రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఎయిరో ఇండియా-21 ప్రదర్శనకు రావాలంటూ ప్రపంచ దేశాలకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ పిలుపు

వివిధ దేశాల రాయబారుల వర్చువల్ రౌండ్ టేబుల్.కు రక్షణమంత్రి అధ్యక్షత

Posted On: 07 OCT 2020 5:54PM by PIB Hyderabad

ఎయిరో ఇండియా-2021 పేరిట వచ్చే ఏడాది కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో నిర్వహించబోతున్న వైమానిక ప్రదర్శనపై చర్చించేందుకు ఈరోజు ఢిల్లీలో వివిధ దేశాల రాయబారులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలోని రక్షణ ఉత్పత్తి విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి  రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. 200మందికి పైగా ఆహ్వానితులు ఆన్ లైన్ ద్వారా హాజరయ్యారు. వివిధ దేశాల రాయబారులు, దౌత్యకార్యాలయాల అధిపతులు, 75 దేశాల దౌత్య కార్యాలయాలతో అనుబంధించిన రక్షణ శాఖ అధికారులు సమావేశంలో పాలుపంచుకున్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఎయిరో ఇండియా మెగా వైమానిక ప్రదర్శకు పెరుగుతున్న ప్రాధాన్యతను ఈ రౌండ్ టేబుల్ సమావేశం సూచిస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా చెబుతున్న ఎయిరో ఇండియా వైమానిక ప్రదర్శన 2021, ఫిబ్రవరి 3నుంచి 7వతేదీవరకు జరుగుతుంది.  న్యూఢిల్లీలోని విదేశాల రాయబార, దౌత్య కార్యాలయాల్లో పనిచేసే సీనియర్ ప్రతినిధులకు ఎయిరో ఇండియా ప్రదర్శన గురించి చాలా ముందస్తుగానే వివరించారు. వైమానిక ప్రదర్శనలో ఆయా దేశాల అధినేతలు, సీనియర్ విధాన నిర్ణాయక కర్తలు హాజరయ్యేలా ప్రోత్సహించేందుకు ఈ చర్య తీసుకున్నారు. ఎయిరో ఇండియా  ఎయిర్ షోలో భారతదేశపు గగనతల రక్షణ వ్యవస్థ ప్రత్యేకతను, రక్షణ ఉపకరణాల తయారీ సామర్థ్యాలను ప్రదర్శిస్తారు.

   సమావేశాన్ని ఉద్దేశించి రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ, రక్షణ రంగం, గగనతల పరిశ్రమల రంగంలో ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి దేశాల సరసన భారత్ కూడా నిలవాలన్న దార్శనికతకు అనుగుణంగా ఎయిరో ఇండియా ప్రదర్శన చేపడుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ఈ ప్రదర్శనలో చురుకుగా పాల్గనబోతున్నందున, దేశ స్వావలంబన లక్ష్యాలను, ఇతర మిత్ర దేశాల అవసరాలను నెరవేర్చినట్టు అవుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ పథకం మన దేశ స్వావలంబ సాధనకు కీలకమవుతుందని, దీనికి అనుగుణంగానే రక్షణ మంత్రిత్వ శాఖ అనేక పథకాలను ప్రకటించిందని ఆయన అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74శాతానికి పెంచడం, 2020వ సంవత్సరపు రక్షణ సామగ్రి సేకరణ ప్రక్రియ, రక్షణ రంగంలో సహ రూపకల్పన, సహ ఉత్పత్తిలో పెట్టుబడుల ప్రోత్సాహానికి మార్గదర్శక సూత్రాలను సవరించడం, కరోనా మహమ్మారి వ్యాప్తి అనంతర కాలంలో రక్షణ రంగ వాణిజ్యాన్ని ప్రోత్సహించేలా రక్షణ ఉత్పత్తి, ఎగుమతుల విధానాన్ని ప్రత్యేకంగా రూపొందించడం వంటి చర్యలను రాజ్ నాథ్ సింగ్ ఉదహరించారు.

   భారతదేశపు గగనతల, రక్షణ రంగాలు ఇపుడు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాయని, మిత్ర దేశాలతో పరస్పర ప్రయోజనాలతో కూడిన భాగస్వామ్యాలపై అవకాశాలను అన్వేషిస్తున్నాయని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. భారతదేశంలో రక్షణ సామగ్రి తయారీ పరిశ్రమలు నెలకొల్పడానికి, భారత్ లో తయారైన రక్షణ సామగ్రిని దేశాలకు ఎగుమతిచేసేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నట్టు రక్షణ మంత్రి చెప్పారు. ఎయిరో స్పేస్ రంగంలో 2,500కోట్ల అమెరికన్ డాలర్ల మేర వాణిజ్యం సాధించాలన్న భారత్ లక్ష్యాన్నితెలియజెప్పేందుకు ఎయిరో ఇండియా షో దోహదపడుతుందని, 2025నాటికి 500కోట్ల అమెరికన్ డాలర్ల మేర ఎయిరో స్పేస్ ఉత్పాదనలను, రక్షణ సామగ్రిని, ఇతర సేవలను అందించడమే లక్ష్యమని అన్నారు.

