ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి పిలుపు మేరకు కోవిద్ కు వ్యతిరేకంగా ప్రజా ఆందోళనకు రూపకల్పన చేయాలి

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యులకు డాక్టర్ హర్ష వర్ధన్ పిలుపు

సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొన్న మంత్రి

శతాబ్ది ఉత్సవాలను జరుపుకోనున్న రెడ్ క్రాస్

Posted On: 15 OCT 2020 6:02PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హర్షవర్ధన్ అధ్యక్షుని హోదాలో ఇండియన్ రెడ్ క్రాస్ మరియు సెయింట్ జాన్స్ అంబులెన్సు సంస్థ వార్షిక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

       భారత రాష్ట్రపతి శ్రీ రాంనాథ్ కోవింద్ ఇండియన్ రెడ్ క్రాస్ మరియు సెయింట్ జాన్స్ అంబులెన్సు సంస్థల అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ సంస్థల అభివృద్ధికి నిరంతరం సహాయ సహకారాలను అందిస్తున్నారని తెలిపిన శ్రీ హర్షవర్ధన్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. " ఇండియన్ రెడ్ క్రాస్ చరిత్రలో తొలిసారిగా దృశ్య .శ్రవణ విధానంలో ఇటువంటి సమావేశం జరుగుతున్నది. అయితే, ఇది ప్రస్తుత రోజుల్లో ఇది సాధారణ విషయంగా మారిపోయింది. కోవిద్-19 మహమ్మారి మన వ్యవహార శైలిని మార్చివేసి ఇటువంటి సమావేశాలను నిర్వహించుకొనేలా చేసింది " అని మంత్రి అన్నారు.

      ఇండియన్ రెడ్ క్రాస్ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆయన సంస్థ సభ్యులకు శుభాకాంక్షలను తెలిపారు. వంద సంవత్సరాలలో సంస్థ అనేక మందికి ప్రాణదానం చేయడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచడంలో విశేషమైన కృషి చేసిందని మంత్రి కొనియాడారు. దేశంలో కోవిద్ వల్ల గత పది నెలలుగా నెలకొని ఉన్నపరిస్థితిని ఆయన సభ్యుల దృష్టికి తీసుకొనివచ్చారు." కోవిద్ మహమ్మారి తమ దేశాలపై ప్రభావం చూపకుండా చూడడానికి ప్రతి ఒక్క దేశం చర్యలు అమలుచేస్తున్నది.ఈ విషయంలో భారతదేశం ముందుగానే మేల్కొని మహమ్మారి వల్ల ఎక్కువ నష్టం కలగకుండా చూడడానికి అనేక నివారణా చర్యలను అమలు చేస్తున్నది." అని హర్షవర్ధన్ అన్నారు.

   కోవిద్ మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ సరైన నిర్ణయాలను సరైన సమయంలో సాహసోపితంగా తీసుకొన్నారని మంత్రి అన్నారు. దేశాన్ని కోవిద్ నుంచి రక్షించిన ప్రధానమంత్రికి హర్షవర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కోవిద్ వారియర్లు అందించిన సేవలను గుర్తు చేసిన మంత్రి వారికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని అన్నారు." దేశ ప్రజలు కోవిద్ వారియర్ల నుంచి స్ఫూర్తి పొందుతూ మహమ్మారిని నిర్మూలించడానికి యుద్ధం చేస్తున్నారని మన ప్రధానమంత్రి చెబుతున్నారు.ఈ సందర్భంగా నేను కోవిద్ వారియర్లకు ముఖ్యంగా వారి తల్లితండ్రులు,కుటుంబ సభ్యులకు  నమస్కరిస్తున్నాను. కోవిద్ వారియర్లను వారి కుటుంబ సభ్యులు అండగా ఉంటూ వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్థించడానికి అండదండలను అందించారు. ఈ యుద్ధం ఇదే విధిగా కొనసాగించి ప్రజలను కోవిద్ నుంచి రక్షించడానికి కృషి చేస్తాం." అని మంత్రి అన్నారు.

