పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

జీవవైవిధ్య పరిరక్షణ చర్యలను సత్వరం మరింత వేగవంతం చేయాలి ఐక్యరాజ్యసమితి సదస్సులో భారత్ సూచన

Posted On: 01 OCT 2020 7:11PM by PIB Hyderabad

   జీవవైవిధ్యాన్ని పరిరక్షించే చర్యలను సత్వరం వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని భారత్ సూచించింది. ఐక్యరాజ్య సమితి జీవవైవిధ్య దశాబ్ది (2011-2020) త్వరలో ముగుస్తున్న ప్రస్తుత తరుణంలో జీవవైవిధ్య రక్షణను వేగిరపరిచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 75వ వార్షికోత్సవం సందర్భంగా జీవ వైవిధ్యంపై జరిగిన ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సదస్సులో భారత్ తరఫున  ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రమంత్రి జవదేకర్ ఈ విజ్ఞప్తి చేశారు.

  ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో జీవ వైవిధ్యంపై ఇలాంటి శిఖరాగ్ర సదస్సు జరగడం ఇదే తొలిసారి. జీవవైవిధ్య ఒడంబడిక (సి.బి.డి.)తో ప్రమేయం కలిగిన వివిధ దేశాల ప్రభుత్వాధినేతలు, మంత్రుల స్థాయి ప్రతినిధులు ఈ శిఖరాగ్ర సదస్సు పాల్గొన్నారు.

 

   ఈ సదస్సులో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రసంగం పూర్తి పాఠం ఈ విధంగా ఉంది.:-

 

గౌరవనీయులైన సభ్యులారా.,

సోదర సోదరీమణులారా.,

  • సమున్నతమైన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 75వ సమ్మేళనంలో మీ సమక్షంలో నేను నిలిచి ఉన్నాను. ప్రపంచంలోని  జీవవైవిధ్య సంపన్నమైన 17 దేశాల్లో ఒకటైన భారత దేశ ప్రతినిధిగా  నేను మాట్లాడుతున్నాను.

 

  • భారతదేశానికి అనాదిగా ఒక ఉతృష్టమైన సంస్కృతి ఉంది.  ప్రకృతిని రక్షించడం, ప్రకృతి వనరులను పొదుపుచేయడమేకాదు,..  ప్రకృతితో కలసి సామరస్యంగా జీవించడమనేది భారతీయ సంస్కృతిలో భాగంగా ఉంటోంది.

 

  • అదుపులేకుండా ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం, నియంత్రణలేని ఆహారపు అలవాట్ల కారణంగా పర్యావరణ వ్యవస్థ దెబ్బతినిందని, మానవుల జీవితాలకు అండగా నిలిచిన ప్రకృతి వ్యవస్థ ధ్వంసమైందని కోవిడ్-19 వైరస్ గట్టిగా రుజువు చేసింది. 

 

  • అయితే, ఇప్పటికీ ప్రకృతిని సంరక్షించవచ్చని, ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకుని మనుగడ సాగించవచ్చని కూడా కోవిడ్-19 మనకు తెలియజెప్పింది.

 

  • ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య దశాబ్ది (2011-2020) త్వరలో ముగియబోతున్న ప్రస్తుత తరణంలో జీవ వైవిధ్య పరిరక్షణకు మనం నడుంకట్టి మరింత వేగంగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

 

 

గౌరవ సభ్యులారా,

  • “ప్రకృతి రక్షతి రక్షితః ” అంటూ వేదాల్లో పేర్కొన్నట్టుగా,.. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి కూడా మనల్ని రక్షిస్తుంది.

 

  • మహాత్మా గాంధీ స్ఫూర్తిగా, అహింసా మార్గాన్ని పాటించాలని, ఇతర జీవుల మనుగడపై, ప్రకృతి రక్షణపై శ్రద్ధతో మెలగాలని ప్రబోధించే నైతిక సూత్రాలను భారతీయ రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. దేశంలోని అనేక చట్టాలు, శాసనాలు కూడా ఇవే సూత్రాలను ప్రతిబింబిస్తున్నాయి.

 

  • ఈ విశ్వాసాలు, ఉత్కృష్టమైన సంప్రదాయాల కారణంగానే,.. భూగోళంలో 2.4శాతాన్ని మాత్రమే ఆవరించిన భారతదేశం ప్రపంచంలోని 8శాతం జీవ జాతులకు ఆశ్రయమిస్తోంది.

 

  • దేశంలోని మొత్తం భౌగోళిక ప్రాంతంలో 24.56 శాతాన్ని, చెట్లూ చేమలున్న అటవీ ప్రాంతంతో గత దశాబ్దకాలంలోనే పెంచగలిగినట్టు ఈ సమున్న సదస్సుకు సంతోషంగా చెప్పగలుగుతున్నాను.

