వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

2020 సంవత్సరపు జాతీయ స్టార్టప్ అవార్డుల ఫలితాలు

Posted On: 06 OCT 2020 6:11PM by PIB Hyderabad

   జాతీయ స్టార్టప్ అవార్డుల ఫలితాలను 2020 అక్టోబరు 7న ఢిల్లీలో విడుదల చేశారు.  రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఈ అవార్డులను విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్చువల్ పద్ధతిలో జరిగిన సత్కార కార్యక్రమంలో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయమంత్రి మంత్రి సోమ్ ప్రకాశ్ పాల్గొన్నారు.

   ప్రతిభావంతంగా పనిచేస్తూ చక్కని ఫలితాలను అందించే స్టార్టప్ కంపెనీలను గుర్తించి సదరు కంపెనీలకు జాతీయ స్థాయి అవార్డులు ఇవ్వాలన్న ప్రణాళికను తొలుత కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య శాఖ (డి.పి.ఐ.ఐ.టి.) రూపొందించింది. సృజనాత్మక ఉత్పాదనలను, పరిష్కారాలను రూపొందిస్తూ, పెద్ద స్థాయిలో ఉద్యోగాలు, ఉపాధిని లేదాను సంపదను సృష్టించే స్టార్టప్ కంపెనీలను, తద్వారా సామాజిక ప్రభావానికి కారణమయ్యే సంస్థలను గుర్తించి, సత్కరించే భావనతో ఈ అవార్డులను రూపొందించారు. పెట్టుబడి దారుల ఆర్థిక లాభాలను మాత్రమే కాక, సామాజిక ప్రయోజనానికి సదరు సంస్థ చేసిన సేవలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ అవార్డులకు రూపకల్పన చేశారు.

  తొలి విడత అవార్డులకోసం 12 రంగాలనుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. వాటిని తదుపరి 35కేటగిరీలుగా ఉపవర్గీకరణ చేశారు. వ్యవసాయం, విద్య, ఔత్సాహిక సాంకేతిక పరిజ్ఞానం, ఇంధనం, ఆర్థిక, ఆహార, ఆరోగ్య రంగాలు, పరిశ్రమలు 4.0, అంతరిక్షం, భద్రతా రంగం, పర్యాటకం, పట్టణ సేవల రంగాల స్టార్టప్ ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. వీటితో పాటుగా, విద్యారంగంలో  మహిళలు స్థాపించిన, మహిళల సారథ్యంలో నడుస్తున్న సంస్థలను, అవికూడా గ్రామీణ ప్రాంతాలను ప్రభావితం చేసే స్టార్టప్ కంపెనీలను ఈ అవార్డుల ఎంపికకు పరిగణనలోకి తీసుకున్నారు.

   దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి మొత్తం 1,641 దరఖాస్తులు అందాయి. వీటిలో 654 దరఖాస్తులు మహిళల సారథ్యలోని సంస్థలనుంచి, 165 దరఖాస్తులు విద్యాసంస్థల తరహాలో నడిచే వాటినుంచి, 331దరఖాస్తులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే స్టార్టప్ లనుంచి అందాయి. స్థూలంగా ఆరు అంశాల ఆధారంగా ఈ దరఖాస్తులను మదింపు చేశారు. సృజనాత్మకత, ఎదిగే స్వభావం, ఆర్థిక ప్రభావం, సామాజిక ప్రభావం, పర్యావరణంపై ప్రభావం, సమ్మిళిత స్వభావం, విభిన్నత్వం వంటి పరిశీలనాంశాలు ప్రాతిపదికగా వివిధ స్టార్టప్ కంపెనీల దరఖాస్తులను మదింపు చేశారు.  మూడు దశలలో నిశితంగా మదింపు ప్రక్రియ తర్వాత అవార్డుల ప్రదానానికి 199 స్టార్టప్ కంపెనీలను ఎంపిక చేసి న్యాయ నిర్ణేతల సంఘం పరిశీలనకు పంపించారు. పారిశ్రామిక రంగం, పెట్టుబడిదారుల రంగం, ప్రభుత్వత శాకల నుంచి నిపుణులతో కూడిన 15 న్యాయనిర్ణేతల సంఘాల ముందు 192 సంస్థల ప్రతినిధులు తమ కంపెనీల కార్యకలాపాలపై వాదనలను సమర్పించారు.

