ప్రధాన మంత్రి కార్యాలయం

ఐఐటీ గౌహతి స్నాతకోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

Posted On: 22 SEP 2020 3:01PM by PIB Hyderabad

నమస్కారం,

ఈ కార్యక్రమంలో మనతోపాటు హాజరైన కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ నిశంక్ జీ, అస్సాం ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ జీ, కేంద్ర కేబినెట్ సహచరుడు, విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే జీ, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ మోదీజీ, మెంబర్స్ ఆఫ్ సెనేట్, ఈ స్నాతకోత్సవానికి ఆహ్వానితులు, ఫ్యాకల్టీ సభ్యులు, ఉద్యోగులు, నా ప్రియ విద్యార్థులారా,
ఐఐటీ గౌహతి 22వ స్నాతకోత్సవంలో మీ అందరికీ కలిసి పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా ప్రతి విద్యార్థి జీవితంలో స్నాతకోత్సవం ప్రత్యేకమైనదనడంలో సందేహం లేదు. కానీ ఈసారి స్నాతకోత్సవం మరీ ప్రత్యేకమైనది. కరోనా నేపథ్యంలో స్నాతకోత్సవ ప్రదానం పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. పరిస్థితులు అనుకున్నట్లుగా ఉంటే నేను మీతో నేరుగా మాట్లాడేవాడిని. అయినప్పటికీ ఈ కార్యక్రమం చాలా మహత్వమైనది, విలువైనది. ఈ సందర్భంగా మీ అందరికీ, నా యువ మిత్రులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ ఉజ్వల భవిష్యత్ కార్యాచరణకోసం మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా, మన పురాణాల్లో ‘జ్ఞానం విజ్ఞాన సహితం, యత్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్’ అని చెప్పబడింది. అంటే.. విజ్ఞానం, జ్ఞానానం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం, దుఖం నుంచి ముక్తి లభిస్తుందని దాని అర్థం. ఇదే భావన మరింత సేవనందిచేందుకు సరికొత్త శక్తినిస్తుంది. ఈ శ్లోకమే వేల ఏళ్లుగా మన దేశ జీవనయాత్రను బతికిస్తోంది, గొప్పగా నిలబెడుతోంది. ఈ భావన ఆధారంగానే మన ఐఐటీ వంటి సంస్థలు ముందుకెళ్తున్నాయి. ఐఐటీ గౌహతిలో మీ ప్రయాణం మొదలైనప్పటినుంచి పోలిస్తే కోర్సు పూర్తయిన తర్వాత మీలో ఎంతటి మార్పు వచ్చిందో, మీ ఆలోచనాశైలి ఎలా విస్తరించిందో మీకు అవగతం అయ్యేఉంటుంది. మీలోని నూతన వ్యక్తిత్వాన్ని మీరే గమనించి ఉంటారు. ఇది ఈ సంస్థకు, మీ ప్రొఫెసర్లకు మీరిచ్చే విలువైన కానుక.
