యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
విదేశీ శిక్షణ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు ఇటలీ, ఫ్రాన్స్‌లకు వెళ్లనున్న భారత పురుష, మహిళా బాక్సర్లు
Posted On:
07 OCT 2020 5:47PM by PIB Hyderabad
విదేశీ శిక్షణ మరియు అంతర్జాతీయ పోటీలో పాల్గొనేందుకు గాను భారత దేశపు మేటి పురుష మరియు మహిళా బాక్సర్లు ఇటలీ, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లనున్నారు.
అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో 52 రోజుల పాటు ఐరోపాలోని ఆయా దేశాలకు వీరు వెళ్లనున్నారు. ఈ విదేశీ శిక్షణ అవగాహనకు గాను ప్రభుత్వం దాదాపుగా రూ.1.31 కోట్ల మేర నిధులను మంజూరు చేసింది. మొత్తంగా 10 మంది మగ బాక్సర్లు, 6 మంది మహిళా బాక్సర్లు, సహాయక సిబ్బందితో దాదాపు 28 మందితో కూడిన బృందం ఆయా దేశాల్లో పర్యటించనుంది. ఇందులో టోక్యో
ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు స్థానం సంపాదించుకున్న అమిత్ పంగల్, ఆశిష్ కుమార్, సతీష్ కుమార్, సిమ్రాంజిత్ కౌర్, లోవ్లినా బోర్గోహైన్ మరియు పూజా రాణి తదితరులున్నారు. భారతదేశం ఇంకా కోటాను గెలుచుకోవాల్సిన నాలుగు ఈవెంట్లలో (పురుషుల 57 కిలోలు, పురుషుల 81 కిలోలు, పురుషుల 91 కిలోలు, మహిళల 57 కిలోలు) పోటీపడే ఇతర బాక్సర్లు కూడా ఈ బృందంలో భాగంగా ఉండనున్నారు. వీరితో పాటు పురుషుల జట్టులో 08 మంది కోచ్‌లు మరియు సహాయక సిబ్బంది మరియు మహిళల జట్టులో 04 కోచ్‌లు మరియు సహాయక సిబ్బంది ఉండనున్నారు.
ఐరోపా ప్రత్యర్థులతో పోటీ ఎంతగానో మేలు చేస్తుంది..
మహిళల 69 కిలోల విభాగం భారత బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ మళ్ళీ పోటీలో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నామని అన్నారు. “మేము మళ్ళీ పోటీ అనుభూతిని పొందడం చాలా మంచిగా అనిపిస్తోంది. నేను దీని గురించి చాలా ఆసక్తిగా ఉన్నారు. ఒలింపిక్స్ పోటీలకు దాదాపుగా 10 నెలల ముందు, యూరోపియన్ ప్రత్యర్థులతో పోటీపడటం నిజంగా మాకు ఎంతగానో దోహదం చేస్తుంది.”
ఇటలీలోని అస్సిసిలో శిక్షణ..
పురుషు మరియు మహిళల బాక్సింగ్ బృందం ఇటలీలోని అస్సిసిలో అక్టోబర్ 15 నుండి డిసెంబర్ 5 వరకు 52 రోజుల పాటు శిక్షణ పొందనుంది. వీరి బస, విమాన ఛార్జీలు, వీసా ఫీజు రుసుము తదితరాలు ప్రభుత్వం భరించే ఖర్చుల్లో అంతర్భాగంగా ఉండనున్నాయి. మొత్తం 28మంది ఆటగాళ్ళు, సిబ్బంది యొక్క కోవిడ్ టెస్టుల వ్యయమూ ఈ ఖర్చులో అంతర్భాగంగా ఉండనుంది. అక్టోబర్ 28 నుండి 30 వరకు ఫ్రాన్స్‌లోని నాంటెస్ లో జరగనున్న “అలెక్సిస్ వాస్టిన్ ” అనే అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో 13 మంది బాక్సర్లు పాల్గొంటారు.
మన స్థాయి గురించి అవగాహన పొందే అవకాశం..
పురుషుల 75 కిలోల విభాగంలో పోటీపడే బాక్సర్ ఆశిష్ కుమార్ మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో తాము ఎదుర్కొనేందుకు అవకాశం ఉన్న ప్రత్యర్థులు ఈ పోటీలకు రాబోతున్నందున ఈ టోర్నమెంట్ మంచి సన్నాహకంగా నిలుస్తుందని అన్నారు. “విదేశాల నుండి వచ్చే ఆయా పోటీదారులతో ఆడటం చాలా.. సహాయకారిగా ఉంటుంది. మేము ఇప్పటికే పాటియాలాలోని శిబిరంలో ఉన్నాము మరియు మా ఫిట్‌నెస్‌ను తిరిగి పొందాము. విదేశాలకు వెళ్లడం నిజంగా సహాయపడుతుంది. మేము కొత్త పోటీదారులను కలిసినప్పుడు, మన స్థాయి గురించి మాకు ఒక అవగాహన వస్తుంది. ఇది మేము ఏస్థాయిలో నిలిచి ఉన్నాము.. మరియు ఏ అంశాలను మెరుగుపరుచుకోవాలి అనే దాని గురించి ఒక అవగాహన పొందడానికి ఇది మాకు సహాయపడుతుంది.”
గతంలో ఎన్నడూ లేని విధంగా ఒలింపిక్స్‌లో స్థానం..
గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ నుంచి తొమ్మిది బాక్సింగ్ క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్‌లో స్థానం సంపాదించారు. వచ్చే ఏడాది జరగాల్సిన ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫైయింగ్ ఈవెంట్ భారత బాక్సర్లు ఒలింపిక్స్ కోసం కోటాలు పొందేందుకు చివరి ఈవెంట్. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా సంభవించిన వివిధ అంతరాయాల తర్వాత ఆయా అంతర్జాతీయ పోటీలలో మన బాక్సర్లు ఏ స్థాయిలో నిలబడతారో తెలుసుకునేందుకు గాను విదేశీ పర్యటన, ఎక్స్‌పోజర్ ట్రిప్ ఒక అవకాశంగా నిలుస్తుందని భారత పురుషుల బాక్సింగ్ జట్టు చీఫ్ కోచ్ సి.ఎ.కట్టప్ప అన్నారు. ఈ పర్యటన తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. “గత సంవత్సరం ఇదే సమయంలో, మేము అత్యధిక మేటి ఫిట్‌నెస్‌ను కలిగి ఉన్నాము. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నాము, తీవ్రంగా మేటి శిక్షణ పొందుతున్నాము. విదేశీ పర్యటనను మంజూరు చేసిన ప్రభుత్వానికి ఎంతో ధన్యవాదాలు. బాక్సర్లు చాలా సంతోషంగా ఉన్నారు, వారు భిన్నంగా ఏదైనా చేయాలనుకుంటున్నారు. వారికి పోటీ మరియు శిక్షణ అవసరం. యూరోపియన్ బాక్సర్లతో పోలిస్తే పోటీలో తాము ఏ స్థాయిలో నిలబడతామో చూడాలని ఆటగాళ్లు కోరుకుంటారు. యూరప్ నుండి ఎదురయ్యే పోటీకి సంబంధించి ఒక మంచి అవగాహన కలుగుతుంది.” అని అన్నారు.
*******
(Release ID: 1662528)
Visitor Counter : 135