సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

గ‌త ఆరేళ్ల‌లో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వంలో క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల్లో చారిత్రాత్మ‌క పెరుగుద‌ల : డాక్ట‌ర్ జితేంద్ర సింగ్‌

వ్య‌వ‌సాయ‌రంగ చ‌ట్టాల్లో ద‌ళారులను తొల‌గించ‌డాన్ని అభినందించిన డాక్ట‌ర్ జితేంద్ర సింగ్‌

Posted On: 30 SEP 2020 6:50PM by PIB Hyderabad

గత ఆరేళ్ల‌లో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వ పాల‌న ప్రారంభ‌మైన‌ప్ప‌ట‌నుంచీ రైతుల సంక్షేమం కోసం అనేక చారిత్రాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డం జ‌రిగింద‌ని కేంద్ర మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ అన్నారు. అన్న‌దాత‌ల ఆదాయాల‌ను రెట్టింపు చేయ‌డానికిగాను క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌ను స్థిరంగా పెంచ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. స‌ర్పంచులు, బిడిసి అధ్య‌క్షులు, రైతు సంఘాల నేత‌లు, కొండ ప్రాంత జిల్లాలైన డోడా, రీసి, రంబాన్‌, కిస్త‌వ‌ర్ల‌కు చెందిన కార్య‌క‌ర్త‌ల‌తో నూత‌న వ్య‌వ‌సాయ రంగ చ‌ట్టాల‌పై  మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ మాట్లాడ‌రు. వ్య‌వ‌సాయ‌రంగానికి ప్ర‌క‌టించే క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌లు ( ఎంఎస్‌పి), వ్య‌వ‌సాయ‌రంగ మార్కెట్ క‌మిటీలు (ఏపిఎంసీలు) ఎక్క‌డికీ పోవ‌ని వాటిని ఎట్టి ప‌రిస్థితుల్లోను తొల‌గించ‌మ‌ని అన్నారు. వీటిని ప్ర‌భుత్వం తొల‌గిస్తోందంటూ కొన్ని ప్ర‌భుత్వ వ్య‌తిరేక శ‌క్తులు ప్రచారం చేస్తున్నాయి. ఈ దుష్ప్ర‌చారాన్ని అన్ని స్థాయిలో అడ్డుకోవాల్సి వుంద‌ని అన్నారు. 
దేశంలోని వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీలు య‌ధావిథిగా ఖ‌రీఫ్ , ర‌బీ కాలాల పంట‌ల్ని కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని అయితే ఇప్పుడు వ‌చ్చి మార్పల్లా...మ‌న అన్న‌దాత‌లు త‌మ పంట‌ల్ని దేశంలో ఎవ‌రికైనా,ఎప్పుడైనా అమ్ముకోవ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. ప్రైవేటు వ్యాపారుల‌కు సైతం అమ్ముకోవ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. త‌మ రాష్ట్రంలోను ఇత‌ర రాష్ట్రాల్లోను అమ్ముకోవ‌చ్చ‌ని తెలిపారు. ఈ ప‌ని చేస్తే రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎలాంటి ప‌న్నులు వేయ‌వ‌ని అన్నారు. వ్య‌వ‌సాయ వాణిజ్య కంపెనీల‌తో రైతులు ఒప్పందాలు చేసుకోవ‌డంద్వారా త‌మ పంట‌ల్ని మ‌రింత మొత్తంలో స్టాక్ పెట్టుకోవ‌చ్చ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇది చారిత్రాత్మ‌క నిర్ణ‌య‌మ‌ని అన్నారు. 
2020-21కి చెందిన ఖ‌రీఫ్ మార్కెట్ స‌మ‌యం ఇప్పుడే మొద‌లైంద‌ని... ప్ర‌భుత్వం రైతుల ద‌గ్గ‌ర‌నుంచి పంట‌ల్ని సేక‌రించ‌డం ఇప్పుడే మొద‌లుపెట్టింద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌స్తుతం అమ‌ల్లో వున్న మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌తోనే పంట‌ల్ని కొంటామ‌ని, గ‌తంలో ఎలా చేసేవాళ్ల‌మో అలాగే చేస్తామ‌ని ఆయ‌న అన్నారు. రెండు రోజుల క్రిత‌మే జాతీయ స‌హ‌కార అభివృద్ధి సంస్థ ( ఎసిడిసి) తాను కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ‌కు ఇచ్చే నిధుల‌కు సంబంధించిన మొద‌టి వాయిదా రూ. 19, 444 కోట్లు విడుద‌ల చేసింద‌ని ఆయ‌న తెలిపారు. ఈ నిధుల‌ను ఛ‌త్తీస్ గ‌ఢ్‌, హ‌ర్యానా, తెలంగాణా రాష్ట్రాల ఖ‌రీఫ్ వ‌రిధాన్య సేక‌ర‌ణ‌కు ఉప‌యోగిస్తార‌ని ఆయ‌న అన్నారు. 
వ్య‌వ‌సాయ‌రంగంలో ఇంత‌వ‌ర‌కూ మ‌ధ్య ద‌ళారులు లాభం పొందుతూ వ‌చ్చార‌ని వారిని లేకుండా చేయ‌డానికే కేంద్ర ప్ర‌భుత్వం నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల్లో మార్పులు చేసింద‌ని కేంద్ర మంత్రి అన్నారు. రైతుల ఆదాయాన్ని ద‌ళారులు త‌న్నుకుపోయేవార‌ని ఆయ‌న అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 70 ఏళ్లు అయినా స‌రే ఇంత‌కాలం ద‌ళారులు చేతుల్లోనే రైతులు బందీ అయిపోయార‌ని ఇప్పుడు విముక్తి క‌లిగించామ‌ని కేంద్ర మంత్రి స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు రైతులు పంట ఉత్ప‌త్తి దారులే కాదు, వ్యాపారులు కూడా అయ్యార‌ని ఇది నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ద్వారా సాధ్య‌మైంద‌ని ఆయ‌న వివ‌రించారు. నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ప్ర‌కారం వ్యాపారుల‌తో రైతులు చేసుకునే ఒప్పందం పంట‌ల‌కు సంబంధించిందే త‌ప్ప పొలాల‌కు సంబంధించింది కాద‌ని..ఈ విష‌యంలో రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని కేంద్ర మంత్రి అన్నారు.  
ప్ర‌తి కార్య‌క‌ర్త తమ ప‌రిధిలోని రైతుల‌తో మాట్లాడి రైతుల‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న కుట్ర‌ల‌ను వివ‌రించి ప్ర‌భుత్వ విధానాల విశిష్ట‌త‌ను వివ‌రించాల‌ని కేంద్ర మంత్రి కోరారు. ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ చేప‌డుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను రైతులోకం వినియోగించుకోవడానికి వీలుగా కార్య‌క‌ర్త‌లు త‌మ ప్రాంత రైతుల్లో త‌గిన చైత‌న్యం పెంచాల‌ని ఆయ‌‌న అన్నారు. 

<><><><>



(Release ID: 1660563) Visitor Counter : 78