ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం

ఉన్నత స్థాయి బృందాన్ని జమ్మూ కు తరలించిన కేంద్రం

కోవిడ్ నియంత్రణ, నిఘా, పరీక్షలు, చికిత్సా వ్యవస్థను బలోపేతం చేయనున్న కేంద్ర బృందం

Posted On: 18 SEP 2020 3:10PM by PIB Hyderabad

జమ్మూకు ఒక ఉన్నత స్థాయి కేంద్ర బృందాన్ని పంపాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కొద్ది రోజులుగా జమ్మూ జిల్లాలో కోవిడ్ కేసులు ఎక్కువగా వస్తూ ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బృందంలో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్ సి డి సి) డైరెక్టర్ డాక్టర్ ఎస్ కె సింగ్,  ఢిల్లీ లోని ఎయిమ్స్ పల్మొనరీ  విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ హడ్డా ఉన్నారు.

ఇటీవలే ఒక ప్రత్యేక బృందం శ్రీనగర్ లోయ ను సందర్శించిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు సభ్యుల ఉన్నత స్థాయి బృందంలో నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వికె పాల్, ఎన్ సి డి సి డైరెక్టర్ డాక్టర్ ఎస్ కె సింగ్ ఉన్నారు. అక్కడ కోవిడ్ ను ఎదుర్కోవటానికి శ్రీనగర్ లోయలోను జిల్లా కలెక్టర్ తదితర అధికారుల సంసిద్ధతను వారు సమీక్షించారు. అకడికి వెళ్ళి వచ్చిన బృందం ఇప్పుడు జమ్మూ వెళుతున్న బృందంతో సమాలోచనలు జరిపింది. వీరు కూడా జమ్మూ జిల్లా కలెక్టర్ తోను, ఆరోగ్య అధికారులతోను చర్చించి పరిస్థితిని అంచనావేస్తారు. బక్షీనగర్, గాంధీనగర్ లో ఉన్న ఆస్పత్రులను సందర్శిస్తారు.

అక్కడి ప్రభుత్వం చేస్తున్న కృషిని బలోపేతం చేయటానికి ఈ కేంద్ర బృందం సహకరిస్తుంది. వ్యాధి నియంత్రణకు, నిఘాకు, పరీక్షల సంఖ్య పెంచటానికి, పాజిటివ్ కేసులకు చికిత్స అందజేయటానికి తెసుకోవాల్సిన చర్యలను వివరిస్తుంది. సకాలంలో వ్యాధి నిర్థారణ చెయ్యటంలో ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో కేంద్ర బృందం మార్గదర్శనం చేస్తుంది.

జమ్మూలో మొత్తం 9428. కేసులు కోవిడ్ పాజిటివ్ గా తేలగా వీళ్ళలో 3196 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోవిడ్ తో మరణించినవారు 117 మంది.

జిల్లాలో మొత్తం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 6115. వారం క్రితం మొత్తం కేసుల సంఖ్య  6878 ఉండేది. అయితే జమ్మూలో 15.4 రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతున్నట్టు గుర్తించారు. ఇక్కడ కోలుకుంటున్నవారిశాతం 33.9% గా నమోదు కాగా మొత్తం కేసులలో మరణాల శాతం 1.24%.

వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్ చికిత్స, నివారణలో చేస్తున్న కృషికి తోడుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన బృందాలను పర్యటనకు పంపుతోంది. ఈ బృందాలు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో చర్చించి సమాచారం తెలుసుకొని, సవాళ్లను అర్థం చేసుకొని చికిత్సకు సంబంధించిన  అవరోధాలను ఏవైనా ఉంటే, అవి తొలగించటానికి కృషిచేస్తున్నాయి.

***



(Release ID: 1656300) Visitor Counter : 141