రక్షణ మంత్రిత్వ శాఖ
రాజ్యసభలో సెప్టెంబరు 17న రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగ పాఠం
Posted On:
17 SEP 2020 1:28PM by PIB Hyderabad
గౌరవనీయులైన సభాపతిగారూ!
- లదాఖ్ సరిహద్దుల్లో కొన్ని నెలలుగా కొనసాగిన పరిణామాలను ఈ సమున్నత సభలోని గౌరవనీయులైన సభ్యులకు ఇవాళ నేను వివరించదలచాను. మన ఈ ఘనమైన దేశ నిర్మాణంలో అనేకమంది భారతీయులు ప్రాణాలర్పించారు. అలాగే స్వతంత్ర భారత సాయుధ దళాలు మన సరిహద్దు భద్రత కోసం సర్వోన్నత త్యాగం చేయడానికి ఎన్నడూ వెనుకాడింది లేదు. ఆ మేరకు గల్వాన్ లోయలో మన మాతృభూమి రక్షణ కోసం 2020 జూన్ 15న కల్నల్ సంతోష్ బాబుసహా సాహసులైన 19 మంది సైనికులు ప్రాణత్యాగం చేసిన సంగతి మీకందరికీ తెలిసిందే. మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీగారు స్వయంగా లదాఖ్ సందర్శించి మన వీర సైనికుల ఆత్మస్థైరాన్ని ఇనుమడింపజేశారు. వారిని కలిసిన తర్వాత నాకు కూడా మన సాహసవీరుల మొక్కవోని ధైర్యం అనుభవంలోకి వచ్చింది. ఈ సభ కూడా ప్రారంభంలో రెండు నిమిషాల మౌనం పాటించి గల్వాన్ అమరులైన మన 20 మంది వీరులకు నివాళి అర్పించింది.
- చైనాతో మన సరిహద్దు సమస్యపై కొన్ని వివరాలను క్లుప్తంగా సభ ముందుంచడానికి నేను తొలుత కొంత కొంత సమయం కేటాయించాలని భావిస్తున్నాను. భారత-చైనా దేశాలు తమ సరిహద్దు సమస్యను ఇంకా పరిష్కరించుకోవాల్సి ఉందన్న సంగతి సభకు తెలిసిందే. భారత-చైనాల మధ్య సరిహద్దుకు సంబంధించి సాధారణ, సంప్రదాయక సరళరేఖను చైనా అంగీకరించదు. ధ్రువీకృత ఒప్పందాలు, ఒడంబడికల మేరకు సుస్పష్టంగా ధ్రువీకరించబడిన భౌగోళిక సూత్రాల ఆధారంగా ఈ సరిహద్దు రేఖ నిర్ధారితమైనట్లు మనం విశ్వసిస్తున్నాం. అంతేకాకుండా చారిత్రక వినియోగపరంగా, ఆచరణాత్మకంగా, శతాబ్దాలనుంచీ ఉభయపక్షాలకూ ఇది సుపరిచితం. అయితే, రెండు దేశాల మధ్య సరిహద్దు అధికారికంగా నిర్ణయించబడలేదన్నది చైనా వాదన. అలాగే సంప్రదాయకంగా ఆచరణలోగల పరిధికి సంబంధించి మాత్రమే సరిహద్దు రేఖ ఉనికిలో ఉందని వాదిస్తోంది. దీని ఆధారంగానే ఉభయ పక్షాలూ తమవైపు చారిత్రకంగా భిన్నమైన అధికార పరిధిని కలిగి ఉన్నాయని చెబుతోంది. తదనుగుణంగానే రెండు పక్షాలూ సంప్రదాయ సరిహద్దు రేఖపై తమదైన వివరణలు కలిగి ఉన్నాయంటోంది. ఈ పరిస్థితుల నడుమ 1950-60లలో రెండు దేశాలూ చర్చలు నిర్వహించినా ఆ ప్రయత్నాలు పరస్పర ఆమోదయోగ్య పరిష్కారాన్ని చూపలేకపోయాయి.