మిత్రులారా, దేశ యువత నేడు ఎలా ఆలోచిస్తుందనేదే ఆ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని.. మీ కలలు దేశ వాస్తవికతను నిర్ధారిస్తాయని నేను బలంగా విశ్వసిస్తున్నాను. అందుకే ఈ సమయం భవిష్యత్తుకు మిమ్మల్ని సిద్ధం చేసే సమయంగా భావించాలి. ఎలాగైతే మన సమాజంలో, ఆర్థిక వ్యవస్థలో మార్పులు వస్తున్నాయో.. ఆధునీకరణ జరుగుతోందో.. దానికి అనుగుణంగానే భారత శాస్త్ర,సాంకేతిక రంగంలోనూ అవసరమైన మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఐఐటీ గౌహతి ఈ దిశగా తన ప్రయత్నాన్ని ముందుగానే ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగాఉంది. ఐఐటీ గౌహతిలో ఈ-మొబిలిటీ ద్వారా రెండేళ్లపాటు పరిశోధనాత్మక కార్యక్రమాలను ప్రవేశపెట్టారని తెలిసి హర్షం వ్యక్తం చేస్తున్నాను. దీంతోపాటుగా బీటెక్ స్థాయిలోని అన్ని కార్యక్రమాల్లో సైన్స్, ఇంజనీరింగ్ విషయాలను సమన్వయ పరుస్తూ కోర్సులు జరగడం ప్రశంసనీయం. ఈ ఇంటర్-డిసిప్లినరీ కార్యక్రమాలు మన దేశ విద్యావ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మార్చగలవని నేను విశ్వసిస్తున్నాను. ఎప్పుడైతే ఇలాంటి భవిష్యత్ దర్శిత విధానం ఆధారంగా విద్యాసంస్థలు ముందుకెళ్తాయో.. దాని ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి.
ఐఐటీ గౌహతి ద్వారా కరోనా సమయంలో కరోనా సంబంధిత కిట్లు (వైరల్ ట్రాన్స్‌ పోర్ట్ మీడియా, వైరల్ ఆర్ఎన్ఏ ఎక్స్‌ట్రాక్షన్ కిట్, ఆర్టీ-పీసీఆర్ కిట్లు మొదలైన) వాటిని రూపొందించడం ద్వారా మరోసారి సమాజహితంలో తన బాధ్యతను చాటుకుంది. కరోనా సమయంలో విద్యాపాఠ్యప్రణాళికను కొనసాగిస్తూనే.. ఇలాంటి పరిశోధనాత్మక కార్యక్రమాలు చేపట్టడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. కానీ ఐఐటీ గౌహతి ఈ దిశగా విజయం సాధించింది. మీరు చేసిన ఈ ప్రయత్నం దేశాన్ని ఆత్మనిర్భరంగా మార్చేదిశగా ముందుకు తీసుకెళ్తుంది. మీ ఈ ప్రయత్నానికి నా అభినందనలు.
మిత్రులారా, ఆత్మనిర్భర భారత నిర్మాణంలో మన విద్యావ్యవస్థ పాత్ర అత్యంత కీలకం. ఈ విషయం మీకు కూడా బాగా తెలుసు. ఈ మధ్య మన నూతన విద్యావిధానం గురించి మీరు చదివే ఉంటారు. చర్చించి ఉంటారు కూడా. 21వశతాబ్దంలో ప్రపంచాన్ని ముందుకు నడిపించేలా, శాస్త్ర, సాంకేతిక రంగంలో భారత్‌ను ప్రపంచశక్తిగా మార్చేలా.. మన యువతను సన్నద్ధం చేసే దిశగా ఈ విధానం రూపొదించబడింది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన చక్కటి అంశాలన్నీ ఈ విద్యావిధానంలో పొందుపరచబడి ఉన్నాయి.

