పర్యటక మంత్రిత్వ శాఖ

దేశంలో టూరిజం పునరుద్ధరణకు 'దేఖో అప్నాదేశ్' స్వదేశీ పర్యాటకానికి ప్రోత్సాహం అవసరం

15 రాష్ట్రాల పర్యాటక మంత్రులు, అధికారులకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ సూచన

Posted On: 15 OCT 2020 6:09PM by PIB Hyderabad

పర్యాటక రంగం పునరుద్ధరణపై 15 రాష్ట్రాల పర్యాటకశాఖల మంత్రులు, అధికారులతో కేంద్ర సాంస్కృతిక వ్యవహారాలు, పర్యాటక శాఖ సహాయ (ఇన్చార్జి) మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ 2020 అక్టోబరు 15న వర్చువల్ సమావేశం నిర్వహించారు. వివిధ రాష్ట్రాల పర్యాటక శాఖల మంత్రులు ఈ వెబినార్ లో పాల్గొన్నారు.  రాజస్థాన్ తరఫున గోవింద్ సింగ్ డోటాసరా, ఉత్తరప్రదేశ్ తరఫున డాక్టర్ నీలకంఠ్ తివారీ, ఉత్తరాఖండ్ నుంచి సత్పాల్ మహరాజ్, గోవానుంచి మనోహర్ అయిగావోంకర్, మహారాష్ట్రనుంచి ఆదిత్య థాకరే, మధ్యప్రదేశ్ నుంచి సుశ్రీ ఉషా ఠాకూర్, గుజరాత్ నుంచి జవహర్ చావ్దా ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. కొన్నిరాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల తరఫున అధికారులు వెబినార్ లో ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి యోగేంద్ర త్రిపాఠి, డైరెక్టర్ జనరల్ మీనాక్షి శర్మ, పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా రెండు రోజుల ఈ వెబినార్ సదస్సుకు హాజరవుతున్నారు.  

 

 సమావేశం చర్చనీయాంశాలు ఈ విధంగా ఉన్నాయి.:

  1. స్వదేశీ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ప్రయాణాలను సానుకూల పరచడం
  2. పర్యాటక, ఆతిథ్య రంగం అందించే ప్రోత్సాహకాలు
  3. భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఆతిథ్య పారిశ్రామిక రంగాన్ని తీర్చిదిద్దే అంశంపై మధింపు, అవగాహన, శిక్షణకోసం ఒక వ్యవస్థను (సాథీ-ఎస్.ఎ.ఎ.టి.హెచ్.ఐ.ని) రూపొందించేందుకు ఉమ్మడిగా కృషి చేయడం.
  4. పర్యాటక రంగం పునరుద్ధరణకు కావలసిన ‘పురోగామ పథం’పై సూచనలు.. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన ఆతిథ్య పారిశ్రామిక రంగపు జాతీయ సమగ్ర సమాచార వ్యవస్థ (నిధి) పథకం రూపకల్పన కోసం పనిచేయడం.  ఆతిథ్య రంగానికి చెందిన విభాగాలు, తదితర సంబంధిత అంశాలపై సమాచారంతో బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం.

    ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి సంక్షోభంతో అతి తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో పర్యాటక రంగం కూడా ఉందని, అయితే, పర్యాటక రంగాన్ని పునరుద్ధణకోసం సంబంధిత భాగస్వామ్య వర్గాలతో చర్చలు జరుపుతూ వస్తున్నామని అన్నారు. పర్యాటక రంగం త్వరలోనే ఊపందుకోగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత పరస్థితుల్లో చాలా కీలకంగా మారుతున్న, పర్యాటక రంగానికి చెందిన సాథీ, నిధి వ్యవస్థలను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. మొదట్లో మనకు హోటళ్ల రిజిస్ట్రేషన్లు 1,400 మాత్రమే ఉండేవని, నిధి పథకం కారణంగా 27వేల హోటళ్లు రిజిస్టరయ్యాయని, నమోదయ్యే హోటళ్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోందని అన్నారు. పర్యాటక, ఆతిథ్య రంగానికి సంబంధించి పూర్తి విశ్వసనీయమైన సమాచారాన్ని ఇది అందిస్తోందన్నారు. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కారణంగా ఎదురయ్యే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు, సురక్షితంగా పర్యాటక కార్యకలాపాలను కొనసాగించేలా సన్నద్ధతపడేందుకు సాథీ దోహదపడుతున్నదని, దీనితో పర్యాటకుల్లో కూడా ప్రయాణాలపై ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు.  కరోనా వైరస్ సంక్షోభం తలెత్తక మునుపే 'దేఖో అప్నా దేశ్' అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారని, ఈ  కార్యక్రమం కింద స్వదేశీ పర్యాటక రంగంపై దృష్టిని కేంద్రీకరించాలని, దేశంలో పర్యాటరంగం పునరుద్ధరణకు ఇది దోహదం చేస్తుందని అన్నారు. స్వదేశీ పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉన్న కొత్త పర్యాటక స్థలాలను గుర్తించాలని పర్యాటక మంత్రులందరికీ కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా, పర్యాటకుల అంతర్రాష్ట్ర ప్రయాణాలపై అన్ని రాష్ట్రాలు ఒకేరకమైన నియమావళితో ముందుకు రావాలని, అప్పుడే పర్యాటకులు నిరాటంకంగా ప్రయాణాలు సాగించగలరని అన్నారు.