 

  • వన్య ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో పులుల జనాభా మా దగ్గరే ఉంది. 2022నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేయాలన్నది లక్ష్యమైనప్పటికీ, గడువుకు ముందుగానే సదరు లక్ష్యాన్ని సాధించాం. సింహాల రక్షణకోసం ప్రాజెక్ట్ లయన్, డాల్ఫిన్ల రక్షణకోసం ప్రాజెక్ట్ డాల్ఫిన్ కార్యక్రమాలను ఇటీవలే ప్రారంభించాం.

 

  • భూసారం కోల్పోయి, అటవులు నశించి బంజరుగా మారిన 2.6కోట్ల హెక్టార్ల భూమిని తిరిగి భూసారంతో పునరుద్ధరించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికల్లా భూసారాన్ని పూర్తిగా పునరుద్ధరించేందుకు కృషి చేస్తోంది.

 

 

  • అతి విస్తృతమైన లక్ష్యాలను పక్కనబెట్టిన భారతదేశం,.. ఐచీ జీవవైవిధ్య లక్ష్యం-11ను, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు-11ను సాధించేందుకు తగిన ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

 

  • జీవవైవిధ్య ఒడంబడిక ప్రకారం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకోసం ఒక సమగ్రమైన సంస్థాగతమైన చట్టబద్ధ వ్యవస్థను భారతదేశం ఇప్పటికే ఏర్పాటు చేసుకుంది.

 

  • జీవవైవిధ్య ఒడంబడికలోని నిబంధనలను అందుబాటులో ఉండేలా, సదరు ప్రయోజనాలను పంచుకునేలా ఒక జాతీయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 2.50లక్షల జీవ వైవిధ్య నిర్వహణా కమిటీలు ఈ వ్యవస్థకింద పనిచేస్తున్నాయి. ఈ కమిటీలు స్థానిక ప్రజలకు కూడా ప్రమేయం కల్పిస్తూ, లక్షా 70వేల జీవవైవిధ్య రిజిస్టర్లను నమోదు చేయిస్తున్నారు.

 

 

గౌరవ సభ్యులారా..,

  • జీవ వైవిధ్య ఒడంబడిక (సి.బి.డి.)పై 2021లో జరగనున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్) సదస్సులో 2020 అనంతరం చేపట్టవలసిన జీవవైవిధ్య రక్షణ వ్యవస్థపై తీర్మానం ఆమోదించనున్నారు. ప్రకృతిని పరిరక్షించి, ప్రకృతి వనరులను పొదుపుగా వినియోగించుకునే కృషిని మరింత పెంపొందించుకునేందుకు ఈ కాప్ సదస్సు వీలు కలిగిస్తుంది.

 

  • కేవలం ఏడాది వ్యవధిలోపునే రెండు కాప్ సదస్సులను నిర్వహించడం ద్వారా జీవవైవిధ్య పరిరక్షణలో భారతదేశం ఇప్పటికే అగ్రగామి పాత్రను పోషించింది. 

 

  • మరుభూమీకరణ చర్యలకు వ్యతిరేకంగా  2019 సెప్టెంబరులో న్యూఢిల్లీలో ఒక కాప్-14 సదస్సును, వలస జాతులపై  2020 ఫిబ్రవరిలో గుజరాత్ లోని గాంధీనగర్ లో మరో కాప్-13 సదస్సును మేం నిర్వహించాం.

 

  • ప్రకృతి పరిరక్షణ, సుస్థిరమైన జీవన విధానం, పచ్చదనాన్ని అభివృద్ధి చేయడం అన్న నమూనా ద్వారా వాతావరణ ప్రతికూల మార్పులను ఎదుర్కొనే కృషిలో భారతదేశం ఎప్పటినుంచో అగ్రగామిగా ఉంటూ వస్తోంది.

 

 

 

గౌరవ సభ్యులారా,..

  • “ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం”, ఆ తర్వాత, “సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన -ఐక్యరాజ్యసమితి దశాబ్ది” ప్రారంభమవుతున్న తరుణంలో ప్రకృతిని కాపాడుకునే పంథాను అనుసరించేందుకు అందరం చేతులు కలుపుదాం.  “ప్రకృతి తో కలసి సామరస్యంగా జీవించడం” అనే కలను సాకారం చేసుకుందాం.

 

అందరికీ ఇవే నా కృతజ్ఞతలు..

***



(Release ID: 1660999) Visitor Counter : 1202