ప్రధాన మంత్రి కార్యాలయం

ఫిట్ ఇండియా ఉద్యమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ‘ఫిట్ ఇండియా డైలాగ్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

Posted On: 24 SEP 2020 3:23PM by PIB Hyderabad

దేశానికి స్ఫూర్తి కలిగించిన ఏడుగురు మహానుభావులకు ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరంతా మీ అనుభవాలను ఫిట్ నెస్ కు సంబంధించిన విభిన్న అంశాలపై మీ అనుభవాలను పంచుకున్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తి కలిగిస్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. నేటి ఈ చర్చ కార్యక్రమం అన్ని రకాల వయసుల వారితోపాటు విభిన్నమైన అంశాలపై ఆసక్తి ఉన్నవారికి కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఫిట్ ఇండియా ఉద్యమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఒక ఏడాదిలోనే ఫిట్ నెస్ ఉద్యమం.. ప్రజా ఉద్యమంగా మారింది. సానుకూలతను పెంపొందించే ఉద్యమంగా కూడా రూపుదిద్దుకుంది. దేశంలో ఆరోగ్యం, శారీరక వ్యాయామం విషయంలో నిరంతర చైతన్యం, క్రియాశీలత కూడా పెరుగుతోంది. యోగ, ఆసనాలు, వ్యాయామాలు, నడక, పరుగు, ఈత వంటి మంచి అలవాట్లు, ఆరోగ్యకర జీవనశైలి ఇవన్నీ మన సహజ చేతనావస్థలో భాగంగా మారిపోవడం చాలా సంతోషంగా ఉంది.

మిత్రులారా,
ఫిట్ ఇండియా ఉద్యమానికి చూస్తూ చూస్తూ ఏడాది పూర్తయింది. ఇందులో ఆర్నెల్లపాటు వివిధ ఆంక్షలమధ్యే కాలం గడపాల్సి వచ్చింది. కానీ ఈ ఉద్యమం కరోనా కాలంలో తన ప్రభావాన్ని, ఆవశ్యకతను స్పష్టంగా కనబరిచింది. ఫిట్ గా ఉండటం కొందరు భావించినంత కష్టమైన పనేం కాదు. కొన్ని నియమాలను పాటిస్తూ.. కాస్త శ్రమపడితే.. ఆరోగ్యకరంగా ఉండొచ్చు.  ‘ఫిట్ నెస్ కా డోజ్, ఆధా ఘంటా రోజ్’ ఈ నినాదంలోనే ప్రతి ఒక్కరి ఆరోగ్యం, సుఖసంతోషాలున్నాయి. ఆ తర్వాత 30 నిమిషాలపాటు యోగా చేసినా, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్‌బాల్, కబడ్డీ వంటి మీకిష్టమైన ఆటలు ఆడినా చాలా మంచిది. యువజన సేవల మంత్రిత్వశాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కలిసి ఫిట్‌నెస్ ప్రొటోకాల్ జారీ చేయడాన్ని ఇప్పుడే చూశాం.

మిత్రులారా,
ఇవాళ ప్రపంచమంతా ఫిట్ నెస్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ – డబ్ల్యూహెచ్‌వో.. ఆహారం, శారీరక శ్రమ, ఆరోగ్యం ప్రపంచ వ్యూహాన్ని రూపొందించింది. శారీరక శ్రమపై అంతర్జాతీయ ప్రతిపాదనలు కూడా జారీచేసింది. నేడు ప్రపంచంలోని చాలా దేశాలు ఫిట్ నెస్ విషయంలో కొత్త లక్ష్యాలను వివిధ కార్యక్రమాలను రూపొందించుకు మరీ ముందుకెళ్తున్నాయి. ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, అమెరికా, వంటి చాలా దేశాలు విస్తృత స్థాయిలో ఫిట్ నెస్ కార్యక్రమాలు చేపట్టాయి. తమ పౌరులు ఫిజికల్ ఎక్సర్ సైజులు చేయడంతోపాటు దీన్ని తమ జీవనంలో భాగం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాయి.

మిత్రులారా, మన ఆయువిజ్ఞాన శాస్త్రాల్లో

సర్వప్రాణి భుతామ్ నిత్యమ్
ఆయు: యుక్తిమ్ అపేక్షతే
దేవై పురుషా కారే చ
స్థితం హి అస్య బలాబలం

అని పేర్కొన్నారు. 
అనగా, ప్రపంచంలో శ్రమ, విజయం, భాగ్యం వంటివన్నీ ఆరోగ్యం పైనే ఆధారపడి ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. అప్పుడే విజయం చేకూరుతుంది. మనం ఎప్పుడైనే క్రమపద్ధతిలో వ్యాయామం చేస్తామో.. వారు ఫిట్ గా ఉండటంతో పాటు బలంగా ఉంటారని అర్థం. మన జీవితానికి, శరీరానికి మనమే నిర్మాతలమే భావన వ్యక్తమవుతుంది. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ఆత్మవిశ్వాసమే మనిషిని జీవితంలో వివిధ రంగాల్లో ముందుకు తీసుకెళ్తుంది, విజయాన్ని అందిస్తుంది. ఇది ఆ వ్యక్తి కుటుంబంపై, సమాజంపై దేశంపైనా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