మిత్రులారా, మన విద్యావ్యవస్థలో విద్య, పరీక్షలు విద్యార్థికి భారం కాకూడదని నేను భావిస్తాను. విద్యార్థులు తమకు నచ్చిన విషయాలను చదువుకునే స్వాతంత్ర్యం ఉండాలి. అందుకే నూతన జాతీయ విద్యావిధానంలో వివిధ విషయాలను క్రోఢీకరించాం. విద్యార్థులు తమకు నచ్చిన విషయాలను ఎంచుకోవడంతోపాటు.. వీలైనన్ని వేర్వేరు విషయాలను నేర్చుకునేందుకు వీలు కల్పించాం. అన్నింటికంటే ముఖ్యంగా సాంకేతికతను విద్యలో భాగంగా మార్చడం ద్వారా వారి ఆలోచనల్లో సాంకేతికతను ఓ అంతర్భాగంగా మార్చేయడమే ఈ విధానం ఉద్దేశం. విద్యార్థులు సాంకేతికతను, సాంకేతికత ద్వారానే చదువుకుంటారు. విద్యలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగం ఉంటుంది, ఆన్ లైన్ శిక్షణ పెరుగుతుంది.

టీచింగ్, లర్నింగ్ నుంచి అడ్మినిస్ట్రేషన్, అసెస్ మెంట్ వరకు ప్రతీది సాంకేతికత ఆధారంగానే జరుగుతుంది. ఇందుకు అనుగుణంగానే నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరమ్ కూడా ఏర్పాటుచేయబోతున్నాం. మన విద్యార్థులు సాంకేతికతను నేర్చుకోవడంతోపాటు నేర్పేందుకు అవసరమైన ఈ సాంకేతికతను సృష్టిస్తారు. ఐఐటీ మిత్రులకు ఈ దిశగా విస్తృతమైన అవకాశాలున్నాయి. కొత్త సాఫ్ట్ వేర్, కొత్త పరికరాలు, కొత్త గాడ్జెట్లు వంటివి విద్యావిధానాన్ని మరింత విప్లవాత్మకంగా మారుస్తాయి. దీని గురించి మీరే ఆలోచన చేయాలి. మీ అందరికీ ఇదో గొప్ప అవకాశం. మీలోని ఉత్తమమైన శక్తిని బయటకు తీసుకురండి.. దేశం కోసం సమాజం కోసం ఆ శక్తిని సద్వినియోగపరచండి.

మిత్రులారా, దేశంలో పరిశోధన సంస్కృతిని మరింత పెంచే దిశగా జాతీయ విద్యావిధానంలో ఓ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎన్ఆర్ఎఫ్) ప్రస్తావన కూడా చేయడం జరిగింది. ఈ సంస్థ అన్ని ఫండింగ్ ఏజెన్సీలతో సమన్వయ పరుస్తూ.. సైన్స్, హ్యుమానిటీస్ ఇలా ఏ రంగమైనా.. నిధులను సమకూరుస్తుంది. సమర్థవంతమైన, ప్రయోగాత్మక అమలుకు ఆస్కారమున్న సృజనాత్మకమైన పరిశోధనలను గుర్తించి వాటిని అమలుపరచడం దీని ఉద్దేశం. ఇందుకోసం ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం చేయబడుతుంది. నేటి ఈ కార్యక్రమంలో 300 మంది యువ మిత్రులకు పీహెచ్‌డీ సర్టిఫికెట్ల ప్రదానం జరుగుతుందని తెలిసి చాలా సంతోషపడుతున్నాను. ఇది సానుకూల వాతావరణానికి నాంది. మీరంతా ఇక్కడే ఆగిపోకుండా పరిశోధనలను అలవాటుగా మార్చకుని, మీ సానుకూలమైన ఆలోచనలతో ముందుకెళ్తారని ఆశిస్తున్నాను.