- ఇక కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్‌లో సుమారు 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా దురాక్రమణలోనే ఉందన్నది సభకు తెలిసిందే. దీనికితోడు 1963నాటి చైనా-పాకిస్థాన్ 'సరిహద్దు ఒప్పందం' కింద పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మరో 5,180 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా చైనాకు అప్పగించింది. ఇది చాలదన్నట్లు భారత-చైనా సరిహద్దులోని తూర్పు సెక్టార్‌లో అరుణాచల్ ప్రదేశ్ పరిధిలోని సుమారు 90,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగం కూడా తనదేనని చైనా వాదిస్తోంది.
- సరిహద్దు వివాదాన్ని సంక్లిష్ట సమస్యగా భారత-చైనాలు రెండూ అధికారికంగా అంగీకరించాయి. దీన్ని పరిష్కరించుకోవడానికి సహనం అవసరమన్న అంగీకారానికి కూడా వచ్చాయి. ఆ మేరకు శాంతియుత సంప్రదింపుల ద్వారా సముచిత, సహేతుక, పరస్పర ఆమోదయోగ్య పరిష్కారానికి కట్టుబడాలని కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఈ చర్చలకు నడుమ సరిహద్దులో శాంతిసామరస్యాల నిర్వహణతోపాటు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అవి కీలకమని కూడా రెండు పక్షాలూ అంగీకరించాయి.
5. భారత-చైనాల మధ్య సరిహద్దులో ఉమ్మడి అంగీకారంగల వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) ఏదీలేదని, మొత్తం ఎల్‌ఏసీ గురించి కూడా సామూహిక అంగీకారం కూడా లేదనే వాస్తవాన్ని నేను ఈ సందర్భంగా ప్రస్తావించదలచాను. కాబట్టి, సరిహద్దు ప్రాంతాల్లో… ప్రత్యేకించి వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిసామరస్యాలకు భరోసా ఇస్తూ రెండు దేశాలూ అనేక ఒప్పందాలు విధివిధానాలను ఆమోదించాయి.
6. ఈ ఒప్పందాల ప్రకారం సరిహద్దుకు సంబంధించి పరస్పర వాదనల ప్రభావం లేకుండా ఎల్‌ఏసీ వెంబడి శాంతిసామరస్యాలను కొనసాగించాలని ఉభయ పక్షాలూ అంగీకరించాయి. ఈ అంగీకారం ప్రాతిపదికన 1988 నుంచి మొత్తంమీద రెండు దేశాల మధ్య సంబంధాల్లోనూ గణనీయ పురోగతి కనిపించింది. సరిహద్దు సమస్య పరిష్కారంపై చర్చలకు సమాంతరంగా ద్వైపాక్షిక సంబంధాల పురోగమనం కొనసాగాలని భారత్ అభిప్రాయపడింది. అలాకాకుండా ఎల్‌ఏసీ వెంబడి శాంతి సామరస్యాలకు తీవ్ర అవాంతరం ఏదైనా ఏర్పడితే సానుకూల మార్గంలో సాగుతున్న సంబంధాలను దెబ్బతీసే ముప్పుందని స్పష్టం చేసింది.
