విద్యుత్తు మంత్రిత్వ శాఖ

బొగ్గు విద్యుత్‌ కేంద్రాల్లో సహ-అగ్నిగా వినియోగించే బయోమాస్ పెల్లెట్ల సేకరణకు బిడ్లను ఆహ్వానించిన ఎన్‌టీపీసీ

పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా ఏర్పడే వాయు కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యం

బయోమాస్‌ ప్రాసెసింగ్‌, సరఫరా గొలుసు ద్వారా భారీ స్థాయిలో గ్రామీణ ఉపాధిని సృష్టించే అవకాశం

Posted On: 27 SEP 2020 3:01PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ ప్లాంట్లలో వినియోగించడానికి బయోమాస్‌ పెల్లెట్ల సేకరణ కోసం ఎన్‌టీపీసీ బిడ్లను ఆహ్వానించింది. గాలి కాలుష్యానికి కారణమవుతున్న పంట వ్యర్థాల దహనాన్ని తగ్గించడం ఈ సేకరణ ఉద్దేశం. దేశీయ పోటీ పద్ధతి (డీసీబీ) ఆధారంగా బిడ్లను ఆహ్వానించింది. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా, సీపత్, పశ్చిమబెంగాల్‌లోని ఫరక్కా, ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి, రిహాంద్‌, కర్ణాటకలోని కుడ్గి ప్లాంట్లలో ఈ ఏడాది ఐదు మిలియన్‌ టన్నుల పెట్లెట్లను వినియోగించాలని భావిస్తోంది. 

    ఎన్‌టీపీసీ ప్రకటన ప్రకారం, కొంత బొగ్గు బదులుగా పెల్లెట్‌ ఆధారిత ఇంధనాన్ని వినియోగించడాన్ని నమూనా ప్రాజెక్టుగా 2017లో దాద్రి ప్లాంట్‌లో ప్రారంభించారు. అది విజయవంతమైనందున, సంస్థకు చెందిన మొత్తం 17 ప్లాంట్లలో అమలుకు నిర్ణయించారు. ఎస్‌ఆర్‌ఎం పోర్టల్‌లో ఇ-టెండరింగ్ ద్వారా బిడ్ల ఆహ్వానం ఉంటుంది. 'ఏక దశ', 'రెండు ఎన్వలప్‌ల బిడ్డింగ్‌ విధానం'లో ప్రక్రియ సాగుతుంది.

    ఈ సహ-అగ్ని విధానం వల్ల; బయోమాస్‌ ప్రాసెసింగ్‌, సరఫరా గొలుసు ద్వారా భారీ స్థాయిలో గ్రామీణ ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ఎన్‌టీపీసీ విశ్వాసంతో ఉంది. పంజాబ్‌, హర్యానా పంపిణీదారుల బిడ్లకు ప్రాధాన్యం ఉంటుంది. దాద్రి ప్లాంట్‌లో 2017లో 100 టన్నుల వ్యవసాయ వ్యర్థాలను ఎన్‌టీపీసీ వినియోగించింది. బొగ్గుతోపాటు, తొలుత 2.5 శాతం వ్యర్థాలను మండించింది. నాలుగు దశల్లో క్రమంగా 10 శాతం వరకు దానిని పెంచి పరీక్షించింది. ఇప్పటివరకు 7 వేల టన్నుల పంట వ్యర్థాల పెల్లెట్లను ఎన్‌టీపీసీ వినియోగించింది.

    దేశంలో దాదాపు 145 ఎంఎంటీపీఏల పంట వ్యర్థాలు నిరుపయోగంగా మారుతున్నాయని అంచనా. దీనిలో ఎక్కువ శాతాన్ని పొలాల్లోనే రైతులు కాల్చేస్తున్నారు. ఇది భారీ వాయుకాలుష్యం, తీవ్రమైన అనారోగ్యాలకు కారణమవుతోంది. ఉత్తర భారతదేశంలో పంట కోతల తర్వాత వ్యర్థాలను పొలాల్లోనే కాల్చడం, వాయు కాలుష్యం పెరుగుదలలో ప్రధాన పాత్రను పోషిస్తోంది.

    పెల్లెట్ల ద్వారా జ్వలించే ఉష్ణం విలువను బొగ్గుతో పోలిస్తే, బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో సహ-అగ్ని రూపంలో 145 ఎంఎంటీపీఏల బయోమాస్‌ను ఉపయోగించడం ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ సామర్థ్యం, 24 గంటల్లో సాధించే 28,000-30,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌కు సమానం. ఇది, 125,000-150,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ సామర్థ్యం నుంచి ఉత్పత్తి చేయగల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

    ఎన్‌టీపీసీ వ్యవస్థాగత సామర్థ్యం 62.9 గిగావాట్లు. ఈ గ్రూపులో 24 బొగ్గు, 7 కంబైన్డ్‌ గ్యాస్‌/లిక్విడ్‌, ఒక జల విద్యుత్‌ కేంద్రం, 13 పునరుత్పాదక, 25 అనుబంధ, 7 జేవీ విద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయి. 5 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు సహా, 20 గిగావాట్లకు పైగా సామర్థ్యమున్న ప్లాంట్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి.

***
 


(Release ID: 1659588) Visitor Counter : 157