ప్రధాన మంత్రి కార్యాలయం

రాజ‌మాత విజ‌య రాజె సింధియా శ‌త జ‌యంతి వేడుకల స‌మాప్తి సూచ‌కంగా 100 రూపాయ‌ల విలువ క‌లిగిన ప్ర‌త్యేక స్మార‌క నాణేన్ని విడుద‌ల చేసిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 12 OCT 2020 1:30PM by PIB Hyderabad

రాజ‌మాత విజ‌య రాజె సింధియా శ‌త జ‌యంతి సంద‌ర్భం లో 100 రూపాయ‌ల ముఖ‌ విలువ గ‌ల‌ స్మార‌క నాణేన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా  సోమవారం నాడు ఆవిష్క‌రించారు. రాజ‌మాత జ‌యంతి ని పుర‌స్క‌రించుకొని ఆయ‌న నివాళులు కూడా అర్పించారు.

రాజ‌మాత విజ‌య‌ రాజె సింధియా గారి గౌర‌వార్థం 100 రూపాయ‌ల విలువ క‌లిగిన ఒక ప్ర‌త్యేక స్మార‌క నాణేన్ని విడుద‌ల చేసే అవ‌కాశం ద‌క్కించుకొన్నందుకు తాను అదృష్ట‌వంతుడిన‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

విజ‌య రాజె గారి పుస్త‌కాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ గుజ‌రాత్ కు చెందిన ఒక యువ నాయ‌కునిగా పుస్త‌కం లో త‌న‌ను ప‌రిచ‌యం చేయ‌గా, ఇన్ని సంవత్సరాల అనంతరం అదే తాను ఈ దేశ ప్ర‌ధాన సేవ‌కునిగా ఉన్నాన‌న్నారు.  

ఈ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, భార‌త‌దేశాన్ని స‌రైన దిశ‌లో న‌డిపిన వారిలో రాజ‌మాత విజ‌య రాజె సింధియా ఒక‌రు అని చెప్పారు.  ఆమె మంచి నిర్ణ‌యాలు తీసుకొనే ఒక నేత‌, ప‌రిపాల‌న ద‌క్షురాలు కూడా అని ఆయ‌న అన్నారు.  విదేశీ దుస్తుల‌ ను కాల్చివేయ‌డం కావచ్చు, ఆత్య‌యిక ప‌రిస్థితి కావ‌చ్చు, రామ‌మందిర ఉద్య‌మం కావ‌చ్చు.. భార‌త‌దేశ రాజ‌కీయాల‌ లో ప్ర‌తి ముఖ్య‌ ద‌శ‌కు ఆమె సాక్షిగా నిల‌చారు అని ఆయ‌న అన్నారు.  రాజ‌మాత గారి జీవితాన్ని గురించి తెలుసుకోవ‌డం ప్ర‌స్తుత త‌రం వారికి ముఖ్య‌ం, ఈ కార‌ణంగా ఆవిడ‌ను గురించి, ఆమె అనుభ‌వాల‌ను గురించి ప‌దే ప‌దే ప్ర‌స్తావించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  

ప్ర‌జ‌ల కు సేవ చేయాలంటే ఒక ఫ‌లానా కుటుంబం లో జ‌న్మించవలసిన అవ‌స‌రం ఏమీ లేద‌ని రాజ‌మాత మ‌న‌కు నేర్పించారు అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  కావ‌ల్సింద‌ల్లా దేశ ప్ర‌జ‌ల ప‌ట్ల వాత్స‌ల్యం, ప్రజాస్వామ్య భావ‌న  అన్నారు.  ఇటువంటి ఆలోచ‌న‌లను, ఆద‌ర్శాల‌ను ఆమె జీవ‌నం లో మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చ‌ని ఆయ‌న చెప్పారు.  రాజ‌మాత వ‌ద్ద వేలాది ఉద్యోగులు, ఒక భ‌వ్య‌మైన మ‌హ‌లు, ఇత‌ర‌త్రా స‌దుపాయాలు అన్నీ ఉన్న‌ప్ప‌టికీ పేద‌ల ఆకాంక్ష‌ల ను నెర‌వేర్చ‌డానికి, సామాన్య ప్ర‌జానీకం ఇక్క‌ట్ల‌ను అర్థం చేసుకోవ‌డానికి ఆమె త‌న జీవితాన్ని అంకితం చేశార‌న్నారు.  ఎల్ల‌వేళలా ప్ర‌జ‌ల‌ కు సేవ చేయాల‌నే ఆమె త‌పించార‌ని ప్రధాన మంత్రి అన్నారు.  దేశ ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు కోసం స‌మ‌ర్ప‌ణ భావం తో ఆమె మెలగార‌ని ప్రధాన మంత్రి చెప్పారు.  దేశ భావి త‌రాల వారి కోసం ఆమె త‌న సంతోషాన్ని త్యాగం చేశార‌న్నారు.  హోదా కోస‌మో, ద‌ర్జా కోస‌మో ఆమె జీవించ‌లేద‌ని, రాజ‌కీయాల‌కు ఒడిగ‌ట్ట‌లేద‌ని ఆయ‌న అన్నారు.

