ఆర్థిక మంత్రిత్వ శాఖ

మరో రెండు రాష్ట్రాల్లో సంస్కరణల అమలు విజయవంతం

అదనంగా ₹7,106 కోట్ల రుణ సమీకరణకు అనుమతి

Posted On: 02 OCT 2020 10:52AM by PIB Hyderabad

   దేశంలోని మరో రెండు రాష్ట్రాలు- ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ అదనపు రుణ సమీకరణ నిమిత్తం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖనుంచి అనుమతి పొందాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ, వాణిజ్య సౌలభ్యంలో సంస్కరణలను విజయవంతంగా అమలు చేయడంతో ఈ మేరకు అర్హత పొందాయి. తదనుగుణంగా ఈ రాష్ట్రాలు ₹7,106 కోట్లదాకా అదనపు రుణాలు తెచ్చుకోవడానికి వీలుంటుంది.

ప్రజా పంపిణీ వ్యవస్థ సంస్కరణల్లో భాగంగా ‘ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు’ ప్రక్రియను పూర్తిచేసిన 6వ రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్‌ నిలిచింది. దీంతో ఈ రాష్ట్రానికి బహిరంగ విపణి రుణాల (ఓఎంబీ)ద్వారా ₹4,851 కోట్ల మేర అదనంగా అప్పులు తీసుకునేందుకు అర్హత లభించింది. కోవిడ్‌-19పై పోరాటానికి అవసరమైన అదనపు వనరులను సమకూర్చుకోవడంలో ఈ వెసులుబాటు తోడ్పడుతుంది.

   ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు పద్ధతి కింద ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ)సహా ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారులు దేశంలోనే ఎక్కడైనా రేషన్‌ సరకులు పొందే వీలుంటుంది. ప్రత్యేకించి వలస కార్మికులు, వారి కుటుంబాలు దేశంలోని ఏ చౌకధరల దుకాణంలోనైనా సరకులు తీసుకోవచ్చు. లబ్ధిదారులను కచ్చితంగా గుర్తించడానికి, నకిలీ/ద్వంద్వ/అనర్హ కార్డుదారులను తొలగించడానికి కూడా ఈ విధానం సమర్థంగా తోడ్పడుతుంది. ఆ మేరకు ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు విధానంవల్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడటమేగాక సంక్షేమ లక్ష్యం సంపూర్ణంగా నెరవేరుతుంది. ఇందుకు తగినట్లుగా రేషన్‌ కార్డుల అంతర్రాష్ట్ర బదిలీ సరళంగా సాగేందుకు రేషన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం చేయబడుతుంది. అలాగే లబ్ధిదారుల జీవప్రామాణిక వివరాలన్నటినీ దేశంలోని అన్ని చౌకరధరల దుకాణాలతో యాంత్రిక పద్ధతిలో జోడిస్తారు. దీంతోపాటు ఈ వివరాల నిర్ధారణ కోసం ఆయా దుకాణాల్లో ‘ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌’ (ఈ-పోస్‌) పరికరాలను అమరుస్తారు. ఈ సంస్కరణల అమలు బాధ్యతగల కేంద్ర ఆహార-ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ ఆయా రాష్ట్రాల్లో వీటి అమలు తీరును అంచనావేసి, ‘రాష్ట్ర స్థూలోత్పత్తి’ (జీఎస్‌డీపీ)లో 0.25 శాతం మేర అదనపు రుణ సమీకరణ అనుమతికి సిఫారసు చేస్తుంది. తదనుగుణంగా ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గోవా, కర్ణాటక, త్రిపుర రాష్ట్రాలు పైన పేర్కొన్న ప్రజా పంపిణీ వ్యవస్థ సంస్కరణలను విజయవంతంగా పూర్తిచేయడంతోపాటు ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు పద్ధతిని అమలు చేస్తున్నాయని నిర్ధారించింది.

