రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్లో శ్రీ గడ్కరీ చేతులమీదుగా 16 జాతీయ రహదారి పథకాలకు ప్రారంభోత్సవం.. శంకుస్థాపన
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం దిశగా
రూ.15,592 కోట్లతో 1411 కిలోమీటర్ల రహదారులు
Posted On:
16 OCT 2020 2:45PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా-జాతీయ రహదారులు, ఎంఎస్‌ఎంఈ శాఖల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో 1411 కిలోమీటర్ల పొడవైన రూ.15,592 కోట్లతో నిర్మించే 16 జాతీయ రహదారి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితోపాటు కేంద్ర సహాయ మంత్రులు జనరల్ (రిటైర్డ్) డాక్టర్ వి.కె.సింగ్, శ్రీ జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు-శాసనసభల సభ్యులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ గడ్కరీ మాట్లాడుతూ- ఆంధ్రప్రదేశ్‌లో 2014 మే నెలకుముందు జాతీయ రహదారుల పొడవు 4,193 కిలోమీటర్లు కాగా, ఇప్పుడు 6,860 కిలోమీటర్ల స్థాయికి పెరిగినట్లు పేర్కొన్నారు. ఆ మేరకు గడచిన ఆరేళ్ల కాలంలో 2,667 కిలోమీటర్ల (64శాతం)దాకా పెరిగినట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ.25,440 కోట్ల విలువైన పనులు ప్రస్తుతం కొనసాగుతుండగా, మరో 34,100 కోట్ల విలువైన పనులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) దశలో ఉన్నాయని, ఇవి 2024నాటికి పూర్తికావాల్సి ఉందని చెప్పారు. కాగా, రూ.18,100 కోట్ల విలువైన పనులు ఇప్పటికే 50-60 శాతం మేర పూర్తికావచ్చాయని వివరించారు. ఈ నేపథ్యంలో ఇంకా తెగని వివిధ అంశాలపై చర్చించి సత్వర పరిష్కారం నిర్ణయించేందుకు వీలైనంత త్వరగా ఢిల్లీకి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. రాష్ట్రానికి గరిష్ఠ సంఖ్యలో అభివృద్ధి పథకాలు మంజూరయ్యేందుకు పూర్తి మద్దతునిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
దేశవ్యాప్తంగా చేపట్టిన ‘భారత్ మాల పథకం’లో భాగంగా రాష్ట్రంలో 5,000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తన్నట్లు ఆయన తెలిపారు. దీంతోపాటు 400 కిలోమీటర్ల మేర ఓడరేవుల అనుసంధాన రహదారులను కూడా ఈ పథకం కింద నిర్మిస్తున్నట్లు చెప్పారు. కీలకమైన ఆరంభ-గమ్య స్థానాల మధ్య ప్రయాణిక, సరుకు రవాణాపై శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా ఈ పథకం రూపొందిందని ఆయన గుర్తుచేశారు. ‘భారత్ మాల’ పథకం కింద దేశవ్యాప్తంగా 35,000 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం సాగుతున్నదని తెలిపారు. నవభారత నిర్మాణంపై ప్రధానమంత్రి దూరదృష్టికి అనుగుణంగా ప్రపంచస్థాయి రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. తదనుగుణంగా దేశంలో ఎన్నడూ లేనంత భారీ మౌలిక వసతుల అభివృద్ధి కోసం ‘భారత్ మాల పథకం’ కింద చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా అత్యంత ప్రధానమైన ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-అమృతసర్ కట్రా, చెన్నై-బెంగళూరు, అనంతపురం-అమరావతి తదితర మార్గాల్లో ‘వేగవంతమైన రహదారుల’ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అనంతపురం-అమరావతి మధ్య 335 కిలోమీటర్ల ‘ఎక్స్‌ప్రెస్ వే’ నిర్మాణంలో ఉందని శ్రీ గడ్కరీ తెలిపారు. ఈ నియంత్రిత వేగవంతమైన మార్గం ద్వారా రాష్ట్ర రాజధాని ప్రాంతంతో కోస్తా, ఉత్తరాంధ్ర అనుసంధానం కాగలవని పేర్కొన్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల ఆర్థిక ప్రగతి బహముఖంగా విస్తరించగలదని తెలిపారు. ఈ మార్గం పనుల్లో 16 ప్యాకేజీలుండగా, వీటిని రూ.20,000 కోట్లతో చేపట్టినట్లు వివరించారు. ఈ మార్గం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిని రాయలసీమ ప్రాంతంలోని అనంతపురంతో కలుపుతుందన్నారు. దీంతోపాటు రాష్ట్రానికి జీవనరేఖల్లాంటి 44వ-16వ జాతీయ రహదారులు అనుసంధానం కాగలవని చెప్పారు.
భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా బెంగళూరు-చెన్నై మార్గంలో 262 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నియంత్రిత వేగవంతమైన మార్గంతో తమిళనాడు-కర్ణాటక రాజధాని నగరాలైన బెంగళూరు, చెన్నైల మధ్య అనుసంధానం పెరిగి, ఆ ప్రాంతాలు ఆర్థికంగా పురోగమించగలవని తెలిపారు. కాగా, 85 కిలోమీటర్ల పొడవుగల రూ.5,200 కోట్ల విలువైన 3 ప్యాకేజీల పనులు ఆంధ్రప్రదేశ్ పరిధిలో జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఇక 878 కిలోమీటర్ల పొడవుగల రూ.7,585 కోట్ల విలువైన మరో 16 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు కాగా, నిర్మాణం ప్రారంభం కానుందని వెల్లడించారు. విజయవాడ నగర పరిధిలోని బెంజ్ సర్కిల్-పశ్చిమప్రాంత ఫ్లై-ఓవర్ కూడా ఇందులో భాగంగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగమనం లక్ష్యంగా ఈ ప్రాజెక్టుల పనులన్నిటినీ వేగంగా పూర్తిచేసేందుకు తమ మంత్రిత్వశాఖ కట్టుబడి ఉందని శ్రీ గడ్కరీ ప్రకటించారు. కాగా, అమరావతి-అనంతపురం మధ్య ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కోసం భూ సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని ఆయన చెప్పారు. అదేవిధంగా ఇతర ప్రాజెక్టుల విషయంలో ఈ సహకారాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ మేరకు రహదారి రుసుము కేంద్రాల (టోల్-ప్లాజా) సమస్యలను పరిష్కరించాలని, భూ సేకరణకు సంబంధించి పరిహారం చెల్లింపులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
ఇక రూ.8306 కోట్ల వ్యయంతో చేపట్టిన 637 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టులు 2020-21 మధ్య పూర్తికాగలవని మంత్రి తెలిపారు. వీటిలో భారత జాతీయ రహదారుల ప్రాధికారం సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రూ.3850 కోట్లతో 150 కిలోమీటర్ల మేర 8 ప్రాజెక్టులు చేపట్టిందని చెప్పారు. మరో 487 కిలోమీటర్ల పొడవుగల రూ.4,456 కోట్ల విలువైన 19 ప్రాజెక్టులు తమ మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్నాయన్నారు. ఇవేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 535 కిలోమీటర్ల పొడవుగల రూ.11,712 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. వీటిలో రూ.9071 కోట్లతో 217 కిలోమీటర్ల పొడవైన 4 ప్రాజెక్టులను ‘ఎన్‌హెచ్‌ఏఐ’; 318 కిలోమీటర్ల పొడవుగల 9 ప్రాజెక్టులను రూ.2641 కోట్లతో కేంద్ర రోడ్డురవాణా-జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ చేపడతాయన్నారు. అలాగే రూ.34,133 కోట్ల విలువైన మరో 2371 కిలోమీటర్ల ప్రాజెక్టులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక దశలో ఉన్నాయని వివరించారు. వీటిలో ‘ఎన్‌హెచ్‌ఏఐ’కి సంబంధించి రూ.19559 కోట్ల విలువైన 713 కిలోమీటర్ల పొడవుగల 10 ప్రాజెక్టులు, రూ.7004 కోట్లతో 404 కిలోమీటర్ల పొడవుగల 24 ‘పీసీ’ ప్రాజెక్టులు, 1254 కిలోమీటర్ల పొడవుగల రూ.7,570 కోట్ల విలువైన 20 ప్రాజెక్టులు తమ శాఖ పరిధిలో ఉన్నాయని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన వివిధ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంపై కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజల మెరుగైన ప్రగతికి కేంద్ర ప్రభుత్వం సదా మద్దతివ్వాలని కోరారు. కాగా, కేంద్రంలో ఎన్డీఏ తొలి ఐదేళ్ల పదవీకాలంలో రాష్ట్రం నుంచి పంపిన కొన్ని ప్రతిపాదనలకు ఇంకా ఆమోదం లభించాల్సి ఉందని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 8 రహదారి ప్రాజెక్టులను ప్రాధాన్యం ప్రాతిపదికన చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. కేంద్ర రోడ్డురవాణా-జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) డాక్టర్ వి.కె.సింగ్ మాట్లాడుతూ- ఆంధ్రప్రదేశ్‌ను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. అనేక రోడ్డు మార్గాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడలిగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ రహదారుల పథకాల పూర్తితో రాష్ట్రం సంపన్నం కాగలదని చెప్పారు. ఈ పథకాల పనుల్లో నిమగ్నమైన అందరినీ ఆయన అభినందించారు. రాష్ట్రానికి త్వరలోనే మరిన్ని పథకాలు మంజూరు కాగలవని, తద్వారా ఆంధ్రప్రదేశ్ సుసంపన్న, ఆనందదాయక రాష్ట్రం కాగలదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
***
(Release ID: 1665169)
Visitor Counter : 944