   ఎయిరో ఇండియా-21 ప్రదర్శన వాణిజ్య ప్రధానమైన కార్యక్రమమని, కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని వివిధ దేశాల ప్రతినిధులకు రాజ్ నాథ్ వివరించారు. ఎయిరో ఇండియా షోకు సంబంధించిన వెబ్ సైట్ ను ప్రారంభించినప్పటినుంచి ఈ ప్రదర్శనకు ఎంతో ప్రతిస్పందన వ్యక్తమైంది. 2020, సెప్టెంబర్ 11న వెబ్ సైట్ ను ప్రారంబించగా, ఇప్పటికే ఈ ప్రదర్శనలో 90శాతం స్లాట్ల బుకింగ్ పూర్తయిందంటే, ఇందులో పాల్గొనేందుకు ప్రదర్శన సంస్థలు ఎంత ఆసక్తి చూపిస్తున్నాయో తెలుస్తోంది. ఈ ప్రదర్శనలో నిర్వహించ తలపెట్టిన వాణిజ్య కార్యక్రమాలను, సదస్సులకు తుదిరూపం ఇచ్చే కసరత్తు ఇంకా సాగుతోందని. 500కు పైగా సంస్థలు ఎయిర్ షోలో పాల్గొనే అవకాశాలున్నాయని రాజ్ నాథ్ చెప్పారు .

   ఎయిరో ఇండియా ప్రదర్శనకు వివిద దేశాల నేతలు, పారిశ్రామి రంగం అధినేతలు, రక్షణ పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యేలా ఒప్పించాలని ఆయా దేశాల రాయబారులకు రక్షణమంత్రి విజ్ఞప్తి చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలే లక్ష్యంగా భారతదేశంలో నెలకొన్న వాణిజ్య అవకాశాలను వినియోగించుకోవాలని వారికి సూచించారు. ఎయిరో ఇండియా-21 ప్రదర్శనపై రూపొందించిన అధికారిక ప్రారంభ చలనచిత్రాన్ని రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా విడుదల చేశారు.

   ‘వందలాది అవకాశాలకు రన్ వే’ అన్న ఇతివృత్తంతో ఎయిరో ఇండియా ప్రదర్శనను నిర్వహిస్తున్నామన్నారు. కోవిడ్ అనంతరం భారత్ తన సామర్థ్యాల ప్రదర్శనలో ఆధిక్యతను చూపేందుకు, సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ ప్రదర్శన దోహదపడుతుందని అన్నారు.  ,

   ఎయిరో ఇండియా ప్రదర్శనకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ ఉత్పత్తి శాఖ ఈ నాటి రౌండ్ టేబుల్ సమావేశంలో వివరించింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమ నిర్వహణపై తగిన హామీ కూడా ఇచ్చింది. సురక్షితమైన వాతావరణంలో ఎయిర్ షో నిర్వహణకు తాము సన్నద్ధంగా ఉన్నట్టు, తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ సమావేశంలో తెలియజేసింది.

   కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్ప కూడా నేటి సమావేశంలో అతిథులనుద్దేశించి ప్రసంగించారు.  ఫిబ్రవరిలో బెంగళూరులో ఎయిరో ఇండియా ప్రదర్శనను సురక్షితంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లన్నీ కర్ణాటక ప్రభుత్వం చేస్తుందని, హాజరయ్యే అతిథులందరికీ  రక్షణ కోసం, కోవిడ్-19 ఆరోగ్య నిబంధనావళిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.   ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయమంత్రి శ్రీపాద యెస్సో నాయిక్, రక్షణ ఉత్పత్తి శాఖ కార్యదర్శి రాజ్ కుమార్ కూడా ప్రసంగించారు. ఆత్మనిర్భర భారత్ పథకానికి ఒక మూలస్తంబంగా నిలిచేలా స్వదేశీ రక్షణ పరిశ్రమను తీర్చిదిద్దుతామని, ఆ లక్ష్యంకోసమే రక్షణమంత్రిత్వ శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తుందని వారు ప్రకటించారు. ఎయిరో ఇండియా-21 ప్రదర్శనకు రావలసిందిగా విదేశీ ప్రతినిధులకు వారు ఆహ్వానం పలికారు.

****


(Release ID: 1662505) Visitor Counter : 177