రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

పరిశ్రమల్లో అవకాశాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ

Posted On: 29 SEP 2020 4:30PM by PIB Hyderabad

ఎరువుల శాఖ కింద ఉండే ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్  మధ్యప్రదేశ్ లోని రాఘోగడ్ కి చెందిన పారిశ్రామిక శిక్షణా సంస్థ ఐటిఐ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. యువతలో నైపుణ్యం పెంచి  భారీ పరిశ్రమలలోను, ప్రాసెసింగ్ యూనిట్లలోను ఉద్యోగావకాశాలను అందుకోగలిగేలా ఉద్యోగ సామర్థ్యం పెంచటానికి శిక్షణ ఇవ్వటం ఈ ఒప్పంద లక్ష్యం.

విజయపూర్ లోని ఎన్ ఎఫ్ ఎల్  ఈ మేరకు అక్కడికి దగ్గరలో ఉన్న రాఘోగఢ్ ఐటిఐ తో ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్ లాంటి వృత్తి విభాగాలలో యువతకు శిక్షణ ఇవ్వటానికి ఈ ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా యువతకు రెండు రకాల శిక్షణనిస్తారు. ఆరు నెలలపాటు ఐటిఐ లో థియరీ నేర్చుకోవటంతో బాటు ఎన్ ఎఫ్ ఎల్ విజయ్ పూర్ యూనిట్ లో ప్రాక్టికల్ శిక్షణ పొందుతారు.

మొత్తంగా శిక్షణ మొత్తం ఐటిఐ సిలబస్ ప్రకారం సాగుతుంది. అయితే అందులో  భాగంగా ఆరు నెలలపాటు పరిశ్రమలో పనిచేసిన అనుభవం పొందుతారు. ఎన్ ఎఫ్ ఎల్ యూనిట్ ఈ అవకాశం కల్పిస్తుంది.

ఎన్ ఎఫ్ ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ జగదీప్ షా సింగ్ సమక్షంలో ఎన్ ఎఫ్ ఎల్ విజయ్ పూర్ యూనిట్ చీఫ్ మేనేజర్ (హెచ్ ఆర్)  శ్రీ నరేందర్ సింగ్, రాఘోగడ్ ఐఐటి ప్రిన్సిపాల్ శ్రీ జెపి కోలి ఈ ఒప్పందం సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. స్కిల్ ఇండియాకు ఊతమిచ్చేందుకు చుట్టుప్రక్కల ఉన్న మరిన్ని సంస్థలకు చెందిన యువతతో ఇలాంటి మరికొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాలని కంపెనీ భావిస్తోంది.

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కు అమ్మోనియా ఆధారిత యూరియా తయారీ యూనిట్లు ఐదు ఉన్నాయి. వాటిలో పంజాబ్ లో నంగల్, బఠిండా లలోను, హర్యానాలో పానిపట్ లోను, మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లా విజయ్ పూర్ లో రెండు ప్లాంట్లు ఉన్నాయి.

*****



(Release ID: 1660155) Visitor Counter : 154