గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

అమృత్ పథకం కింద హిమాచల్ ప్రదేశ్.లో 32 ప్రాజెక్టులు పూర్తి, అమలులో 41 పనులు

ఉత్తరాఖండ్ లో 47పూర్తి, అమలులో 100 ప్రాజెక్టులు
హిమాచల్ లో ఇళ్లకు నీటి కుళాయి కనెక్షన్ల లక్ష్యం 13,003, అమర్చినవి 17,630
రెండు రాష్ట్రాల్లో పట్టణ పథకాల ప్రగతిపై సమీక్ష

Posted On: 09 OCT 2020 12:51PM by PIB Hyderabad

          అమృత్ స్మార్ట్ సిటీస్ పథకం కింద హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు సాధించిన ప్రగతిని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా ప్రశంసించారు. ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, మఖ్యకార్యదర్శులు, సీనియర్ అధికారులతో జరిగిన చర్చ సందర్భంగా దుర్గాశంకర్ మిశ్రా, వారికి అభినందనలు తెలియజేస్తూ, అమృత్ పథకం కింద పనుల వేగవంతానికి చర్యలు తీసుకున్నపుడే, ప్రజలకు ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయన్నారు. 2021వ సంవత్సరం మార్చి 31వరకూ పొడిగించిన అమృత్ పథకం గడువు ముగిసేలోగా అన్ని ప్రాజెక్టులను పూర్తిచేయాలని సూచించారు. పర్వత ప్రాంతంలో ఉన్న ఈ రెండు రాష్ట్రాలు 90శాతం కేంద్ర సహాయాన్ని వినియోగించుకోవాలంటే గడువులోగా ప్రాజెక్టులను ముగించాలన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అమృత్ పథకం కింద 32 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, 41 ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రూ. 593 కోట్ల ప్రణాళికతో 151 ప్రాజెక్టులను చేపట్టగా, వీటిలో 47 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, 100 ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని తెలిపారు.  

    అమృత్ పథకం పనుల అమలుకు సంబంధించి జాతీయ ర్యాంకింగ్స్.లో హిమాచల్ ప్రదేశ్ 15వ ర్యాంకులో, ఉత్తరాఖండ్ 24వ ర్యాంకులో ఉన్నాయి. అమృత్ పథకం అమలులో ఈ రెండు రాష్ట్రాల కృషిని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభినందిస్తూ, తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుని, ఈ పథకాల అమలులో ముందున్న 10 అగ్రశ్రేణి రాష్ట్రాల సరసన చోటు సంపాదించాలని సూచించింది.  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 13,003 ఇళ్లకు నీటి కుళాయిల కనెక్షన్లు అమర్చాలన్నది లక్ష్యంకాగా, లక్ష్యాన్ని మించి ఇప్పటికే 17,600 ఇళ్లకుపైగా కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్ లో ఇప్పటివరకూ 36,554 కొత్త కనెక్షన్లు ఏర్పాటు చేశారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు కనెక్షన్లు ఏర్పాటును వేగవంతం చేయవలసిందిగా ఉత్తరాఖండ్.కు సూచించారు.  నీటి  సరఫరా పైపుల ఏర్పాటులో ఎలాంటి లోపాలున్నా, నీరు వృథా అయ్యే ఆస్కారం ఉంటుందని, అందువల్ల ప్లంబంగ్ పనుల్లో నాణ్యత కొరవడకుండా చూడాలని సూచించారు.

    మురుగునీటి పారుదల వ్యవస్థ కింద హిమాచల్ ప్రదేశ్ లో 23,006 కనెక్షన్లు కల్పించాలన్నది లక్ష్యంకాగా, ఇప్పటికే 26,034 కనెక్షన్లు ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొత్తగా 24,818 కనెక్షన్లు ఏర్పాటు చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో 51,793 ఇళ్లకు సెప్టిక్ ట్యాంకుల నిర్వహణా వ్యవస్థ ఏర్పాటు చేశారు.  ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మురుగునీటి వ్యవస్థ పనులను వేగవంతం చేయాలని, అమృత్ మిషన్ గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సూచించారు.

