సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

గాంధీమహాత్ముని 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని హస్తకళాకారులను సాధికారం చేసేందుకు 150 కార్యక్రమాలు ప్రారంభించిన కెవిఐసి

Posted On: 01 OCT 2020 5:58PM by PIB Hyderabad

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) దేశవ్యాప్తంగా 150 భారీ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు పుష్పాంజలులు ఘటించే కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. 

గాంధీజయంతిని పురస్కరించుకుని కెవిఐసి చైర్మన్ శ్రీ వినయ్కుమార్ సక్సేనా 150 భారీ కార్యక్రమాలను ప్రారంభించారు. గాంధీజయంతి పర్వదినాన కెవిఐసి ఇంత భారీ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టడం ఇదే ప్రథమం. ఈశాన్య రాష్ర్టాలైన అస్సాం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్ సహా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, జమ్ము-కశ్మీర్, గుజరాత్ రాష్ర్టాలు హస్తకళాకారుల సాధికారతకు చేపట్టిన ఈ కార్యక్రమాలను అధిక సంఖ్యలో నిర్వహించడంలో ముందువరుసలో ఉన్నాయి.
మేఘాలయలోని పశ్చిమ గారో హిల్స్ లో కెవిఐసి అత్యంత ఉత్సాహవంతమైన కుంహర్ సశక్తీకరణ్ యోజనను తొలి సారిగా చేపడుతోంది. ఇందులో భాగంగా ఫుల్బరి గ్రామంలో 40 కుమ్మరి కుటుంబాలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం గురువారం ప్రారంభమయింది. అలాగే ఈశాన్య రాష్ర్టాల్లో రెడీమేడ్ వస్ర్తాల తయారీ, ఆభరణాల ఉత్పత్తి యూనిట్లను, ఖాదీ విక్రయ కేంద్రాల ఏర్పాటు కార్యక్రమాలు 10 వరకు నిర్వహిస్తున్నారు. 

దేశవ్యాప్తంగా 41 ఖాదీ విక్రయ కేంద్రాలు, పిఎంఇజిపి కింద 27 కొత్త తయారీ యూనిట్లు, 14 కొత్త వర్క్ షెడ్లు, ఉమ్మడి సదుపాయాలందించే కేంద్రాలు కూడా ప్రారంభం అవుతున్నాయి. వారణాసిలో 8 కొత్త విక్రయ కేంద్రాలు, 4 కొత్త వర్క్ షెడ్లు కూడా ఇందులో ఉన్నాయి. 10 విభిన్న ప్రాంతాల్లో ఖాదీ పనివారికి కొత్త నమూనా చరఖాలు అందచేస్తున్నారు. ఈ కొత్త సదుపాయాలన్నీ హస్తకళాకారుల ఉత్పాదకతను, ఆదాయాన్ని కూడా పెంచుతాయి. ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం పిఎంజిఇపి కింద కుంహర్ సశక్తీకరణ్ యోజన, తేనె పరిశ్రమల విభాగంలో పలు యూనిట్లను గురువారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమాలు హస్తకళాకారులను స్వయం సమృద్ధం (ఆత్మ నిర్భర్) చేయడం ద్వారా స్థానికంగా స్థిరమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని కెవిఐసి చైర్మన్ ఈ సందర్భంగా అన్నారు. “గ్రామీణ వ్యవస్థ పునరుజ్జీవమే దేశాభివృద్ధికి కీలకమని మహాత్మాగాంధీ తరచు చెబుతూ ఉండే వారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ధ్యేయం కూడా ఇదే. కెవిఐసి చేపట్టే కార్యక్రమాలు రైతులు, మహిళలు, నిరుద్యోగ యువతీ యువతులను సాధికారం చేయడం వీటి లక్ష్యం. హస్తకళాకారులకు జీవనోపాధి అవకాశాలు కల్పించడం, స్థానిక ఉత్పత్తిని పెంచడం, సరికొత్త మార్కెట్లు అందుబాటులోకి తేవడం ద్వారా “ఆత్మనిర్భర్ భారత్” లో ఖాదీ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి” అని సక్సేనా చెప్పారు.

ఈ సందర్భంగా పిఎంఇజిపి కింద విజయం సాధించిన పారిశ్రామికులు కెవిఐసి మద్దతుతో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో నాలుగు సంవత్సరాల క్రితం రూ.16 లక్షల రుణంతో కుట్టుపని కేంద్రం ప్రారంభించిన మహిళా పారిశ్రామికవేత్త తాజాగా అందుతున్న రూ.1 కోటి రుణంతో పూర్తి స్థాయి హోమ్ ఫర్నిషింగ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రం 60 మందికి ఉపాధి కల్పిస్తుంది. అలాగే మధ్యప్రదేశ్ లోని టికంగఢ్ లో పని చేస్తున్న అల్యూమినియం పాత్రల తయారీ కేంద్రం కూడా తాజాగా అందుతున్న రూ.60 లక్షల రుణంతో ఉత్పత్తి సామర్థ్యాలు విస్తరించడం ద్వారా 55 మందికి అదనపు ఉపాధి కల్పిస్తోంది.

జమ్ము-కశ్మీర్ లోని  పాంపోర్ లో కెవిఐసి హస్తకళాకారుల కోసం క్రెవెల్, సోంజీ ఎంబ్రాయిడరీ, శాలువాల నేత శిక్షణ కేంద్రం ప్రారంభమయింది. హిమాచల్ ప్రదేశ్ లో డిస్పోజబుల్ ప్లేట్లు, కొయ్య ఫర్నిచర్ , బోటిక్ కెవిఐసి ప్రారంభించింది. పశ్చిమబెంగాల్ లో కొత్తగా 10 ఖాదీ విక్రయ కేంద్రాలు, 3 కొత్త ఉమ్మడి సదుపాయ కేంద్రాలు కూడా ప్రారంభించారు. 

కేరళలోని పయ్యన్నూర్ లో ఒక డిజైన్ క్లినిక్, ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ ప్రారంభించారు.  కొట్టాయంలో దివ్యాంగులకు చరఖాల పంపిణీ జరిగింది. ఉత్తరప్రదేశ్ కూడా సిమెంట్ బ్లాక్ లు, డిటర్జెంట్ పౌడర్, మహిళేతరులు వినియోగించే బాగ్ ల తయారీ యూనిట్లతో పాటు ఒక ఆటోమొబైల్ వర్క్ షాపు, బ్యూటీ పార్లర్ వంటివి పిఎంఇజిపి కింద ప్రారంభించారు. ఉత్తరాఖండ్ లో ఫర్నిచర్ తయారీ, తేనెటీగల పెంపకం శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. 

ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల విక్రయానికి చేపట్టిన వార్షిక విక్రయ కార్యక్రమం కింద అక్టోబర్ 2వ తేదీ నుంచి కెవిఐసి 20% డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే  http://www.kviconline.gov.in/khadimask ద్వారా జరిగే ఆన్ లైన్ విక్రయాలు కూడా అక్టోబర్ 1, 2 తేదీల అర్ధరాత్రి వరకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.
 

****



(Release ID: 1660930) Visitor Counter : 160