అనేక‌ ప‌ద‌వుల‌ను ఎంతో అణ‌కువ‌తో ఆమె తిర‌స్క‌రించిన కొన్ని సంద‌ర్భాల‌ను ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చారు. జ‌న సంఘ్‌ అధ్య‌క్ష స్థానాన్ని స్వీక‌రించవలసింది అంటూ అట‌ల్ గారు, ఆద్వాణీ గారు ఒక‌ సారి ఆమెకు విజ్ఞ‌ప్తి చేశారని అంత‌క‌ంటే ఓ కార్య‌క‌ర్త గా జన్ సంఘ్ కు సేవ చేయడాన్నే ఆమె ఆమోదించారని ప్రధాన మంత్రి చెప్పారు.

రాజ‌మాత త‌న తోటివారిని వారి పేరు తో పిల‌వ‌డానికి ఇష్ట‌ప‌డే వారు, ఒక కార్య‌క‌ర్త ప‌ట్ల ఇటువంటి భావ‌న అనేది ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌స్సులో ఉండాలి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  గ‌ర్వం కాకుండా గౌర‌వం రాజ‌కీయాల‌కు కీల‌కం కావాలి అని ఆయ‌న అన్నారు.  రాజ‌మాత ను ఒక ఆధ్యాత్మ‌ిక వ్య‌క్తిత్వం అంటూ ఆయ‌న అభివ‌ర్ణించారు.  

ప్ర‌జా చైత‌న్యం, సామూహిక ఉద్య‌మాల వ‌ల్ల గ‌త కొన్నేళ్ళ‌లో దేశం లో ఎన్నో మార్పులు చోటు చేసుకొన్నాయి, అనేక ప్ర‌చార ఉద్య‌మాలు, ప‌థ‌కాలు స‌ఫ‌లం అయ్యాయి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  రాజ‌మాత ఆశీర్వాదాలతో దేశం అభివృద్ధి ప‌థంలో మునుముందుకు ప‌య‌నిస్తోంద‌ని ఆయ‌న ప్ర‌ముఖంగా పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం భార‌త‌దేశ నారీ శ‌క్తి పురోగ‌మిస్తోంద‌ని, దేశం లో వివిధ రంగాల లో సారథ్యం వ‌హిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  మ‌హిళ‌లకు సాధికారిత కల్పన విష‌యం లో రాజ‌మాత క‌న్న క‌ల‌ల‌ను నెర‌వేర్చ‌డం లో సాయపడిన ప్ర‌భుత్వ న కార్య‌క్ర‌మాల‌ ను గురించి ఆయ‌న ఒక్కొటొక్క‌టిగా వివ‌రించారు.

ఆమె పోరాటం సల్పిన రామ‌జ‌న్మభూమి ఆల‌యం తాలూకు స్వ‌ప్నం ఆమె శ‌త జ‌యంతి సంవ‌త్స‌రంలో నెర‌వేర‌డం ఒక అద్భుత‌మైన కాకతాళీయ ఘ‌ట‌న అని కూడా ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  ఒక బ‌ల‌మైన, భ‌ద్ర‌మైన‌, స‌మృద్ధ‌మైన భార‌త‌దేశం ఏర్ప‌డాల‌న్న ఆమె దార్శ‌నిక‌త ను సాకారం చేయ‌డం లో ‘ఆత్మనిర్భ‌ర్ భార‌త్’ సాఫల్యం మ‌న‌కు తోడ్ప‌డగలుగుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

***



(Release ID: 1663720) Visitor Counter : 217