  రాష్ట్రాల రహదారులు, హోటళ్లు, పర్యాటక స్థలాలకు సంబంధించిన ఇతర సదుపాయాల సమాచారంతో          ఒక వేదికను రూపొందించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్టు ప్రహ్లాద్ పటేల్ చెప్పారు. వాతావరణ పరిస్థితితోపాటుగా పర్యాటక రంగం ఇతర సమాచారాన్నిఇంకా నవీకరించవలసి ఉందన్నారు. తగిన సమాచారంతో కూడిన వేదికను సత్వరం ప్రారంభించేందుకు వీలుగా రాష్ట్రాలన్నీ తమ సమాచారాన్ని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు అందించాలన్నారు.

   పర్యాటక స్థలాల మధ్య మెరుగైన అనుసంధానం అవసరమని, అలాంటపుడే, మారుమూల ప్రాంతాలకు కూడా పర్యాటకుల రద్దీ పెరుగుతుందని అన్నారు. పర్యాటక విధానం ముసాయిదాను పర్యాటక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు పంపించిందని, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ విధానానికి అనుగుణంగా రాష్ట్రాలు కూడా తమ విధానాలు రూపొందించుకోవాలన్నారు. పర్యాటక విధానాన్ని మరింత పరిపుష్టం చేసేందుకు రాష్ట్రాలు తమ విలువైన సూచనలివ్వాలన్నారు. పర్యాటక రంగంలో గైడ్లకు శిక్షణ ఇచ్చేందుకు రూపొందిచిన ఇన్ క్రెడిబుల్ ఇండియా సర్టిఫికేషన్ ప్రోగ్రాం (ఐ.ఐ.టి.ఎఫ్.),.. ఉపాధికల్పనకు జాతీయ స్థాయిలో శక్తివంతమైన కార్యక్రమంగా గుర్తింపు పొందిందన్నారు.   ఈ కార్యక్రమం కింద 6వేలమంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని, అర్హత కలిగిన వారు ఇ-మార్కెట్ వేదికలోకి అందుబాటులోకి రానున్నారని అన్నారు. టూరిజం డిమాండ్.ను పునరుద్ధించడం, ప్రత్యేకించి స్వదేశీ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని తిరిగి పట్టాలెక్కించే విషయమై పర్యాటక, ఆతిథ్య రంగం ప్రతినిధులతో తమ మంత్రిత్వ శాఖ చర్చలు సాగిస్తూనే ఉందన్నారు. పర్యాటక పరిశ్రమ ఇబ్బందులపై పర్యాటక శాఖలోని వివిధ విభాగాలతో మంత్రిత్వ శాఖ మేధోమధనం జరుపుతూ వస్తోందన్నారు.

    కోవిడ్-19 వైరస్ వ్యాప్తితో ఎదురైన సవాళ్లు, సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన చర్యల గురించి 2020 మే నెలలో వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పర్యాటక కార్యదర్శులతో వర్చువల్ సమావేశాన్ని కేంద్ర టూరిజం శాఖ మంత్రి నిర్వహించారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, వివిధ రాష్ట్రాలు పరస్పర సమన్వయంతో తీసుకోదగిన చర్యలపై వెబినార్ సదస్సులో చర్చించారు.