          కోవిద్ నుంచి రక్షణ కల్పించడానికి వాక్సిన్ ను రూపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలను వివరించిన మంత్రి ప్రజల భాగస్వామ్యంతోనే ఇవి విజయవంతం అవుతాయని అన్నారు. " కనీసం ఆరు అడుగుల దూరాన్ని పాటించడం, తరచు చేతులను శుభ్రం చేసుకోవడం, బహిరంగ ప్రదేశాలలో ముఖానికి మాస్కులను ధరించడం ద్వారా ప్రాణాలను రక్షించుకుని జీవనోపాధిని పొందడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయవలసి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఈ దిశలోనే చర్యలను తీసుకొంటున్నది." అని హర్షవర్ధన్ వివరించారు.

      రక్తనిధి కేంద్రాలు, రక్తదాన సేవల ద్వారా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రజలకు అందిస్తున్న సేవల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. " ఆపద సమయంలో తన రక్త నిధి కేంద్రాల ద్వారా  రక్తాన్ని అందచేస్తూ ఇండియన్ రెడ్ క్రాస్ విలువైన ప్రాణాలను రక్షిస్తున్నది. వినూత్న పద్ధతుల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారు రక్తాన్ని దానం చేసేలా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చర్యలను తీసుకుంటున్నది  సంస్థ సిబ్బంది, వాలంటీర్లు అంకిత భావంతో పని చేస్తూ దేశవ్యాపితంగా 24 గంటలపాటు సేవలను అందిస్తున్నారు." అని మంత్రి కితాబు ఇచ్చారు. తలసీమియా కేంద్రం, ప్రధాన కేంద్రంలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూంను ఏర్పాటు చేయడం, “ఈ బ్లడ్ సర్వీస్ పేరుతో యాప్ కు రూపకల్పన చేయడం లాంటి వినూత్న ఆలోచనలకు రూపకల్పన చేసిన సంస్థను ఆయన అభినందించారు.ఈ చర్యల వల్ల ప్రజలు రక్తాన్ని దానం చేయడానికి ముందుకు వస్తారని దీనివల్ల అవసరమైన సమయంలో సరఫరా చేయడానికి తగినన్ని నిల్వలు ఉంటాయని అన్నారు.

     ఇండియన్ రెడ్ క్రాస్ మరియు సెయింట్ జాన్ అంబులెన్సు సంస్థలు సామాజిక సేవలను అందించడంలోనూ ముందు ఉంటున్నాయని అన్న మంత్రి పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో వచ్చిన అంఫాన్ తుపాను, అస్సాం, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో వరదలు సంభవించినప్పుడు అందించిన సేవలను మంత్రి కొనియాడారు. " ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రణాళికలను రూపొందిస్తూ ఈ దిశలో తన వాలంటీర్లకు శిక్షణ ఇస్తూ, అవసరమైన ప్రాంతాలలో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. నష్టాన్ని నివారించాలన్నలక్ష్యంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిని చైతన్య వంతులను చేస్తున్నది. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధంగా స్థానిక వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడానికి SERV కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది"అని హర్షవర్ధన్ వివరించారు.

      సంస్థ ప్రధాన కేంద్రంతో పాటు వరదలు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా సంభవిస్తున్న రాష్ట్రాలలో సహాయ సామగ్రిని సిద్ధంగా ఉంచుతున్నామని మంత్రికి సంస్థ సభ్యులు తెలిపారు.

       మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా, ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీమతి బేబీ రాణి మౌర్యలు తమతమ రాష్ట్రాల ఇండియన్ రెడ్ క్రాస్ అధ్యక్షులుగా సమావేశంలో పాల్గొన్నారు.

   ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ శ్రీ అవినాష్ రాయ్ ఖన్నా, ఇండియన్ రెడ్ క్రాస్ మరియు సెయింట్ జాన్స్ అంబులెన్సు సంస్థల కార్యదర్శి శ్రీ.ఆర్ కే జైన్, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ. రాజేష్ భూషణ్ తో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

 

***


(Release ID: 1664960) Visitor Counter : 256