శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

నీటి శుద్ధీకరణకు సామాజిక స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలాయించిన సి.ఎస్.ఐ.ఆర్., సి.ఎం.ఇ.ఆర్.ఐ.

Posted On: 08 OCT 2020 6:54PM by PIB Hyderabad

  నీటి శుద్ధీకరణలో భాగంగా చేపట్టే హై-ఫ్లో ప్లోరైడ్, ఇనుము అవశేషాల నిర్మూలనా ప్రక్రియకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్ర వైజ్ఞానిక పారిశ్రామిక పరిశోధనా సంస్థ (సి.ఎస్.ఐ.ఆర్.), కేంద్ర మెకానికల్ ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ (సి.ఎం.ఇ.ఆర్.ఐ.) ఈ రోజు పశ్చిమ బెంగాల్ లోని హౌరాకు చెందిన కాప్రికన్స్ అక్వా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు బదిలీ చేసింది. పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ లో జరిగిన ఈ కార్యక్రమాన్ని వర్చువల్ వేదికపై నిర్వహించారు. సి.ఎస్.ఐ.ఆర్., సి.ఎం.ఆర్.ఐ. సంస్థల డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) హరీష్ హీరానీ సమక్షంలో సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపు నిర్వహించారు.   

 ఈ సందర్భంగా ప్రొఫెసర్ హీరానీ మాట్లాడుతూ, “సామాజిక స్థాయి నీటి శుద్ధీకరణ వ్యవస్థలో ప్రవాహ వేగం గంటకు పదివేల లీటర్ల మేర ఉంటుంది. నీటి శుద్ధీకరణ ప్రక్రియకోసం ఇసుక, కంకర, నీటిలో కరిగిపోయే ఇతర సామగ్రిని అంటే మనకు సాధారణంగా అందుబాటులో ఉండే ముడి పదార్థాలను వినియోగిస్తారు. శుద్ధీకరణ ప్రక్రియ 3 దశల్లో అనుమతించిన పరిమితుల్లో ఉంటుంది. అంటే,.ఈ ప్రక్రియలో లీటర్ నీటికి 1.5 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ను, 0.3 మిల్లీ గ్రాముల ఇనుప అవశేషాలను ఈ టెక్నాలజీ తొలగిస్తుంది. మొత్తం ప్రక్రియ వ్యయం కూడా అందుబాటులోనే ఉంటంది. సేంద్రియ పదార్థాల అవశేషాలను తొలగించే ఆక్సీకరణం, నీటిలో కలుషితాలన్నీ కిందకు పేరుకుపోయే గ్రావిటేషనల్ సెటిలింగ్ వంటి ప్రక్రియలను ఈ పరిజ్ఞానంలో వినియోగిస్తారు. నీటిని వడగట్టే ప్రక్రియ మన్నిక ఎక్కువ కాలం ఉండేలా ఈ పరిజ్ఞానం దోహదపడుతుంది.” అన్నారు.

  “అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం నీటి కాలుష్యం ఉన్న జనావాసాల్లో ఫ్లోరైడ్ వ్యాధి బాధితుల సంఖ్య గత 50 ఏళ్లుగా పెరుగుతూ వస్తోంది. భూగర్భ జలం తగ్గే కొద్దీ ఈ సమస్య మరింత పెరుగుతూ వస్తోంది. ఒక పరిమిత ప్రాంతంలోని నీటిలో ఫ్లోరైడ్ సాంధ్రత  స్థాయి కూడా ఎక్కువవుతోంది. నీటిలోని ఫ్లోరైడ్ అవశేషాల తొలగింపు పరిష్కారాలు సరిగా అందుబాటులో లేని కారణంగా, దేశంలో ఫ్లోరైడ్ బారిన పడేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ పథకంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.  నీటిశుద్ధీకరణ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతం చేయడం, యువత ఉపాధి కల్పనకు కూడా ప్రేరణ కలిగించే అవకాశం ఉంది. బాధిత ప్రాంతాల్లో సామాజిక స్థాయిలో ఈ నీటి శుద్ధీకరణ ప్రక్రియను విస్తరింపచేయడంవల్ల, దేశవ్యాప్తంగా ఇనుము అవశేషాలు, ఫ్లోరోసిస్ వంటి  వాటిని తొలగించేందుకు అవకాశం ఉంటుంది.” అని ఆయన అన్నారు.

  కాప్రికన్స్ అక్వా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ సంజయ్ దత్తా మాట్లాడుతూ, సి.ఎస్.ఐ.ఆర్., సి.ఎం.ఇ.ఆర్.ఐ. కలసి నీటి శుద్ధీకరణకు సరైన నీటి శుద్ధీకరణ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. వ్యయానికి తగిన ఫలితాలను అందించేలా, అందుబాటులో ఉన్న ఈ పరిజ్ఞానంతో, స్వచ్చమైన నీటిసరఫరాకు నోచుకోని ప్రజలకు సేవలందించడానికి వీలుంటుందన్నారు.  నీటి శుద్ధీకరణకు ఉద్దేశించిన ఈ సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపుతో ఫలితాలు ఎంతో బాగుంటాయని, ఫ్లోరైడ్, ఇనుప అవశేషాల నీటి కాలుష్యం ఎక్కువగా ఉన్న జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకోసం సి.ఎం.ఇ.ఆర్.ఐ. నీటి శుద్ధీకరణ పరిజ్ఞానాన్ని వినియోగించాలని తమ సంస్థ భావిస్తోందని ఆయన చెప్పారు. 

*****



(Release ID: 1662928) Visitor Counter : 166