 

వర్చువల్ సమావేశంలో అంగీకారం కుదిరిన అంశాలు:

  • పర్యాటక రంగ పరిశ్రమ అవసరాలను, ఆవశ్యకతను అవగాహన చేసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవతో వ్యవహరిస్తున్నాయన్న భావనను నిర్ధారించేందుకు భాగస్వామ్య వర్గాలతో  తరచూ చర్చలు నిర్వహించడం.
  • సంక్షోభంనుంచి పర్యాటకరంగ సంబంధిత భాగస్వామ్య వర్గాలు గట్టెక్కేలా సహాయపడేందుకు వారికి తగిన సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ, రాష్ట్రాల పర్యాటక శాఖలు కలసి ఉమ్మడిగా పనిచేయడం
  • పర్యాటక రంగ పునరుద్ధరణలో స్వదేశీ పర్యాటక రంగం ముందస్తుగా కోలుకోగలదు కాబట్టి, స్వదేశీ టూరిజాన్ని మరింత క్రియాశీలకంగా ప్రోత్సహించడం
  • కోవిడ్ తో మెట్రోపాలిటన్ నగరాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి కాబట్టి, తక్కువ స్థాయిలో ప్రభావితమైన ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత ప్రాంత రాష్ట్రాలకు స్వదేశీ పర్యాటక రంగంలో ఎక్కువ అవకాశాలు కల్పించడం. ప్రయాణాలపై ప్రజల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఇది దోహదపడుతుంది.
  • తక్కువ దూర ప్రయాణాలతో కూడిన పర్యాటక ప్రణాళికను రూపొందించడం, ఈ ప్రక్రియను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించడం.
  • ప్రస్తుతం అసంఘటితంగా ఉన్న పర్యాటక కార్మికుల్లో ఎక్కువ మందిని, ఇతర సిబ్బందిని సంఘటిత శ్రామిక శక్తిగా మార్చే వ్యవస్థ రూపకల్పనకోసం పనిచేయడం.

-కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పర్యాక మంత్రిత్వ శాఖ చర్యలు-

    దేశవ్యాప్తంగా సందర్శకుల బస, వసతి ఏర్పాట్లపై సమాచారంతో కూడిన ఒక డేటాబేస్ వ్యవస్థ తక్షణావసరమన్న అంశాన్ని ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం ప్రధానంగా గుర్తు చేసింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి, అభివృద్ధి చేయడానికి, వసతి సదుపాయాల ప్రాంతాల సమాచారాన్ని తెలుసుకోవడంలో పర్యాటకులకు సహాయపడటానికి, వివిధ పర్యాటక ప్రదేశాల్లో వసతి సామర్థ్యాన్ని, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరాన్ని అంచనా వేయడానికి, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణా ప్రణాళికలను రూపొందించడానికి ఇలాంటి డాటా బేస్ ఎంతో అవసరం, కీలకం. 

   దేశ వ్యాప్తంగా ఉండే వసతి సదుపాయాల యూనిట్ల సమాచారాన్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాగాల సహాయంతో నమోదు చేయడానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ ఆతిథ్య పరిశ్రమ సమగ్ర సమాచార వ్యవస్థ (నిధి) పోర్టల్ లో ఈ సమాచారాన్ని పొందుపరిచేందుకు కృషి జరుగుతోంది. 2020, జూన్ 8న క్రియాశీలకంగా మారిన నిధి పోర్టల్ లో, అక్టోబరు 13నాటికి, 25,785 వసతి యూనిట్ల సమాచారం నమోదైంది.

   కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆతిథ్య పరిశ్రమ సురక్షితంగా, ఎలాంటి విపత్కరక పరిస్థితి తలెత్తకుండా తమ కార్యకలాపాలను కొనసాగించేలా, సహాయ పడేందుకు పర్యాటక మంత్రిత్వ శాఖ పలు చర్యలు తీసుకుంది. భారతీయ నైపుణ్య మండలి (క్యు.సి.ఐ.)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆతిథ్య పరిశ్రమకు మధింపు, అవగాహన, శిక్షణ అంశాలతో కూడిన వ్యవస్థ (సాథీ) ద్వారా ఈ సహాయం అందించేందుకు మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. ప్రధానమంత్రి ప్రకటించిన “ఆత్మనిర్భర్ భారత్” నినాదానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శక సూత్రాలపై ఆతిథ్యరంగ పరిశ్రమకు అవగాహన కల్పించడమేకాక, తగిన భద్రతా ప్రమాణాలు, పారిశుద్ధ్య ప్రమాణాలను ఆతిథ్య పరిశ్రమ  పాటిస్తోందన్న భరోసాను సదరు పరిశ్రమలోని సిబ్బందికి, పర్యాటక అతిథులకు కల్పించే ఉద్దేశంతోనే ఈ వ్యవస్థను రూపొందించారు.