    హిమాచల్ ప్రదేశ్ లో మామూలు వీధి దీపాల స్థానంలో 9,621 ఎల్.ఇ.డి. బల్బులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా, లక్ష్యాన్ని మించి 12,186 ఎల్.ఇ.డి. దీపాలను అమర్చారు, ఇక ఉత్తరాఖండ్ లో 82,337 ఎల్.ఇ.డి. వీధి లైట్ల ఏర్పాటు లక్ష్యంకాగా,  72,167 ఎల్.ఇ.డి. దీపాలను అమర్చారు. వీధి దీపాల మార్పిడిని వేగవంతం చేయాలని, ఎల్.ఇ.డి. లైట్ల ఏర్పాటును అన్ని ప్రాంతాలకు వర్తింపజేయాలని రెండు రాష్ట్రాలకు సూచించారు. అమృత్ పథకం వర్తింపజేస్తన్న నగరాల్లో ఆన్ లైన్ ద్వారా భవనాల నిర్మాణ అనుమతి వ్యవస్థను (ఒ.బి.పి.ఎస్.ను) రెండు రాష్ట్రాల్లోనూ అమలు చేశారు. సులభ తరహా వాణిజ్య నిర్వహణ విధానంలో ఇదీ ఒక బాగమని, అమృత్ పథకం వర్తింపజేసే నగరాల్లోనే కాక, అన్ని పట్టణ స్థానిక పరిపాలనా సంస్థల్లోనూ దీన్ని అమలు చేయాలని దుర్గా శంకర్ మిశ్రా సూచించారు.

 రెండు రాష్ట్రాల్లోనూ అమృత్ మిషన్ అమలయ్యే అన్ని నగరాల్లోనూ క్రెడిట్ రేటింగ్ వ్యవస్థను వూర్తి చేశారు. రాష్ట్రానికి ఒకటి చొప్పున అమృత్ మిషన్ నగరానికి పెట్టుబడి గ్రేడ్ రేటింగ్ (ఐ.జి.ఆర్.) కూడా లభించింది. తక్కువ స్థాయిలో ఐ.జి.ఆర్. రేటింగ్ ఉన్న నగరాలకు రుణ పెంపుదల ప్రణాళికకోసం రెండు రాష్ట్రాలు కృషిచేయాలని, ఐ.జి.ఆర్. లభించిన నగరాల్లో మున్సిపల్ బాండ్లు ప్రారంభించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.

   మంత్రిత్వశాఖ పరిధిలో అమలయ్యే అన్ని పథకాల సమాచారంతో ఉమ్మడిగా ఒక డ్యాష్ బోర్డును ఏర్పాటు చేశామని, ఇందులో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమాచారం అందుబాటులో ఉంటుందని, రెండు రాష్ట్రాలకు సూచించారు. పథకం పనుల ప్రగతిని పర్యవేక్షించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. అమృత్ పథకం అమలు వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని, అప్పుడే డ్యాష్ బోర్డు, లేదా పోర్టల్ లో పనుల ప్రగతిని నవీకరించవచ్చని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. అమృథ్ ప్రాజెక్టు అమలులో ఏయే రాష్ట్రాల పనితీరు ఎలా ఉందో, ప్రతినెలా పర్యవేక్షించి, సమీక్షించి, ర్యాంకులను నిర్ణయించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందన్నారు.

  వాననీటిని ఒడిసి పట్టండి” పేరిట ఉద్యమం: వాననీటిని ఒడిసి పట్టాలన్న నివాదంతో ఉద్యమ తరహాలో చేపట్టిన ఈ పథకంకింద కార్యకలాపాలను ప్రారంభించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర అధికారులు సూచించారు. నీటిని పొదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి వాన చుక్కనూ ఒడిసి పట్టి, వాననీటిని సంరక్షించాలన్నదే ఈ ఉద్యమ లక్ష్యమని కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఈ సమావేశంలో తెలిపారు. నగరాల్లో నిర్మించే అన్ని భవవనాల్లోనూ వాననీటి సంరక్షణ వ్యవస్థల ఏర్పాటుకు, ఈ కార్యక్రమాన్ని సత్వరం అమలుచేయడానికి ఈ ఉద్యమాన్ని చేపట్టినట్టు ఆయన చెప్పారు. 

***



(Release ID: 1663141) Visitor Counter : 210