7. వాస్తవాధీన రేఖ వెంబడి ఉభయపక్షాలూ సైనిక దళాలను కనీస స్థాయిలో ఉంచాలన్నది 1993, 1996 నాటి ఒప్పందాల ప్రధానాంశం. సరిహద్దు సమస్యకు అంతిమ పరిష్కారం కుదరాల్సినందున ఉభయ పక్షాలూ వాస్తవాధీన రేఖను కచ్చితంగా గౌరవిస్తూ, హద్దులు దాటకుండా చూసుకోవాలని కూడా ఈ ఒప్పందాలు విస్పష్టంగా నిర్దేశిస్తున్నాయి. అంతేకాకుండా సరిహద్దు విషయంలో భారత్-చైనాలు ఆమోదయోగ్య అవగాహనకు రావాల్సినందున తదనుగుణంగా వాస్తవాధీన రేఖ స్పష్టీకరణ-ధ్రువీకరణకు కట్టుబడాలని కూడా ఈ ఒప్పందాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి అనుగుణంగా 1990ల ముగింపుతోపాటు 2003దాకా ఉభయ పక్షాలూ వాస్తవాధీన రేఖను అవగాహన, నిర్ధారణ కసరత్తులో నిమగ్నమయ్యాయి. కానీ, ఆ తర్వాతి కాలంలో ఈ కసరత్తును కొనసాగించేందుకు చైనా సుముఖత చూపలేదు. పర్యవసానంగా కొన్ని ప్రదేశాలలో ఎల్‌ఏసీ పరిధిపై భారత-చైనాల మధ్య అవగాహనలో వ్యత్యాసాలు పొడసూపాయి. దీంతోపాటు ఇతర సరిహద్దు ప్రాంతాల్లో ఉభయ పక్షాల దళాలు నడచుకోవాల్సిన తీరుకు సంబంధించిన అనేక ఇతర ఒప్పందాలు, విధివిధానాల అమలు కోసం తరచూ ఘర్షణపడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
8. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిణామాల గురించి సభకు వివరించే ముందు నేనొక అంశాన్ని సభ్యులకు తెలియజేయాలని భావిస్తున్నాను. కేంద్ర సాయుధ పోలీసు దళాల నిఘా యూనిట్లు, త్రివిధ సైనిక బలగాలతోపాటు వివిధ నిఘా సంస్థల మధ్య ప్రభుత్వం విస్తృత, కాలపరీక్షకు నిలబడిన సమన్వయ యంత్రాంగాన్ని కలిగి ఉందని మీకు తెలియజేస్తున్నాను. ఆ మేరకు సాంకేతిక, మానవ మేధస్సు నిరంతరం చక్కని సమన్వయంతో సమాచార సేకరణ ముందుకు సాగుతూంటుంది. ఈ సమాచారాన్ని సాయుధ దళాలతో పంచుకోవడంల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఇది వారికి సహాయపడుతుంది.
9. ఈ సంవత్సరం పరిణామాలను ఇప్పుడు సభకు తెలియజేస్తాను. తూర్పు లదాఖ్ సమీపానగల సరిహద్దు ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి చైనావైపు దళాల సంఖ్య పెంపు, యుద్ధ సామగ్రి తరలింపును గమనించాం. అటుపైన మే నెలారంభంలో గల్వాన్ లోయ ప్రాంతంలో చైనా దళాలు మన దళాల సాధారణ-సంప్రదాయ గస్తీ విధానానికి ఆటంకం కలిగించేలా వ్యవహరించడంతో పరస్పర ఘర్షణ తలెత్తింది. ద్వైపాక్షిక ఒప్పందాలు, ఇతర విధివిధానాల ప్రకారం క్షేత్రస్థాయి కమాండర్లు ఈ పరిస్థితిని చక్కదిద్దారు. కానీ, మే నెల మధ్యలో చైనా దళాలు పశ్చిమ సెక్టార్‌లోని ఇతర ప్రాంతాలలో వాస్తవాధీన రేఖను అతిక్రమించడానికి అనేక ప్రయత్నాలు చేశాయి. ఇందులో కొంగ్‌కలా, గోగ్రాతోపాటు ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర తీరం ప్రాంతాల్లో ఈ అతిక్రమణ యత్నం చోటుచేసుకుంది. అయితే, మన సైనిక బలగాలుఈ ప్రయత్నాలను ముందుగానే గుర్తించి సముచితరీతిలో స్పందించాయి.