కలిసి ఆడుకునే కుటుంబం.. ఎప్పటికీ కలిసే ఉంటుందన్న సూత్రాన్ని కరోనా సమయంలో చాలా కుటుంబాలు కార్యాచరణలో చూపించాయి. కుటుంబ సభ్యులంతా కలిసి ఆడుకున్నారు.  కలిసి యోగా, ప్రాణాయామం, వ్యాయామం చేశారు. కలిసి చెమటోడ్చారు. తద్వారా శారీరక ఫిట్ నెస్ పెరిగి ఉపయోగం జరిగింది. దీంతోపాటు ఓ భావోద్వేగ బంధం, సరిగ్గా అర్థం చేసుకునే తత్వం, పరస్పర సహకారం వంటివి అనేక కుటుంబాల్లో సరికొత్త శక్తిని నింపాయి. సహజత్వం ప్రకటితమైంది. మన తల్లిదండ్రుల వద్ద నేర్చుకున్న మంచి అలవాట్లన్నీ ఒక్కోసారి బయటపడతాయి. కానీ ఫిట్ నెస్ విషయంలో పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. యువకులు చొరవతీసుకుంటే.. ఇంట్లోని పెద్దలు కూడా వ్యాయామం చేసేందుకు, ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

మిత్రులారా, ‘మన్ చంగాతో కఠౌతీ మే గంగా’ అని అంటారు. ఈ నినాదం ఆధ్యాత్మిక, సామాజిక జీవనంలో చాలా విలువైనది. దీనికన్నా లోతైన అర్థం కూడా మన దైనందిన జీవితానికి అత్యంత ఆవశ్యకం. మన మానసిక ఆరోగ్యం కూడా చాలా కీలకం అనేది దీనర్థం. దృఢమైన శరీరంలోనే చక్కగా ఆలోచించగలిగే శక్తి ఉంటుందన్నది దీని భావం. మన మనస్సు నిర్మలంగా ఉంటే.. ఆరోగ్యం, శరీరం కూడా బాగుంటుంది. ఇంతకుముందు చర్చలో.. మానసిక ఆరోగ్యం కోసం ఒకటే విధానం అవసరం. అదే మన ఆలోచనలకు మరింత విస్తరించడం. నేను అనే సంకుచిత భావం నుంచి మేము, కుటుంబం, సమాజం దేశం అనేలా మన ఆలోచనల విస్తృతి పెరగాలి. ఇలా ఆలోచించి పనిచేసేవారిలో ఆత్మవిశ్వాసంతోపాటు మానసిక దృఢత్వం అద్భుతంగా పెరుగుతుంది. అందుకే స్వామి వివేకానందుడు ‘బలమే జీవనం, బలహీనతే మరణం. విస్తరణమే జీవనం, సంకుచితత్వమే మరణం’ అని మనకు బోధించారు.

ఇటీవల ప్రజలతో, సమాజంతో , దేశంతో కలిసిపోవడం, తోటివారిని కలిపే పద్ధతులకు కొదువలేదు. ఇందుకు విస్తృతమైన అవకాశాలు కూడా ఉన్నాయి. స్ఫూర్తి పొందేందుకు మన చుట్టుపక్కలే ఎన్నో ఉదాహరణలు కనబడతాయి. ఇవాళ ఏడుగురు మహానుభావులు చెప్పింది విన్నాను. ఇంతకన్నా గొప్ప ప్రేరణ ఇంకేముంటుంది. చేయాల్సిందల్లా ఒక్కటే.. మీమీ ఆశలు, ఆకాంక్షలు, అభిరుచులకు అనుగుణంగా చేయాల్సిన కార్యక్రమాలను ఎంపికచేసుకోవాలి. ఈ సందర్భంగా దేశ ప్రజలకు, అన్ని వయసుల వారికి చేసే విజ్ఞప్తి ఒక్కటే. ఒకరు మరొకరికి ఎలా సహాయం చేసుకుంటారు, మీ సమయాన్ని, మీకున్న జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, శారీరక సహాయాన్ని ఎలా పంచుకుంటారో మీ ఇష్టం. కానీ పరస్పర సహకారంతో ముందుకెళ్లండి.

మిత్రులారా, ఈ ఫిట్ ఇండియా ఉద్యమంతో ప్రజలు మరింత ఎక్కువ సంఖ్యలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నరు. వీలైనంత ఎక్కువమందిని ఈ ఉద్యమంలో భాగస్వాములను చేసేందుకు మనమంతా ప్రయత్నిద్దాం. ఫిట్ ఇండియా ఉద్యమం ఓ రకంగా హిట్ ఇండియా ఉద్యమం కూడా. అందుకే వీలైనంత ఎక్కువ ఫిట్ గా ఉంటు మన దేశం అంత హిట్ అవుతుంది. ఈ దిశగా మీరు చేసే ప్రయత్నం దేశానికి ఎంతో గొప్ప సహాయంగా మారుతుంది.

ఈ సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఫిట్ ఇండియా ఉద్యమానికి కొత్త శక్తిని అందించేందుకు సరికొత్త సంకల్పంతో.. ముందుకువెళ్దాం. ఈ భావనతో మీ అందరికీ మరోసారి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.

***


(Release ID: 1658881) Visitor Counter : 235