   స్టార్టప్ అవార్డులకు ఎంపికైన సంస్థలకు గుర్తింపుతోపాటుగా పలు ప్రయోజనాలు లభిస్తాయి. మరింత ఎక్కువ వ్యాపారాన్ని, ఆర్థిక సహాయాన్ని, భాగస్వామ్యాలను, ప్రతిభావంతమైన మానవ వనరులను ఆకర్షించడానికి కూడా వీలుంటుంది. అలాగే,  ఇతర సంస్థలకు ఇవి ఆదర్శవంతమైన నమూనాలుగా గుర్తింపును పొందవచ్చు. అవార్డుల కోసం 31 దరఖాస్తులు ఇంక్యుబేటర్ సంస్థలనుంచి, పది దరఖాస్తులు ఆక్జిలేటర్స్ నుంచి అందగా,  మూడు దశల వడపోతతర్వాత, 9 ఇంక్యుబేటర్లు, 5 ఆక్జిలేటర్లు న్యాయనిర్ణేతల సంఘాల ముందు తమ కంపెనీల వాదనల సమర్పణకు ఎంపికయ్యాయి. అవన్నీ న్యాయనిర్ణేతల ముందు తమ తమ ప్రెజెంటేషన్ సమర్పించాయి.

  2020వ సంవత్సరపు జాతీయ స్టార్టప్ అవార్డుల ఫలితాలను అనుబంధంలో పొందుపరిచారు.

  అవార్డులకు ఎంపికైన సార్టప్ కంపెనీలకు సత్కార కార్యక్రమం నిర్వహించడంతోపాటుగా, 2020వ సంవత్సరపు జాతీయ స్టార్టప్ అవార్డులపై ఈ-నివేదికను కూడా విడుదల చేశారు. విజేతల వివరాలతోపాటుగా, తొలి జాతీయ స్టార్టప్ అవార్డుల సంపూర్ణ ప్రక్రియను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఈ నివేదికను రూపొందించారు.  ‘స్టార్టప్ ఇండియా షోకేస్’ అనే ఆన్ లైన్ ప్లాట్.ఫాంను, ‘బ్లాక్ చెయిన్ సర్టిఫికెట్ ఆధారిత ధ్రువీకరణ వ్యవస్థ’ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.  

  స్టార్టప్ ఇండియా పోర్టల్ లో భాగంగా ‘స్టార్టప్ ఇండియా షోకేస్’ అనే ఆన్ లైన్ ప్లాట్ ఫాంను రూపొందించారు. దేశంలో బాగా  వృద్ధిలోకి వస్తున్న, ఆశావహమైన స్టార్టప్ కంపెనీలను కనుగొనడం  ఈ ప్లాట్ ఫాం లక్ష్యం. ఈ ప్లాట్ ఫాంపై పొందుపరిచిన స్టార్టప్ కంపెనీలను నిపుణులు ఎంపిక చేసుకుని ఆర్థిక, విద్యారంగాలకు చెందిన ఫిన్.టెక్, ఎడ్.టెక్ వంటి విభిన్న సాంకేతిక పరిజ్ఞాన రంగాలకు, సామాజికంగా ప్రభావితం చేసే అంశాలకు వినియోగిస్తారు. సత్తాకలిగిన భాగస్వామ్యాలు, పెట్టుబడులు, ప్రజాసంబంధమైన సేకరణ రంగాలను కనుగొని, సదరు రంగాలకు స్టార్టప్ కంపెనీలతో  అనుసంధానం కల్పించేందుకు ఈ షోకేస్ దోహదపడుతుంది. పారిశ్రామిక రంగం, పెట్టుబడుల రంగం, ప్రభుత్వ అధికార యంత్రాగాలకు సహాయకారిగా పనిచేస్తుంది. దేశంలో స్టార్టప్ ల సానుకూల వాతావరణం మరింత మెరుగ్గా అభివృద్ధి చెందేందుకు,  సదరు కంపెనీలు స్ఫూర్తిదాయంగా సేవలందించేందుకు ఈ షోకేస్ దోహదపడుతుంది.

   ఇక,..స్టార్టప్ కంపెనీలపై ఎప్పటికప్పుడు ధ్రువీకరణ ప్రక్రియను చేపట్టేందుకు, డి.పి.ఐ.ఐ.టి. జారీ చేసే గుర్తింపు సర్టిఫికెట్లతో సదరు కంపెనీలకు అనుసంధానం కల్పించేందుకు ‘బ్లాక్ చెయిన్ సర్టిఫికెట్ ఆధారిత ధ్రువీకరణ వ్యవస్థ’ దోహదపడుతుంది. ఈ వ్యవస్థలో స్టార్టప్ కంపెనీల సర్టిఫికెట్లకు భద్రత కల్పించే ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. గుర్తింపు పొందిన స్టార్టప్ కంపెనీలకు విభిన్న అవకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు ముందు సదరు కంపెనీల తాజా స్థితిని, ప్రగతిని తరచి చూసేందుకు ధ్రువీకరించుకునేందుకు ఈ వ్యవస్థ వీలు కల్పించింది. ప్రభుత్వ శాఖలకు, సేకరణ సంస్థలకు, పెట్టుబడి దారులకు, థర్ట్ పార్టీలకు మాత్రమే ఈ వ్యవస్థ అవకాశం కల్పిస్తుంది.