10. ఈ నేపథ్యంలో ఇటువంటి ఏకపక్ష దుస్సాహస ప్రయత్నాలద్వారా ప్రస్తుత పరిస్థితిని చెదరగొట్టడానికి చైనా దళాలు యత్నిస్తున్నాయని మేం దౌత్య, సైనిక మార్గాల్లో స్పష్టంగా తెలియజేశాం. ఇది మాకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టీకరించాం.
11. వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణ వాతావరణం పెరుగుతుండటంతో ఉభయ పక్షాల సీనియర్ కమాండర్లు 2020 జూన్ 6న సమావేశమై పరస్పర ప్రతిస్పందనాత్మక చర్యలద్వారా వెనక్కుతగ్గే ప్రక్రియ చేపట్టాలని అంగీకారానికి వచ్చారు. అంతేగాక వాస్తవాధీన రేఖకు కట్టుబడాలని, రేఖ వెంబడి యథాతథ స్థితికి భంగం కలిగించే ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించరాదని కూడా ఉభయపక్షాలూ అంగీకరించాయి. కానీ, ఈ ఒడంబడికను ఉల్లంఘించిన చైనా దళాలు జూన్ 15న గల్వాన్ వద్ద తీవ్ర ఘర్షణను సృష్టించాయి. అంతేకాకుండా మన వీర సైనికులను బలిగొనడంతోపాటు తమ వారిని కూడా కోల్పోయాయి.
12. ఇలాంటి సంఘటనల సందర్భంగా అవతలి పక్షం ఎంతగా రెచ్చగొడుతున్నా మన సాయుధ దళాలు ఎంతో ‘సంయమనం’తో వ్యవహరిస్తున్నారు. అయితే, అవసరమైన సమయంలో భారత ప్రాదేశిక సమగ్రత పరిరక్షణ కోసం వారు ‘శౌర్యం’ కూడా సమాన స్థాయిలో ప్రదర్శించారు. మనందరి రక్షణ, భద్రత కోసం అత్యంత క్లిష్ట పరిసరాలు, పరిస్థితుల నడుమ అపారమైన కష్టనష్టాలను భరిస్తూ మన సైనికులు చూపుతున్న ధైర్యసాహసాలను ఈ సభ మనసారా అభినందించాలని కోరుతున్నాను.
13. మన సరిహద్దుల పరిరక్షణలో మా సంకల్పాన్ని ఎవరూ సందేహించే అవసరం లేదు. అయితే, ఇరుగుపొరుగుతో శాంతియుత సంబంధాలకు పరస్పర గౌరవం, అవగాహన ప్రాతిపదికగా ఉంటాయన్నది భారత్ విశ్వాసం. ప్రస్తుత పరిస్థితిని సంభాషణల ద్వారా పరిష్కరించాలని మేం భావిస్తున్నాం. ఆ మేరకు చైనా పక్షంతో దౌత్య, సైనికపరమైన చర్చలు నిర్వహించాం. ఈ చర్చల సందర్భంగా మన విధానాన్ని నిర్దేశించే మూడు ముఖ్య సూత్రాలను పాటించాం. అవేమిటంటే: (i) ఉభయ పక్షాలూ వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ను కచ్చితంగా గుర్తించి, గౌరవించాలి; (ii) యథాతథ స్థితిని మార్చడానికి రెండు పక్షాలూ ఏకపక్షంగా ప్రయత్నించరాదు; (iii) ఉభయ పక్షాల మధ్యగల అన్ని ఒప్పందాలు, ఒడంబడికలను పూర్తిస్థాయిలో పాటించాలి. కాగా, తమ వంతుగా పరిస్థితిని బాధ్యతాయుతంగా నిర్వహిస్తామని, ద్వైపాక్షిక ఒప్పందాలు- విధివిధానాల ప్రకారం శాంతిసామరస్యాలకు భరోసా ఇస్తామని చైనా పక్షం ప్రకటించింది. కానీ, చైనా కార్యకలాపాలు చూస్తుంటే వారి మాటలకు-చేతలకు పొంతనలేదని స్పష్టమవుతోంది. ఇందుకు ఒక ఉదాహరణ ఏమిటంటే- ఒకవైపు చర్చలు సాగుతున్నా మరోవైపు ఆగస్టు 29, 30 తేదీల్లో రాత్రివేళ ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరాన యథాతథ స్థితిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ మళ్ళీ రెచ్చగొట్టే సైనిక విన్యాసాలకు పాల్పడింది. అయితే, మన సైనిక దళాలు దృఢంగా స్పందిస్తూ సమయానుకూల, సముచిత రీతిలో వారి ప్రయత్నాలను తిప్పికొట్టాయి.
