శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్ అనుగుణ ప్రవర్తనపై డీఎస్టీ, సీఎస్ఐఆర్ పరిధిలోని స్వయం ప్రతిపత్తి సంస్థల అధిపతులు/సంచాలకులతో డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షతన సమావేశం
రానున్న పండుగలు-శీతాకాలం నేపథ్యంలో కరోనాతో మన
పోరులో తదుపరి రెండున్నర నెలలు కీలకం; టీకా వచ్చేదాకా
‘సామాజిక టీకా’ పద్ధతిని అనుసరిద్దాం: డాక్టర్ హర్ష్ వర్ధన్
Posted On:
16 OCT 2020 6:25PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ (డీఎస్టీ), సీఎస్ఐఆర్ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థల అధిపతులు, సంచాలకులతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా నిర్వహించిన సమావేశానికి కేంద్ర డీఎస్టీ-భూ విజ్ఞాన శాస్త్రాలు, ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు. కోవిడ్ అనుగుణ ప్రవర్తనపై “ప్రజా ఉద్యమం”లో భాగంగా సాగుతున్న కార్యకలాపాలను ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రపంచ మహమ్మారిపై జాతి సామూహిక పోరాటంలో రానున్న నెలలకుగల ప్రాముఖ్యాన్ని ఈ భేటీలో ఆయన వివరించారు. ఈ మేరకు “కోవిడ్-19పై మన పోరాటంలో ఇప్పుడు 10వ నెలలోకి ప్రవేశిస్తున్నాం. ఈ ఏడాది జనవరి 8వ తేదీన మన నిపుణుల బృందం తొలిసారి సమావేశమైంది. అప్పటినుంచి మనం అవిశ్రాంత పోరాట పథంలో కొనసాగుతున్నాం. అయితే, కోవిడ్‌పై పోరులో భాగంగా గణనీయ స్థాయిలో మౌలిక వసతులను సృష్టించామని మనం గర్వంగా చెప్పగలం” అని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ఈ యుద్ధంలో అంకితభావంతో, అలుపు లేకుండా కృషిచేస్తున్న యోధులకు వందనం చేస్తున్నానంటూ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ అవిరామ కృషిలో భాగంగా వ్యాధి పీడితులను రక్షించే క్రమంలో కొందరు యోధులు తమ ప్రాణాలు త్యాగం చేయాల్సి రావడంపై విచారం వ్యక్తం చేశారు.
దేశంలోని శాస్త్రవేత్తల అవిరళ కృషిని అభినందిస్తూ- వారంతా తమకు నిర్దేశించిన విధులకు మించి కర్తవ్య నిర్వహణలో నిమగ్నమయ్యారని మంత్రి ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రపంచంలో 9 టీకాలు అభివృద్ధి దిశగా ముందంజ వేశాయని పేర్కొన్నారు. ఇందులో 3 టీకాలు మన దేశంలో అభివృద్ధి అవుతున్నవి కాగా, ఒకటి అత్యాధునిక 3వ దశలో ఉండగా, మరో రెండు రెండో దశ ప్రయోగాల్లో ఉన్నాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో భారత్ త్వరలోనే దేశీయంగా కరోనా టీకా ఉత్పత్తిని ప్రారంభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, కోవిడ్‌పై పోరాటం ఇంకా ముగియలేదని ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. కాబట్టి మహమ్మారిపై పోరాటంలో నిర్లక్ష్యం, అజాగ్రత్త, ఉదాసీనతలను దరిచేరనీయరాదని ప్రజలను హెచ్చరించారు. “రానున్న పండుగలు-శీతాకాలం నేపథ్యంలో కరోనాతో మన పోరులో తదుపరి రెండున్నర నెలలు కీలకమైనవి. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా స్వీయ రక్షణను విస్మరించకుండా, కోవిడ్ అనుగుణ ప్రవర్తనను అనుసరించడం ద్వారా ప్రతి పౌరుడూ తన బాధ్యతను నిర్వర్తించాలి” అని పిలుపునిచ్చారు.
ఈ నెల 8వ తేదీన ‘ప్రజా ఉద్యమం’ ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ఇచ్చిన మేల్కొలుపును దేశ ప్రజలందరూ పాటించాలని డాక్టర్ హర్షవర్ధన్ కోరారు. ఆ మేరకు కోవిడ్‌పై పోరుకు తగిన విధంగా ప్రవర్తించే పద్ధతిని విడనాడరాదని విజ్ఞప్తి చేశారు. “ఈ వైరస్ ప్రపంచమంతటి మీదా దుష్ప్రభావం చూపింది. అయితే, ఎంతో సరళమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే కరోనా వైరస్ బారినుంచి చాలావరకూ బయటపడవచ్చు. బహిరంగ స్థలాల్లో మాస్కు/ముఖవస్త్రం ధరించడం, చేతులతోపాటు శ్వాసకోశ పద్ధతులు పాటించడమే సామాజిక టీకా సంబంధిత సూత్రాలుగా పరిగణించాలి” అని మంత్రి అన్నారు. వ్యాధిని నియంత్రించడంలో భౌతిక దూరం ప్రాముఖ్యాన్ని ఆయన నొక్కిచెప్పారు. దేశంలో మహమ్మారి వ్యాప్తి గొలుసును ఛేదించే దిశగా ఈ సామాజిక టీకా ప్రాముఖ్యాన్ని చాటిచెప్పడంలో అన్ని సంస్థల అధిపతులూ ముందువరుసలో నిలవాలని డాక్టర్ హర్షవర్ధన్ సూచించారు.
కోవిడ్-19పై పోరాటం గురించి డాక్టర్ హర్షవర్ధన్ వివరిస్తూ- “కోవిడ్ పీడితులకు చికిత్స విషయంలో భారత్ నిరంతరం కొత్త మైలురాళ్లను అధిగమిస్తూ వస్తోంది. కోలుకునేవారి సంఖ్య ప్రపంచం మొత్తంమీద మన దేశంలోనే అధికంగా ఉంది. అలాగే మరణాల సగటు కూడా అత్యల్పంగా నమోదవుతోంది. చురుకైన కేసుల సంఖ్య నిరంతరం తగ్గుముఖం పడుతోంది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరిస్తున్న కోవిడ్-19 నియంత్రణ వ్యూహం విజయవంతం కావడాన్ని అంతర్జాతీయ పారామితులన్నీ ఇప్పటికే నిరూపించాయి. అవసరాలకు తగిన రీతిలో రోగ నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని అనూహ్య స్థాయికి పెంచగలిగాం. లోగడ దిగుమతి చేసుకుంటూ వచ్చిన మాస్కులు, పీపీఈ సామగ్రి, వెంటిలేటర్ల విషయంలోనూ భారత్ నేడు స్వావలంబన సాధించింది” అని మంత్రి స్పష్టం చేశారు.
***
(Release ID: 1665323)
Visitor Counter : 232