మిత్రులారా, జ్ఞానానికి సరిహద్దులుండవనే విషయం మనందరికీ తెలుసు. అందుకే నూతన జాతీయ విద్యావిధానం దేశ విద్యారంగాన్ని మరింత విస్తృతం చేయాలని భావిస్తోంది. విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లు కూడా మన దేశంలో ప్రారంభిస్తారు. మన విద్యార్థులకు ఇక్కడినుంచే ప్రపంచస్థాయి విద్య అందుతుంది. ప్రపంచస్థాయిలో గుర్తింపు కూడా లభిస్తుంది. ఇదే విధంగా భారత, విదేశీ విద్యాసంస్థల మధ్య పరిశోధన సహకారం మరింత మెరుగుపడుతుంది. విద్యార్థుల పరస్పర మార్పిడికి ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంస్థల్లో మన విద్యార్థులు సాధించే క్రెడిట్ స్కోర్ ను మన విద్యాసంస్థల్లోనూ పరిగణించవచ్చు. ఇంతే కాదు జాతీయ విద్యావిధానంద్వారా భారతదేశాన్ని అంతర్జాతీయ విద్యాప్రమాణాల స్థాయికి తీసుకెళ్లేందుకు వీలవుతుంది. మన ఉన్నతవిద్యాసంస్థల శాఖలను విదేశాల్లోనూ ఏర్పాటుచేసే అవకాశం ఉంటుంది. ఐఐటీ గౌహతీని సరిహద్దులుదాటి విస్తరించేందుకు మీరంతా కృషిచేయాలి. ఈశాన్యరాష్ట్రమైన గౌహతి.. భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీకి కేంద్రమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ప్రాంతం, ఆగ్నేయాసియా దేశాలను భారతదేశంతో అనుసంధానం చేయడానికి గేట్ వే గా ఉంది. ఆయా దేశాలతో సాంస్కృతిక, వాణిజ్య, సామర్థ్య అనుసంధానత కూడా ఉంది. ఈ నేపథ్యంలో విద్య కూడా ఈ అనుసంధానతకు మరో మాధ్యమంగా మారనుంది. ఐఐటీ గౌహతి ఇందుకు ప్రధాన కేంద్రం కానుంది. దీని ద్వారా ఈశాన్య భారతానికి ఓ గుర్తింపు కూడా లభించడంతోపాటు సరికొత్త అవకాశాల సృష్టి కూడా జరుగుతుంది. నేడు ఈశాన్య భారతాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా రైల్వేలు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, జల రవాణా వ్యవస్థకు సంబంధించిన మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. దీని ద్వారా ఈశాన్య రాష్ట్రాలన్నింటికీ సరికొత్త అవకాశాల సృష్టి జరుగుతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఐఐటీ గౌహతి.. భూమిక కీలకం.
మిత్రులారా, నేటి ఈ స్నాతకోత్సవం తర్వాతా కొందరు ఇక్కడే ఉంటారు, మరికొందరు వెళ్లిపోతారు. ఐఐటీ గౌహతిలోని మిగిలిన విద్యార్థులకు కూడా ఈ సందర్భంగా నా మాట వింటున్నారు. ఈ ప్రత్యేక దినం సందర్భంగా మీ అందరినీ కోరేది.. మీకు సూచించేది ఒక్కటే. మిత్రులారా, మీ జీవితాల్లో ఈ ప్రాంతం పోషించిన పాత్ర ప్రాముఖ్యత మీకు తెలుసు. మీకు ఈ ప్రాంతం గురించి తెలుసు. ఈ ప్రాంతానికి ఉన్న సవాళ్లను, వాటిని పరిష్కరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై మీ పరిశోధనలు ఎలా సరిపోతాయనే దానిపైనా మీరు ఆలోచించాలి. ఉదాహరణకు, సౌరశక్తి, వాయుశక్తి, బయోమాస్, జలవిద్యుత్ శక్తి అభివృద్ధి విషయంలోనూ చాలా అవసరాలున్నాయి. వరి, టీపొడి, వెదురు (బాంబూ) సంపద అధికంగా ఉంది. పర్యాటక రంగానికి కూడా మన పరిశోధనలు మరింత మెరగుపరచుకునేందుకు దోహదం చేయవచ్చా అని ఆలోచించండి.

మిత్రులారా, ఇక్కడి జీవవైవిధ్యం, సాంప్రదాయిక జ్ఞాన సంపద విస్తృతంగా ఉంది. ఇక్కడి సాంప్రదాయ కళలు, నైపుణ్యాలు, జ్ఞానంతోపాటు శాస్త్ర, సాంకేతికత కూడా తరతరాలుగా కొనసాగుతోంది. ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞాన ప్రసారం జరిగింది. దీన్ని మనం ఆధునిక సాంకేతికతతో జోడించేందుకు వీలుంటుందా? సంప్రదాయ జ్ఞానం, ఆధునిక సాంకేతికతల కలబోతతో మరింత సృజనాత్మకత సృష్టికి బీజం వేయగలమా? ఆధునిక, సాంకేతిక విధానం ద్వారా సంప్రదాయ నైపుణ్యాలు, జ్ఞానాన్ని, విశ్వాసాలను ఆధారంగా చేసుకుని ఘనమైన, ప్రత్యేకమైన కార్యక్రమాల రూపకల్పన చేయవచ్చని నేను విశ్వసిస్తాను. ఈ విషయంలో ఐఐటీ గౌహతి కీలకపాత్ర పోషించడంతోపాటు భారతీయ సంప్రదాయ జ్ఞానవ్యవస్థకు కేంద్రంగా విరాజిల్లాలని ఆశిస్తున్నాను. దీని ద్వారా ఈశాన్య భారతాన్ని, యావత్ ప్రపంచాన్ని సరికొత్త విలువైన విజ్ఞానాన్ని అందించవచ్చు.