14. ఇలాంటి సంఘటనలను బట్టి చైనా చర్యలు ద్వైపాక్షిక ఒప్పందాలను అగౌరవపరచేలా ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. ఆ మేరకు బలగాల మోహరింపును పెంచడంద్వారా 19193, 1996 నాటి ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో శాంతిసామరస్యాలకు భరోసా ఇస్తూ వాస్తవాధీన రేఖను గుర్తించి గౌరవించడం కూడా ఈ రెండు ఒప్పందాలకు ప్రాతిపదికగా ఉంది. ఆ మేరకు మన బలగాలు పూర్తిస్థాయిలో వీటికి కట్టుబడి ఉన్నా చైనా పక్షం ఆ విధంగా స్పందించడం లేదు. ఫలితంగా వాస్తవాధీన రేఖ వెంబడి వారి చర్యలు తరచూ ఘర్షణలకు, పరస్పర దాడులకు దారితీస్తున్నాయి. నేను ఇంతకుముందే వివరించినట్లుగా ఉద్రిక్తతలు తలెత్తినపుడు అనుసరించాల్సిన విధివిధానాలను ఒప్పందాలు సమగ్రంగా నిర్దేశించాయి. కానీ, ఈ ఏడాది ఇటీవలి సంఘటనల నేపథ్యంలో- పరస్పర అంగీకారంగల నియమ నిబంధనలను సైతం చైనా బలగాలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయని వారి హింసాత్మక వైఖరి స్పష్టం చేస్తోంది.
15. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వెంబడి మాత్రమేగాక మరికాస్త లోతుగా పెద్ద సంఖ్యలో దళాలను, ఆయుధ సామగ్రిని చైనా మోహరించింది. ఆ మేరకు తూర్పు లదాఖ్‌లో గోగ్రా, కొంగ్‌కలా, ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర-దక్షిణ తీరాలుసహా అనేక ఘర్షణాత్మక ప్రాంతాల్లో బలగాలను దించింది. చైనా చర్యలకు ప్రతిస్పందనగా, భారత సరిహద్దుల సంపూర్ణ రక్షణ దిశగా మన సాయుధ దళాలు కూడా ఈ ప్రాంతాల్లో తగుమేర బలగాలను మోహరించాయి. ఆ మేరకు మన సాయుధ దళాలు సదా సవాళ్లను దీటుగా ఎదుర్కొంటాయని, వారు మనమంతా గర్వపడేలా కర్తవ్య పాలన చేస్తారనే విశ్వాసం సభకుందని నాకు తెలుసు. ఇదీ ఇప్పటికీ అక్కడ కొనసాగుతున్న పరిస్థితి… ప్రస్తుత పరిస్థితుల్లో స్పష్టమైన, విశ్వసనీయ కార్యాచరణ అవసరం కాబట్టి ఇంతకన్నా ఎక్కువగా నేను సమాచారం బహిరంగపరచలేను. దీనికి సంబంధించి సభకు అవగాహన ఉందన్న విశ్వాసం నాకుంది.