   అవార్డులు సాధించి విజేతలైన సంస్థలకు  కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ అభినందనలు తెలిపారు. యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తమ ఆలోచనలను, సృజనాత్మక భావనలను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు తగిన ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని ఈ అవార్డులు అందిస్తాయని కేంద్రమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొత్త ఆలోచనలను, భావనలను, కొత్త మార్గాలను, పనితీరును గుర్తించే విషయంలో ఈ అవార్డులు విభిన్నమైనవని అన్నారు. సృజనాత్మకమైన స్టార్టప్ కంపెనీలకోసం కొత్త సానుకూల వాతావరణాన్ని గుర్తించడమేకాక, స్టార్టప్ కంపెనీల కుటుంబాన్ని మరింత ఎత్తులకు ఎదిగేలా చేయడమే ఈ అవార్డుల లక్ష్యమన్నారు. అలా గుర్తింపు పొందిన కొన్ని స్టార్టప్ కంపెనీలైనా భవిషత్తులో అరుదైన అద్భుతమైన గొప్ప సంస్థలుగా ఎదిగే అవకాశం ఉంటుందని, అలాంటి సంస్థల విజయగాధలను ప్రపంచం కూడా గుర్తిస్తుందని, దీనితో స్టార్టప్ కంపెనీలు మరింత అభివృద్ధి సాధించి, కొత్త భౌగోళిక సరహిద్దులవరకూ విస్తరించి, ఎక్కువ మందికి సేవలందించే అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు.  

  అనేక కీలక రంగాలలో స్టార్టప్ కంపెనీలు ప్రముఖ పాత్ర పోషించబోతున్నాయని గోయెల్ అన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని, అభివృద్ధి ఫలాలను సమాజంలో చివరి వ్యక్తి వరకూ అందిస్తుందని అన్నారు. నైపుణ్యాల నిర్మాణానికి, నాణ్యతను మెరుగు పరుచుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపకరిస్తుందన్నారు. స్టార్టప్ కంపెనీలన్నీ తమ పేర్లను ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ (జి.ఇ.ఎం.)లో నమోదు చేసుకోవాలని, అప్పుడే సదరు స్టార్టప్ కంపెనీలు ప్రభుత్వ శాఖలకు, భారీ సంఖ్యలో వినియోగదారులకు సేవలందించగలుగుతాయని గోయెల్ సూచించారు. జనం ఉద్యోగాన్వేషకులుగా మాత్రమే కాకుండా, ఉద్యోగాల సృష్టికర్తలుగా మారుతూ ఉండటం హర్షదాయకమన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను కార్యోన్ముఖం చేయడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సదుపాయాలు కల్పిస్తున్నాయన్నారు. కోవిడ్-19 వైరస్ దాడిని సవాలుగా పరిగణించరాదని, సవాళ్లను తట్టుకుని నిలిచేవారంతా దీన్ని సానుకూల అవకాశంగా మలుచుకుని, తమ ఆలోచనలు, సృజనాత్మక భావనలతో కేంద్రీకృత కార్యాచరణతో పోరాటంసాగిస్తే తప్పక సత్ఫలితాలను పొందవచ్చని ఆయన అన్నారు.

   కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి 2016లో ప్రారంభించిన స్టార్టప్ ల పథకం ఇపుడు దేశంలో ప్రతి మారుమూలకూ విస్తరించిందని,  586 జిల్లాల్లోని ప్రతి జిల్లాలో కనీసం ఒక్కటైనా స్టార్టప్ కంపెనీ ఉందని అన్నారు. స్టార్టప్ కంపెనీలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సదుపాయాలు అంకుర స్థాయిలోని సంస్థలకు దోహదపడుతున్నాని, దేశంలోని ప్రతిభను, నైపుణ్యాలను బయటకు తీసుకువస్తున్నాయని కేంద్రమంత్రి అన్నారు.

జాతీయ స్టార్టప్ అవార్డుల నివేదిక: https://we.tl/t-9JSi29aCyg

అవార్డు విజేతల జాబితాకోసం క్లిక్ చేయండి.

పీయూష్ గోయెల్ ప్రసంగం కోసం లింక్: https://www.facebook.com/watch/live/?v=819462168878777&ref=watch_permalink

స్టార్టప్  కంపెనీలపై వీడియో: https://twitter.com/pib_india/status/1313423358290083840?s=24

*****(Release ID: 1662628) Visitor Counter : 13