కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

వలస కార్మికులు , వారు ఎదుర్కొంటున్న సమస్యలపై కచ్చితమైన డేటా అవసరమని కేంద్ర కార్మిక మరియు ఉపాధిశాఖ మంత్రి సంతోష్కుమార్ గంగ్వార్ ఉద్ఘాటన లేబర్ బ్యూరో సర్వేలపై నిపుణుల బృందం తొలి సమావేశంలో ప్రసంగించిన కేంద్ర కార్మికశాఖ మంత్రి

Posted On: 09 OCT 2020 5:28PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ కార్యాలయంలో 08.10.2020న లేబర్ బ్యూరో సర్వేలపై నిపుణుల బృందం నిర్వహించిన  తొలి సమావేశంలో కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి సంతోష్కుమార్ గంగ్వార్ ప్రసంగించారు. కోల్కతా విశ్వవిద్యాలయం ఎమెరిటస్ ప్రొఫెసర్ ఎస్.పి. ముఖర్జీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ నిపుణుల బృందంలో ప్రముఖ ఆర్థికవేత్తలు, గణాంకవేత్తలు, ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉన్నారు. మూడేళ్ల కాలపరిమితికిగాను ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ నిపుణులు బృందం.. వలస కార్మికులు, వృత్తిపరమైన కార్మికులు, గృహకార్మికుల వివరాలను సేకరించే సర్వేలతోపాటు ఇతర సర్వేలపై లేబర్ బ్యూరోకు సాంకేతిక మార్గనిర్దేశం చేస్తుంది.  ఈ సందర్భంగా మంత్రి గంగ్వార్ మాట్లాడుతూ.. ప్రత్యేక కార్మిక విభాగాలకు సంబంధించిన సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం మూడు ప్రతిష్టాత్మక సర్వేలను నిర్వహించే పనిని లేబర్ బ్యూరోకు అప్పగించిందని మంత్రి పేర్కొన్నారు.
కరోనా వంటి మహమ్మారి వ్యాప్తి చెందుతున్న విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి తీవ్ర విచారం ఆందోళన  చేస్తూ .. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో వలస కార్మికుల వివరాలతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై కచ్చితమైన డేటా అవసరమన్నారు. ఈ డేటాబేస్ అందుబాటులో ఉన్నప్పుడే మహమ్మారి పరిస్థితులకు పరిష్కారం చూపడానికి, కార్మికుల స్థితిగతులను మెరుగుపర్చడానికి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రణాళికలను రూపొందించడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుందన్నారు. వలస కార్మికులపై లేబర్ బ్యూరో  చేపట్టబోయే ఈ సర్వేలు వలస కార్మికుల సంఖ్యపై ప్రామాణిక అంచనాలతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యల విశ్లేషణలను అందిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఈ గణాంకాలు ప్రభుత్వానికి అత్యవసరమైనందున సర్వేకు సంబంధించిన అన్ని సాంకేతిక అంశాలను వీలైనంత త్వరితగతిన ఖరారు చేయాలని నిపుణుల బృందాన్ని మంత్రి కోరారు. అప్పుడే ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రభుత్వ ప్రణాళికలను అమలు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు.
దేశంలోని మొత్తం కార్మికుల్లో సుమారు 3శాతంగా ఉన్న గృహ కార్మికుల వివరాలను కూడా సేకరించాలని మంత్రి సూచించారు. గృహ కార్మికులపై లేబర్ బ్యూరో నిర్వహిస్తున్న మొదటి సర్వే కూడా ఇదేనన్న మంత్రి... ఈ సర్వే ద్వారా గృహ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడానికి, వారి స్థితిగతులను మెరుగుపర్చడానికి, అందుకు అవసరమైన విధానాలను రూపొందించడానికి ఈ సర్వే తోడ్పడుతుందన్నారు.
ఉపాధి, నిరుద్యోగంపై అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా ప్రొఫెషనల్ బాడీస్ సర్వేను ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి గంగ్వార్ తెలిపారు. లేబర్ బ్యూరో చేపడుతున్న ఈ సర్వేలో చార్టెడ్ అకౌంటెంట్లు, న్యాయవాదులు, వైద్యులు వంటి వృత్తుల్లో అధిక సంఖ్యలో ఉపాధి లభిస్తుండడంతో  అటువంటి వృత్తుల్లో సృష్టించబడిన ఉపాధి అవకాశాలపై అంచనాలను రూపొందించాల్సి ఉందన్నారు. ఉపాధి అవకాశాలపై కచ్చితమైన డేటాబేస్ను రూపొందించడమే ఈ సర్వే లక్ష్యమని, దీని ఆధారంగా ఉపాధి కల్పనపై ప్రణాళికలు రూపొందించి, పురోగతి సాధించడానికి ఉపయోగపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఈ సర్వేలను నిర్వహించనున్న లేబర్ బ్యూరో 1920 లో ఏర్పాటైంది. కార్మికులకు సంబంధించి కచ్చితమైన, నమ్మకమైన గణాంకాలను గత వందేళ్లుగా రూపొందిస్తోంది. ధరల సూచికలు, పరిపాలనా గణాంకాలు,   కార్మిక సంబంధిత సర్వేల డేటాకు ఇది జాతీయ,  అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. నెలవారీ ప్రాతిపదికన లేబర్ బ్యూరో విడుదల చేసే సీపీఐడబ్ల్యూ సూచికల ఆధారంగానే కోట్లాదిమంది కార్మికుల అలవెన్సులు, వేతనాలను క్రమబద్ధీకరిస్తారు. అంతేకాకుండా  సిపిఐ-ఎఎల్ / ఆర్ఎల్ మరియు చిల్లర ధరల సూచికల వంటి శ్రమకు సంబంధించిన వివిధ రకాల సర్వేలను కూడా లేబర్ బ్యూరో రూపొందిస్తుంది. పార్లమెంటు ఆమోదించిన నాలుగు కొత్త లేబర్ కోడ్ల కింద రూపొందించిన గణాంకాలను పరిరక్షించే అధికారం కూడా లేబర్ బ్యూరోకు ఉంది.   

***



(Release ID: 1663287) Visitor Counter : 1711