   ‘వాణిజ్య సౌలభ్యం’ సంబంధిత సంస్కరణలను విజయవంతంగా అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. దీంతో బహిరంగ విపణి రుణాలద్వారా ₹2,525 కోట్ల మేర అదనంగా అప్పు తెచ్చుకునేందుకు అర్హత పొందింది. కాగా, దీనికన్నా ముందుగానే ప్రజా పంపిణీ సంస్కరణల్లో భాగమైన ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు పద్ధతిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. దేశంలో వ్యాపార పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని నిర్ధారించే ఒక ముఖ్యమైన సూచీ ‘వాణిజ్య సౌలభ్యం’. ఈ సూచీపరంగా మెరుగుదల సాధించడంద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో భవిష్యత్‌ వృద్ధికి అవకాశాలుంటాయి. అందువల్ల వాణిజ్య సౌలభ్య కల్పనకు సంబంధించి జిల్లాస్థాయిలో అమలు- లైసెన్సింగ్‌ సంస్కరణలకు ప్రోత్సాహం దిశగా ‘రాష్ట్ర స్థూలోత్పత్తి’లో 0.25 శాతం మేర అదనంగా రుణ సమీకరణ కోసం రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించబడింది. పారిశ్రామిక-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) సిఫారసులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఈ సదుపాయాన్ని కల్పించింది. ఈ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు కింద పేర్కొన్న చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది:

ఎ. డీపీఐఐటీ నిర్దేశించిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ‘జిల్లాస్థాయి వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక తొలిదశ అంచనాలను పూర్తిచేయాలి.

బి. డీపీఐఐటీ అందజేసిన జాబితా మేరకు- రాష్ట్రస్థాయిలో వివిధ కార్యకలాపాల కోసం అధికారుల నుంచి ఆయా వ్యాపారాలు పొందిన ధ్రువీకరణ పత్రాలు/ఆమోదాలు/ లైసెన్సుల పునరుద్ధరణ నిబంధనలను ప్రభుత్వం రద్దుచేయాలి. అలాగే స్వయంచలితంగా సహేతుక రుసుముల స్వీకరణ ద్వారా విచక్షణరహిత పునరుద్ధరణ పూర్తిచేయాలి. ఈ ప్రక్రియను కూడా స్వయంచలిత పారదర్శక ఆన్‌లైన్, విచక్షణరహిత పద్ధతిలో అమలు చేస్తే సంస్కరణగా అంగీకరించబడుతుంది.

సి. డీపీఐఐటీ అందజేసిన జాబితా మేరకు- రాష్ట్ర ప్రభుత్వం వివిధ చట్టాలకు అనుగుణంగా కంప్యూటరీకరించిన కేంద్రీయ యాదృచ్ఛిక తనిఖీ వ్యవస్థను అమలు చేస్తుంది. ఇందులో ఇన్‌స్పెక్టర్ల కేటాయింపు కేంద్రీయ పద్ధతిలోనే సాగుతుంది. ఆ మేరకు తదుపరి సంవత్సరాల్లో అదే ఇన్‌స్పెక్టరుకు అదే యూనిట్‌ తనిఖీ బాధ్యత కేటాయించబడదు. అంతేగాక తనిఖీకి ముందు వ్యాపార యజమానికి నోటీసు జారీ చేయబడుతుంది. అటుపైన తనిఖీ నిర్వహించిన 48 గంటల్లోగా సదరు నివేదికను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

   కోవిడ్‌-19 మహమ్మారి అనూహ్య సంక్షోభం కారణంగా 2020 మే నెలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల రుణ సమీకరణ పరిమితిని 2020-21కిగాను ‘రాష్ట్ర స్థూలోత్పత్తి’లో 2 శాతం మేర’ అదనంగా అనుమతించింది. దీనివల్ల దేశంలోని వివిధ రాష్ట్రాలకు ₹4,27,302 కోట్లదాకా అదనంగా రుణాలు తెచ్చుకునే వెసులుబాటు లభించింది. అయితే, ఇందులో 1 శాతం అనుమతికి సంబంధించి దిగువ నిర్దేశించిన నాలుగు రాష్ట్రస్థాయి సంస్కరణలను  అమలుచేసి ఉండాలి. వీటి ఆధారంగా ఒక్కొక్కదానికి ‘రాష్ట్ర స్థూలోత్పత్తి’లో 0.25 వంతున ప్రాధాన్యం ఇవ్వబడుతుంది:-

ఎ. ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు పద్ధతి అమలు;

బి. వాణిజ్య సౌలభ్య సంస్కరణల అమలు;

సి. పట్టణ స్థానిక సంస్థల/వినియోగ సంస్కరణలు;

డి. విద్యుత్‌రంగ సంస్కరణలు

***



(Release ID: 1660949) Visitor Counter : 207