యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఐజేఎఫ్ గ్రాండ్‌స్లామ్-2020లో పాల్గొనేందుకు హంగేరీ వెళ్లనున్న ఆరుగురు సభ్యుల భారత జూడో బృందం పూర్తి ఖర్చును భరించనున్న కేంద్ర ప్రభుత్వం
Posted On:
11 OCT 2020 6:59PM by PIB Hyderabad
హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో, అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ (ఐజేఎఫ్) నిర్వహించే గ్రాండ్ స్లామ్-2020 పోటీలు ఈనెల 23-26 తేదీల్లో జరగనున్నాయి. భారత్ నుంచి ఐదుగురు సభ్యుల బృందం ఇందులో పాల్గొనబోతోంది. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించనుంది.
ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు సహా ఐదుగురు జూడోకర్లు ఈనెల 19వ తేదీన బుడాపెస్ట్ బయల్దేరతారు. వారంతా విడివిడిగా కనీసం రెండు కొవిడ్ నెగెటివ్ వైద్య పరీక్షల పత్రాలను హంగేరీలో దిగగానే సమర్పించాలి.
మహిళా బృందంలో, మణిపూర్‌కు చెందిన 25 ఏళ్ల సుశీలాదేవి (48 కేజీల విభాగం), దిల్లీకి చెందిన 22 ఏళ్ల తులికా మన్ (78 కేజీలు) సభ్యులు. పురుషుల బృందంలో, మాజీ ఒలింపియన్, 28 ఏళ్ల అవతార్ సింగ్ (100 కేజీలు), టాప్స్ డెవలెప్‌మెంటల్ గ్రూప్‌నకు చెందిన అథ్లెట్ 22 ఏళ్ల జస్లీన్ సింగ్ సైనీ (66 కేజీలు), 24 ఏళ్ల విజయ్ యాదవ్ (60 కేజీలు) సభ్యులు. వీరితోపాటు కోచ్ జీవన్ శర్మ కూడా పర్యటనలో పాల్గొంటారు.
"ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం తేవడమే నా లక్ష్యం. నేను చాలా కష్టపడి సాధన చేశా, గెలుస్తానన్న నమ్మకం ఉంది. మాకు మద్దతుగా నిలిచిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మేం ఎంతకష్టపడినా, ప్రభుత్వం నుంచి మద్దతు లేకపోతే ఉపయోగం ఉండదు. ఈ పర్యటన ఖర్చులు భరిస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు" అంటూ జస్లీన్ సంతోషం వ్యక్తం చేశారు.
ప్రపంచ ర్యాంకుల ఆధారంగా భారత జూడోకర్లు ఈ పోటీలకు ఎంపికయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌కు వీరంతా అర్హత సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జాతీయ సీనియర్ ర్యాంకింగ్ పోటీల్లో వీరంతా గట్టి పోటీదారులు. మహిళల్లో అత్యుత్తమంగా సుశీలాదేవి ర్యాంకు 41. ఆమెకు 833 ఒలింపిక్ అర్హత పాయింట్లు ఉన్నాయి. పురుషుల్లో అత్యుత్తమంగా జస్లీన్ ర్యాంకు 56 కాగా, 854 ఒలింపిక్ అర్హత పాయింట్లు ఉన్నాయి.
బుడాపెస్ట్‌లో జరిగే ఐజేఎఫ్ గ్రాండ్‌స్లామ్-2020లో 81 దేశాలకు చెందిన 645 మంది పోటీదారులు పాల్గొంటారు.
***
(Release ID: 1663603)
Visitor Counter : 145