పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
రాబోయే శీతాకాలంలో కాలుష్యకారక చర్యలకు వ్యతిరేకంగా కఠినమైన కార్యచరణ
ఢిల్లీతోపాటు జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రాంతం(ఎన్సీఆర్)లో 50 బృందాలను నియమించిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి
Posted On:
14 OCT 2020 4:07PM by PIB Hyderabad
ఏటా శీతాకాలంలో వాయు కాలుష్యంతో సతమతమయ్యే ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యతను పెంచే చర్యల్లోభాగంగా విస్తృత క్షేత్రస్థాయి సందర్శన కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) 50 బృందాలను నియమంచింది. 2020 అక్టోబర్ 15 నుంచి, 2021 ఫిబ్రవరి 28 వరకు ఈ బృందాలు పర్యటిస్తాయి.
ఢిల్లీతోపాటు జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్ లోని నోయిడా, ఘజియాబాద్, మీరట్.. హరియాణలోని గురుగ్రామ్, ఫరీదాబాద్, బల్లబ్ గఢ్, జజ్జర్, పానిపట్, సోనెపట్.. రాజస్థాన్‌లోని భివాడి, అల్వార్, భరత్‌పూర్ ను ఈ బృందాలు సందర్శిస్తాయి. కాలుష్య సమస్యను తీవ్రతరం చేసే ప్రధాన ప్రాంతాలపైన ఈ బృందాలు దృష్టిసారిస్తాయి.
సరైన నియంత్రణ చర్యలు లేకుండా నిర్మాణాలను చేపట్టడం, చెత్త & నిర్మాణ వ్యర్థాలను రోడ్ల పక్కన వేయడం, ఓపెన్ ప్లాట్లు, పేవ్మెంట్లు లేని రోడ్లు, చెత్త / పారిశ్రామిక వ్యర్థాలను బహిరంగంగా తగలబెట్టడం వంటి సమస్యలను సమీర్ యాప్ ద్వారా బోర్డుకు నివేదిస్తాయి.
సత్వర చర్యలు తీసుకునేందుకు ఈ బృందాలు సేకరించిన సమాచారాన్ని ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా సంబంధిత ఏజెన్సీలకు పంపిస్తారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా సమాచారాన్ని పంచుకుంటారు. సంబంధిత ఏజెన్సీలు సకాలంలో చర్యలు తీసుకోవటానికి తగినవిధంగా పర్యవేక్షించడానికి ఈ విధానం సహాయపడుతుంది.
గంట గంటకూ కాలుష్య స్థాయిలను పరిశీలించడానికి, రాష్ట్ర ప్రభుత్వం సంస్థలతో సమన్వయం కోసం సిపిసిబి హెడ్ క్వార్టర్స్ వద్ద సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఉత్తమ నిర్వహణ, టీమ్స్ మధ్య సమన్వయం కోసం జిల్లాల వారీగా నోడల్ అధికారులను నియమించారు. శీతాకాలంలో గాలి నాణ్యత ఢిల్లీ ఎన్సీఆర్లో ప్రధాన పర్యావరణ సమస్య. ఈ ప్రాంతంలో గాలి నాణ్యతను మెరుగుపర్చడానికి గత ఐదేళ్ల నుంచి వివిధ ప్రయత్నాలు జరుగుతున్నాయి. గాలి నాణ్యత ఏటా మెరుగవుతున్నప్పటికీ, చేయాల్సింది ఇంకా చాలా ఉంది.
***
(Release ID: 1664500)
Visitor Counter : 155