రైల్వే మంత్రిత్వ శాఖ
పీపీపీ పద్ధతిలో ప్రయాణీకుల రైళ్లను నడిపే ప్రాజెక్టులో, ఆర్‌ఎఫ్‌క్యూలకు స్పందనగా వచ్చిన దరఖాస్తులను తెరిచిన రైల్వే శాఖ అద్భుత స్పందన అందుకున్న రైల్వే శాఖ
12 క్లస్టర్ల కోసం 15 సంస్థల నుంచి వచ్చిన 120 దరఖాస్తులు
Posted On:
07 OCT 2020 6:15PM by PIB Hyderabad
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ప్రయాణీకుల రైళ్లను నడిపే ప్రాజెక్టులో, 'అర్హత కోసం అభ్యర్థన'లకు (ఆర్‌ఎఫ్‌క్యూ) స్పందనగా వివిధ సంస్థల నుంచి వచ్చిన దరఖాస్తులను రైల్వే శాఖ తెరిచింది. ఆర్‌ఎఫ్‌క్యూలకు అద్భుత స్పందన వచ్చింది. 12 క్లస్టర్ల కోసం 15 సంస్థల నుంచి మొత్తం 120 దరఖాస్తులు వచ్చాయి.
12 క్లస్టర్లలోని 140 జతల రూట్లలో ఉత్తమ నాణ్యతతో కూడిన రైళ్ల సంఖ్యను పెంచేందుకు 151 ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా, ప్రయాణీకుల రైళ్ల సేవల్లో ప్రైవేటు భాగస్వామ్యం కోసం, రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జులై 1వ తేదీన ఆర్‌ఎఫ్‌క్యూల ప్రకటన ఇచ్చింది.
ప్రయాణీకుల రైళ్లను నడిపేందుకు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేలా చేపట్టిన మొదటి ప్రధాన చర్య ఇది. ప్రైవేటు రంగం నుంచి దాదాపు రూ.30 వేల కోట్లను సమీకరించడం ఈ ప్రాజెక్టు వ్యూహం.
ప్రాజెక్టును దక్కించుకునే ప్రైవేటు సంస్థలను పారదర్శకంగా, రెండు దశల పోటీ బిడ్డింగ్ విధానంలో ఎంపిక చేస్తారు. ఆ దశలు: అర్హత కోసం అభ్యర్థన (ఆర్‌ఎఫ్‌క్యూ), ప్రతిపాదన కోసం అభ్యర్థన (ఆర్‌ఎఫ్‌పీ).
దరఖాస్తులను రైల్వేశాఖ వేగంగా పరిశీలించి, అర్హత పొందిన సంస్థలకు నవంబర్ నాటికి ఆర్‌ఎఫ్‌పీ పత్రాలను అందుబాటులోకి తెస్తుంది. ఎంపికైన సంస్థలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అన్ని క్లస్టర్లను అప్పగించాలన్నది లక్ష్యం.
***
(Release ID: 1662498)
Visitor Counter : 121