మిత్రులారా, అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాల ప్రాంతాల్లో విస్తృతమైన అవకాశాలున్నాయి. అయితే వీటితోపాటు ఈ ప్రాంతంలో వరదలు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం, పారిశ్రామిక ప్రమాదాలు వంటి సమస్యలు కూడా చుట్టుముట్టి ఉన్నాయి. వీటి నుంచి బయటపడేందుకే ఈ రాష్ట్రాల శక్తి అంతా ఖర్చయిపోతోంది. ఈ సమస్యలనుంచి ఈశాన్య భారతం బయటపడేందుకు ఉన్నతస్థాయి సాంకేతికత మద్దతు చాలా అవసరం. ఈ సందర్భంగా.. ఈ ప్రాంతంలో ప్రకృతి విపత్తుల నిర్వహణ కేంద్రంతోపాటు పరిస్థితులను ఎదుర్కునే, ప్రజలను చైతన్యపరిచే కేంద్రం ఏర్పాటులో ఐఐటీ గౌహతి కృషిచేయాలని సూచిస్తున్నాను. తద్వారా సమస్యలనుంచి బయటపడేందుకు అవసరమైన నైపుణ్యత వస్తుంది. సమస్యలను అవకాశాలుగా మార్చుకునేందుకు వీలవుతుంది. ఐఐటీ గౌహతి విద్యార్థులు ఈ సత్సంకల్పంతో ముందుకెళ్తారని.. ఈ దిశగా ఆలోచన చేస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. మిత్రులారా, స్థానిక సమస్యలపై దృష్టిపెట్టడంతోపాటు విస్తృతమైన అంతర్జాతీయ సాంకేతిక ముఖచిత్రాన్న కూడా నిర్మించడంపై దృష్టిపెట్టాల్సి ఉంది. ఉదాహరణకు.. దేశంలోని ఏయే అంశాల్లో ఏయే సమస్యలున్నాయి? వాటిలో వేటివేటిపై మనం దృష్టిపెట్టాల్సిన అవసరముంది. వాటిలో ప్రాధాన్యత ఉన్న అంశాలేవి అనే దానిపై మన సాంకేతికత, పరిశోధలు జరగాలని సూచిస్తున్నాను.

మిత్రులారా, మీరు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా.. ఐఐటియన్ అని మీరు గర్వంగా చెప్పుకోవాలి. అయితే.. మీరు సాధించే విజయాలు, పరిశోధనల్లో మీ పాత్రను చూసి ఐఐటీ గౌహతి.. ఆ వ్యక్తి మా విద్యార్థి అని గర్వంగా చెప్పుకునే పరిస్థితులు కల్పించేలా కృషిచేయాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఐఐటీ గౌహతికి, మీ ప్రొఫెసర్లకు గురుదక్షిణ సమర్పిస్తారనే అనుకుంటున్నాను. మీరు ఇలాగే విజయపథంలో నడవాలని, ఆత్మనిర్భర భారత నిర్మాణంలో కీలక భాగస్వాములు కావాలని, మీ జీవితాల్లో మరింత ఉన్నతస్థితికి చేరుకోవాలని 130కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు. మీరు కంటున్న కలలన్నీ నిజం కావాలని, చిత్తశుద్ధి, క్రమశిక్షణ, అంకితభావంతో మీ కలల సాకారానికి అవసరమైన కృషి జరగాలని నేను కోరుకుంటున్నాను. మీతోపాటు మీ కుటుంబాల సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తున్నాను. కరోనా నేపథ్యంలో మీతోపాటు మీ కుటుంబసభ్యులు, ఇరుగు, పొరుగువారి గురించికూడా ఆలోచించండి. వారి శ్రేయస్సు కోసం మీ వంతు కృషిచేయండి.
మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదములు.

****


(Release ID: 1658012) Visitor Counter : 243