో పాల్గొంటున్న వారికి హాస్టల్లో ఏర్పాట్లను చేశారని మాలిక్ తెలిపారు. క్రీడాకారుల శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు చూస్తున్నామన్నారు.

వసతి సౌకర్యాలు చాలా బాగున్నాయి. మాకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు. జాతీయ ప్రమాణాల మేరకు ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ప్రతి రోజు ఉదయం మాకు అందించే ఆహారం వివరాలను చెబుతున్నారు. ఆహారం పరిశుభ్రంగా రుచిగా ఉంటున్నది. అన్ని ఒక పద్దతి ప్రకారం ప్రణాళికా బద్ధంగా సాగుతున్నాయి. మేము మా ఉత్తమ ప్రదర్శనను ప్రదర్శించడానికి  ఈ సౌకర్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి"  అని 2018 ప్రపంచ ఛాంపియన్  షిప్ కాంస్య పతక విజేత, 2019 లో అర్జున అవార్డు గ్రహీత అయిన పూజా  దందా అన్నారు.

      సురక్షితంగా ఉండేందుకు ఎక్కడా చేతితో తాకకుండా క్రీడాకారులు, వారి సహాయకులకు ఆహారాన్ని అందిస్తున్నారు.గ్రీన్ జోన్ లో ప్రవేశించడానికి అనుమతి పొందిన వారికి కోవిడ్ పరీక్షలను చేస్తున్నారు. ఆహారాన్ని వండుతున్నవారు,వాటిని సరఫరా చేస్తున్న వారు ప్రాంగణంలోనే ఉంటున్నారు.

         ఇప్పటికే భారత్ తరఫున ఒలింపిక్స్ లో 53కేజీల విభాగంలో వినేష్ ఫోగట్ అర్హత సాధించారు. వచ్చే ఏడాది ఆసియన్ క్వాలిఫికేషన్, ప్రపంచ క్వాలిఫికేషన్ పోటీలు జరగనున్నాయి.ఈ పోటీలలో భారత్ క్రీడాకారులు చూపే ప్రతిభ పై మిగిలిన అయిదు మహిళల ఒలింపిక్ కుస్తీ అంశాలలో అర్హత సాధించే అంశం ఆధారపడి ఉంటుంది.

***

 

 



(Release ID: 1665331) Visitor Counter : 126