16. కోవిడ్-19 సవాలు విసిరిన సంక్షోభ సమయంలోనే ఐటీబీపీసహా మన సాయుధ దళాలు వేగంగా మోహరించడం కొనసాగింది. ఈ మేరకు వారి కృషిని అభినందించక తప్పదు. కొన్నేళ్లుగా సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడంద్వారానే ఇది సాధ్యమైంది. అనేక దశాబ్దాలుగా చైనా తన సరిహద్దు ప్రాంతాల్లో దళాల విస్తరణకు అవనువైన కీలక మౌలిక సదుపాయాల నిర్మాణ కార్యకలాపాలను కొనసాగిస్తున్న సంగతి సభలకు తెలిసిందే. అయితే, తదనుగుణంగా మన ప్రభుత్వం కూడా సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్‌ను మునుపటికన్నా అధికంగా రెట్టింపు చేసింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని రోడ్లు, వంతెనలు పూర్తయ్యాయి. ఇది స్థానిక జనాభాకు ఎంతో అవసరమైన అనుసంధానాన్ని కూడా కల్పించింది. దాంతోపాటుల మన సాయుధ దళాలకు మెరుగైన రవాణా సహకారం అందుబాటులోకి వచ్చింది. సరిహద్దు ప్రాంతాలలో మరింత అప్రమత్తతకు, అవసరమైన చోట మరింత సమర్థంగా స్పందించడానికి ఇది వీలు కల్పించింది. రాబోయే సంవత్సరాల్లోనూ ప్రభుత్వం ఈ లక్ష్యానికి కట్టుబడి ఉంది. దేశ ప్రయోజనాల కోసం ఎంతటి భారీ, కఠినమైన చర్యలకైనా వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు.
గౌరవనీయులైన సభాపతిగారూ!
17. మన సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుత సమస్యలను శాంతియుత సంభాషణలు, సంప్రదింపులద్వారా పరిష్కరించుకోవడానికే భారత్ ఇప్పటికీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నేను నొక్కిచెప్పదలిచాను. ఈ లక్ష్యంతోనే నేను సెప్టెంబరు 4వ తేదీన మాస్కోలో చైనా రక్షణశాఖ మంత్రిని నేను కలుసుకుని ప్రస్తుత పరిస్థితిపై కూలంకషంగా చర్చించాను. చైనావైపు భారీగా దళాల మోహరింపు, సిబ్బంది దుందుడుకు వైఖరి తదితర చర్యలకు సంబంధించి మన ఆందోళనలను స్పష్టంగా తెలియజేశాను. ఏకపక్షంగా యథాతథ స్థితిని చెదరగొట్టే ప్రయత్నాలు ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించడమేనని స్పష్టంచేశాను. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికే భారత్ మొగ్గుచూపుతున్నప్పటికీ, దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణలో వెనుకాడదేది లేదని కూడా కుండబద్దలు కొట్టాను. నా సహచరుడు, విదేశాంగ శాఖ మంత్రి శ్రీ జైశంకర్ కూడా మాస్కోలో సెప్టెంబరు 10వ తేదీన చైనా విదేశాంగ శాఖ మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ ఒప్పందాన్ని చైనా పక్షం చిత్తశుద్ధితో, విశ్వసనీయంగా పాటిస్తే సరిహద్దులలో బలగాల పూర్తిస్థాయి ఉపసంహరణ ద్వారా శాంతిసామరస్యాలను పునరుద్ధరించే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు.
18. చైనాతో ఇంతకుముందు కూడా సరిహద్దులలో సుదీర్ఘ ప్రతిష్టంభన సంఘటనలు చోటుచేసుకోవడం, అవి శాంతియుతంగా పరిష్కారం కావడం గురించి సభ్యులందరికీ తెలిసిందే. కానీ, ఈ ఏడాది ఘర్షణలు తలెత్తిన ప్రదేశాల సంఖ్య, దళాల మోహరింపు స్థాయి రీత్యా పరిస్థితులు మునుపటికన్నా భిన్నంగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికే మేం కట్టుబడి ఉన్నాం. ఆ మేరకు ఎట్టి పరిస్థితిలోనూ దేశానికి తలవంపులు రానివ్వబోమని 130 కోట్ల భారత ప్రజానీకానికి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. ఇది మా దృఢనిశ్చయం మాత్రమేగాక జాతి సుదృఢ సంకల్పమని ప్రకటిస్తున్నాను.
