వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప్ర‌పంచ స్థాయి ఐఇసిసిగా పున‌ర్నిర్మిస్తున్న ఢిల్లీలోని ప్ర‌గ‌తి మైదాన్‌లో నిర్మాణ కార్య‌క‌లాపాల పురోగ‌తిని స‌మీక్షించిన మంత్రి పీయూష్ గోయ‌ల్

Posted On: 10 OCT 2020 2:24PM by PIB Hyderabad

ప‌్ర‌పంచ స్థాయి ఏకీకృత ప్ర‌ద‌ర్శ‌న‌, స‌మావేశ కేంద్రం (ఇంటిగ్రేటెడ్ ఎగ్జిబిష‌న్ క‌మ్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ - ఐఇసిసి)గా పున‌ర్నిర్మిస్తున్న ఢిల్లీలోని ప్ర‌గ‌తి మైదాన్‌లోని నిర్మాణ ప‌నుల పురోగ‌తిని కేంద్ర రైల్వే, వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల మంత్రి పీయూష్ గోయ‌ల్ శ‌నివారం స‌మీక్షించారు. ఈ  వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో కేంద్ర గృహ నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి హెచ్‌.ఎస్‌.పురి, ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌ధాన స‌ల‌హాదారు పి.కె. సిన్హా, వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ అధికారులు, ఐటిపిఒ, ఎన్‌బిసిసి, ఇత‌ర ఏజెన్సీల అధికారులు పాల్గొన్నారు. 
నిర్మాణ కార్య‌క‌లాపాల స్థాయి ఏ మేర‌కు ఉందో చూపే వీడియోల ప్ర‌ద‌ర్శ‌న‌ను తిల‌కించిన అనంత‌రం, కీల‌క కార్య‌క‌లాపాల‌న్నీ నియంత్ర‌ణ‌లో ఉన్నందున, సాధిస్తున్న పురోగ‌తి ప‌ట్ల మంత్రి గోయ‌ల్ సంతృప్తిని వ్య‌క్తం చేశారు. కొద్ది నెల‌ల కింద‌ట విధించిన లాక్ డౌన్, త‌ద‌నంత‌రం కార్మికులు వ‌ల‌స వెళ్ళ‌డంతో కుంటుప‌డిన నిర్మాణ కార్య‌క‌లాపాలు, జూన్‌లో తిరిగి పుంజుకుని, అదే స్థాయిలో కొన‌సాగుతున్నాయి. ప్ర‌స్తుతం నిర్మాణ ప్ర‌దేశంలో 4,800 కార్మికులు వివిధ కార్య‌క‌లాపాల‌లో పాలుపంచుకుంటున్నారు. అనేక భ‌వ‌నాలు 2021 మార్చి నాటికి పూర్తి కానున్నాయి. పూర్తి చేసిన భ‌వ‌నాల‌ను అప్ప‌గించ‌డం ద‌శ‌ల‌వారీగా జ‌రుగ‌నుంది. ఈ మొత్తం ప్రాజెక్టును 2021 అక్టోబ‌ర్ నాటికి పూర్తి చేసి అప్ప‌గించ‌నున్నారు.  ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంత‌రాయం లేకుండా స‌జావుగా సాగేందుకు ఈ ప్ర‌దేశంలో 6 స‌బ్‌వేల వంటివి, ఒక ప్ర‌ధాన సొరంగం ఉంటాయి. భ‌వ‌నాల‌లో అమ‌ర్చ‌నున్న ఎసి వ్య‌వ‌స్థ కోవిడ్‌- 19 నిరోధానికి అనుగుణంగా ఉంటుంది. ఈ స‌ముదాయానికి త‌గినంత విద్యుత్ అందుబాటులో ఉండ‌డ‌మే కాక‌, భ‌వ‌నాలు లీక్ ప్రూఫ్‌గా,  ఎట్టి ప‌రిస్థితుల్లోనే నీరు నిలిచిపోకుండా ఉండే డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌లు ఉంటాయి.  ఆత్మ‌నిర్భ‌ర్ అభియాన్‌లో భాగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం దిగుమ‌తి చేసుకునే సామాగ్రిని  నిరంత‌రం త‌గ్గిస్తూ వ‌స్తున్నారు, ప్ర‌స్తుతం ప్రాజెక్టు విలువ‌లో అది 9.5%గా ఉంది. 
అంత‌ర్జాతీయ స‌మావేశాలు, ఎగ్జిబిష‌న్లు నిర్వ‌హించేంద‌కు అనువుగా అత్యాధునికంగా పున‌ర్నిర్మిస్తున్న ప్ర‌గ‌తి మైదాన్‌లో దాదాపు 7,000 సీటింగ్ సామ‌ర్ధ్యం క‌లిగిన‌ అధునాత‌న క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ కూడా ఉంటుంది. భార‌త్ 2022లో జి-20 స‌ద‌స్సును నిర్వ‌హిస్తుంద‌ని భావిస్తున్న నేప‌థ్యంలో, ఐఇసిసి అందుకు ప్ర‌ధాన కార్య‌రంగం కానుంది. 

***


(Release ID: 1663368) Visitor Counter : 153