 

        మొత్తం 3 దశల్లో ఈ చర్యలు ఉంటాయి.:

  1. స్వయం ధ్రువీకరణ: ఈ దశలో మార్గదర్శక సూత్రాలను, అనుసరించవలసిన కీలక అంశాలను అర్థంచేసుకోవలసి ఉంటుంది. హోటల్, లేదా హోటల్ యూనిట్ సాథీ వ్యవస్థను చదివి అర్థం చేసుకుంటుంది. ఆయా అవసరాలు ఎక్కడ వర్తిస్తాయో తెలుసుకుని అందుకు అనుగుణంగా సాధ్యమైనంత సంపూర్ణ స్థాయిలో పనిచేయడానికి అంగీకరిస్తుంది. స్వయం ధ్రువీకరణను ఈ దశలోనే జారీ చేస్తారు.
  2. వెబినార్లు: సాథీ వ్యవస్థలోని కీలకమైన అంశాలపై ఈ దశలో హోటళ్లు తమ సామర్థ్యాలను నిర్మించుకుంటాయి. స్వయం ధ్రువీకరణ చేసుకున్న హోటళ్లు, హోటల్ యూనిట్లు ఆన్ లైన్ వెబినార్ సదస్సులకు హాజరవుతాయి. తమ అనుమానాలను ప్రత్యక్షంగా ఆన్ లైన్ ద్వారా తీర్చుకుంటాయి.
  3. స్థలం-అంచనా (ఐచ్ఛికం) : ఈ దశలో క్షేత్రస్థాయిలో వాస్తవంగా అమలు చేయాల్సిన నిర్వహణా నియమావళిని, మార్గదర్శక సూత్రాలను, పూడ్చవలసిన అంతరాలను గురించి తగిన చర్యలు తీసుకుంటారు. హోటళ్లు, హోటల్ యూనిట్లు తమకు అవసరం అనిపిస్తే, స్థలంపై అంచనా ప్రక్రియను చేపట్టవచ్చు.  సాథీ వ్యవస్థ ప్రాతిపదికగా, భారతీయ నైపుణ్య మండలి (క్యు.సి.ఐ.) గుర్తింపు పొందిన సంస్థల ద్వారా ఈ ప్రక్రియను చేపట్టవచ్చు. అంచనా ప్రక్రియపై నివేదికను అంచనా యూనిట్ కు పంపిస్తారు.

  కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన సాథీ, నిధి వ్యవస్థలకు సంబంధించిన తమ తాజా సమాచారాన్ని 15 రాష్ట్రాలూ ఈ వెబినార్ సదస్సులో అందజేశాయి.  పర్యాటక పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఈ చర్యలు ఎంతో దోహదపడతాయని రాష్ట్రాలు పేర్కొన్నాయి. మహమ్మారి వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందించడానికి తాము ప్రతిపాదించిన విభన్నమైన చర్యలను రాష్టాలు వివరించాయి. పర్యాటక రంగం పునరుద్ధరణ త్వరలోనే జరుగుతుందన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశాయి. 

   ఇంకా, ఇప్పటివరకూ ప్రజలకు అంతగా తెలియని గిరిజన పర్యాటకం, వ్యవసాయ పర్యాటకం, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి అంశాలను ప్రోత్సహించేందుకు పలు సూచనలను రాష్ట్రాలు సమర్పించాయి. పర్యాటకుల సురక్షిత ప్రయాణానికి తగిన చర్యలు తీసుకుంటామని, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన నియమావళికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశాయి. ఆతిథ్య రంగంలో వాణిజ్యాన్ని మరింత సానుకూలంగా మలిచేందుకు తాము తీసుకుంటున్న చర్యలను రాష్ట్రాలు వివరించాయి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖతో కలసి పనిచేయడానికి  సంసిద్ధంగా ఉన్నామని రాష్ట్రాలు తెలిపాయి.

   స్వదేశీ పర్యాటక మార్కెట్ ను ప్రోత్సహించేందుకు భారీగా అవకాశాలు ఉన్నాయని వెబినార్ లో పాల్గొన్న వారంతా అభిప్రాయపడ్డారు. దేఖో అప్నా దేశ్ నినాదానికి అనుగుణంగా మరింత శ్రద్ధగా పనిచేయవలసి ఉందనే విషయాన్ని అంగీకరించారు.

  రెండు రోజుల వెబినార్ సదస్సులో 2020, అక్టోబరు 15న తొలిరోజు కార్యకలాపాలను నిర్వహించారు. ఇక 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు, అధికారులతో అక్టోబరు16వ తేదీన కూడా కేంద్ర పర్యాటక మంత్రి సమావేశం కానున్నారు.

*******



(Release ID: 1664992) Visitor Counter : 461