ఉప రాష్ట్రపతి సచివాలయం
ఉపరాష్ట్రపతి చొరవతో నెల్లూరు జిల్లాలో వరి ధాన్యం సేకరణ గడువు మరో నెల రోజులు పెంపు
• రైతుల విజ్ఞప్తితో సంబంధిత కేంద్ర శాఖల కార్యదర్శులతో మాట్లాడిన గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
• ఈ రోజు ఉత్తర్వులు జారీచేసిన కేంద్రం
Posted On:
18 SEP 2020 6:45PM by PIB Hyderabad
నెల్లూరు జిల్లాలో ధాన్యం సేకరణ గడువును మరో నెలరోజులు పొడగిస్తూ.. అదే విధంగా నెల్లూరు కోటాను 34.8 లక్షల మెట్రిక్ టన్నులు పెంచేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ అంగీకరించింది. దీంతోపాటు నెల్లూరు జిల్లాలో తడిసిన ధాన్యాన్ని తూర్పు గోదావరి జిల్లా ఎఫ్.సి.ఐ. గిడ్డంగులకు తరలించి, ఉప్పుడు బియ్యంగా వాడుకునేందుకు అంగీకారం తెలిపింది. రవాణా ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నందున ధాన్యాన్ని సేకరించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి రైల్వే శాఖతో సమన్వయం చేసి రవాణా సౌకర్యం విషయంలో సహకరిస్తామని కేంద్రం తెలిపింది.
ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వ లేఖ ఆధారంగా ఉపరాష్ట్రపతి చొరవతీసుకుని, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శితో పాటు హోంశాఖ కార్యదర్శులతో మాట్లాడుతూ వచ్చారు. దీనిపై స్పందించిన కేంద్రం ఈ రోజు తగిన ఉత్తర్వులు జారీ చేసింది. దానితో పాటు విపత్తు అంచనా కోసం కేంద్ర బృందాన్ని పంపమని కోరిన రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని ప్రస్తావిస్తూ, భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని ప్రకృతి విపత్తుగా పరిగణించలేమని.. అందుకు పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రకృతి వైపరిత్య సహాయనిధి నుంచి అందించాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది.
శుక్రవారం ఉపరాష్ట్రపతితో ఆయా శాఖల కార్యదర్శులు మరోసారి సంప్రదింపులు జరిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో ధాన్యం సేకరణ గడువుపెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నిర్ణయించిన తేదీల ప్రకారం ఆగస్టు 31నే ధాన్యం సేకరణ గడువు ముగియగా.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల రైతులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తితో అధికారులతో మాట్లాడి సెప్టెంబర్ 30 వరకు ధాన్యం సేకరణ గడువు పెంచేలా ఉపరాష్ట్రపతి గతంలో చొరవ తీసుకున్న సంగతి విదితమే.
***
(Release ID: 1656454)