19. గౌరవనీయ సభాపతిగారూ! మన దేశం సవాలును ఎదుర్కొన్న ప్రతి సందర్భంలోనూ మన సాయుధ దళాల సంకల్పానికి, దీక్షకు ఈ సభ సదా ఐకమత్యంతో బలంగా మద్దతునిస్తూ వస్తోంది. సరిహద్దులలో మన సాయుధ బలగాల తిరుగులేని స్ఫూర్తి, మొక్కవోని వారి ధైర్యసాహసాలపై సంపూర్ణ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తోంది.
20. సభాపతిగారూ… మన సాయుధ దళాల ఆత్మస్థైర్యం, ఉత్తేజం అత్యధిక స్థాయిలో ఉన్నాయని, ఆ మేరకు వారు తమకెదురయ్యే ఎంతటి క్లిష్టమైన సవాలునైనా అలవోకగా అధిగమించడానికి కట్టుబడి ఉన్నారని నేను మీ ముఖతా దేశ ప్రజలకు భరోసా ఇస్తున్నాను. నేటి పరిస్థితుల్లోనూ మన సైనికులు దూకుడుకన్నా సహనాన్ని, సాహసాన్నే ఎంచుకున్నారు. “సాహసంతోనే విజయం సహవాసం” చేస్తుందన్నది మన నానుడి. సంయమనం, ధైర్యసాహసాలకు మన సైనికులు నిలువెత్తు నిదర్శనం. సభాపతిగారూ… మన ప్రధాని భరోసా సందర్శన నేపథ్యంలో దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు తమవెంటనే ఉన్నారన్న విశ్వాసం భారత కమాండర్లు, సైనికులు గుండెల్లో నిండింది. అక్కడి సంక్లిష్ట శీతల వాతావరణం దృష్ట్యా వెచ్చదనాన్ని అందించే ప్రత్యేక దుస్తులు, విధి నిర్వహణ కోసం ప్రత్యేక గుడారాలుసహా వారికి అవసరమైన అన్నిరకాల ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ప్రభుత్వం సమకూర్చింది. సభాపతిగారూ… మన సైనికుల స్ఫూర్తి శిఖర సమానం. వారు అత్యంత ఎత్తయిన, సంక్లిష్ట అతిశీతల పరిస్థితుల నడుమ తక్కువ ప్రాణవాయువుతో విధులు నిర్వర్తించగల సమర్థులు. ఆ మేరకు సియాచిన్, కార్గిల్‌వంటి గడ్డు పరిస్థితులుగల ప్రాంతాల్లో ఏళ్ల తరబడి వారు సునాయాసంగా కర్తవ్యం నిర్వహణలో ఉన్నారు.
21. గౌరవనీయులైన సభాపతిగారూ… మనమిప్పుడు లదాఖ్‌లో సవాలును ఎదుర్కొంటున్నామన్నది వాస్తవమేగానీ, మన దేశం, మన వీర సైనికులు ఎలాంటి సవాలును అధిగమించడం సాధ్యమేనన్న నమ్మకం నాకుంది. మన సాయుధ దళాల శౌర్యధైర్యాలను ముక్తకంఠంతో గౌరవించాలని నేనీ సభను కోరుతున్నాను. మన వీర సైనికుల ఐక్యత, సంపూర్ణ విశ్వాసం దేశవ్యాప్తంగానేగాక ప్రపంచవ్యాప్తంగానూ ప్రతిధ్వనిస్తుంది. ఆ మేరకు మన దళాల్లో సరికొత్త విశ్వాసం, శక్తితోపాటు అపరిమిత ఉత్సాహాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు.
“జైహింద్!”
(Release ID: 1655821)
Visitor Counter : 308