హోం మంత్రిత్వ శాఖ

వలసదారులకు ఆర్థిక సహాయం

Posted On: 15 SEP 2020 6:00PM by PIB Hyderabad

అనివార్యమైన లాక్ డౌన్ కాలంలో, ప్రజలు నిత్యావసర సామాగ్రి అందుబాటులో లేక ఇబ్బందులు పడకూడదని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా స్పృహలో ఉండి, అనేక చర్యలు చేపట్టింది.  జాతీయ స్థాయిలో కంట్రోల్ రూమ్ ‌ల ద్వారా పరిస్థితిని ప్రతి రోజూ 24 గంటలూ నిశితంగా పరిశీలించింది.  వలస కార్మికులతో సహా నిరాశ్రయులకు ఆహారం, ఆరోగ్య సంరక్షణ మరియు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశ్యంతో, 28.03.2020 తేదీన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయోజనం కోసం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్.‌డి.ఆర్.‌ఎఫ్) ను ఉపయోగించడానికి రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించింది.

వలస కార్మికులకు ఆశ్రయం, ఆహారం, నీరు, ఆరోగ్య సదుపాయాలు మరియు సరైన కౌన్సిలింగ్ అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవటానికి దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.హెచ్.ఏ)  కూడా రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు (యు.టి) లకు క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు తగిన సూచనలు జారీ చేసింది. 

2020 ఏప్రిల్, 19వ తేదీన రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలో వలస కార్మికుల కదలికలను ఎమ్.హెచ్.ఏ. అనుమతించింది.  తద్వారా ఈ కార్మికులు పారిశ్రామిక, వ్యవసాయం, నిర్మాణం, తయారీ మరియు ఎం.ఎన్.‌ఆర్.ఈ.జి.ఏ. పనులలో నిమగ్నమవ్వవచ్చు.  ఎందుకంటే 20.04.2020 తేదీ నుండి కంటైన్మెంట్ జోన్ల వెలుపల అదనపు కార్యకలాపాలు అనుమతించబడ్డాయి.  2020 ఏప్రిల్ 29వ తేదీన  మరియు 2020 మే నెల 1వ తేదీన ఎమ్.హెచ్.ఎ. విడుదల చేసిన ఆదేశాల ప్రకారం, వలస కార్మికులను, వరుసగా బస్సులు మరియు శ్రామిక్ ప్రత్యేక రైళ్ళ ద్వారా వారి స్వస్థలాలకు తరలించడానికి అనుమతించడం జరిగింది. 

కోవిడ్-19 లాక్ ‌డౌన్ సమయంలో తమ సొంత రాష్ట్రానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రహదారిపై మృతి చెందిన వారి సంఖ్య గురించిన వివరాలు ఖచ్చితంగా సేకరించడం వీలుకాలేదు.  అయితే, వలస కార్మికుల కదలికలను సులభతరం చేయడానికి అవసరమైన అన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. 

కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాడటానికి వీలుగా పేదలకు సహాయం చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం, 2020 మార్చి, 26వ తేదీన, “ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన” కింద, 1.70 లక్షల కోట్ల రూపాయలతో సహాయక ప్యాకేజీని ప్రకటించింది. ఈ పధకం కింద, సుమారు 42 కోట్ల మంది పేద ప్రజలు, 68,820 కోట్ల రూపాయల మేర ఆర్ధిక సహాయాన్ని స్వీకరించారు.  కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో గ్రామాలకు తిరిగి వచ్చే వలస కార్మికులకు ఉపాధి మరియు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, కేంద్ర ప్రభుత్వం 2020 జూన్ 20వ తేదీన “గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్” ను కూడా ప్రారంభించింది.

ఈ రోజు లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ తాను సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

*****



(Release ID: 1654734) Visitor Counter : 142