ప్రధాన మంత్రి కార్యాలయం
బిహార్‌లో మూడు కీలక పెట్రోలియం ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం
Posted On:
13 SEP 2020 2:42PM by PIB Hyderabad
కార్యక్రమం ప్రారంభంలో.. బిహార్ దిగ్గజ రాజకీయ నేత శ్రీమాన్ రఘువంశ్ ప్రసాద్ సింగ్ గారు ఇకలేరనే వార్తను మీతో పంచుకోవడానికి విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి స్మృతికి నేను నివాళులు అర్పిస్తున్నాను. రఘువంశ్ బాబూ గారు పరమపదించడం వల్ల బిహార్‌తోపాటు దేశ రాజకీయాల్లో శూన్యత నెలకొంది. క్షేత్రస్థాయి విషయాలు తెలిసిన నేత, పేదల బాధలు తెలిసిన వ్యక్తి . వారి జీవితం మొత్తం బిహార్ కోసం పోరాడటంలోనే గడిపారు. తను నమ్మిన సిద్ధాంతం కొసం జీవితాంతం కృషిచేశారు.
నేను భారతీయ జనతాపార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నపుడు వారితోనాకు సాన్నిహిత్యం చాలా ఉండేది. టీవీ చర్చల్లో ఆసక్తికర చర్చలు జరిపేవాళ్లం. తర్వాత వారు కేంద్రీయ మంత్రిమండలిలో, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిరంతరం మాట్లాడుకునే వాళ్లం. మూడు, నాలుగు రోజల క్రితం కూడా వారిపై చర్చ జరిగింది. వారి ఆరోగ్య గురించి ఆవేదన చెందాను. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం గురించి సమాచారం తెలుసుకుంటూనే ఉన్నాను. వారు వీలైనంత త్వరగా కోలుకుని బిహార్ ప్రజలకు సేవచేసేందుకు వస్తారని ఆశించేవాణ్ని. కానీ వారి మనసులో ఏదో ఆవేదన, అంతర్మథనం జరుగుతోందని అర్థమైంది. ఇన్నాళ్లూ ఏ ఆదర్శాలను పాటిస్తూ వారు ముందుకుసాగారో.. ఆ బాటలో ఇక నడవటం వారికి చాలా కష్టంగా మారింది. మనస్సులో అంతర్గత పోరాటం జరిగేది. మూడు, నాలుగురోజుల క్రితం వారు తన అభిప్రాయాలను, మనసులో ఉన్న భావాలను లేఖరూపంలో ప్రకటించారు. దీంతోపాటు బిహార్ అభివృద్ధి విషయంలో తన ఆకాంక్షలను, రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలను పేర్కొంటూ బిహార్ ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. బిహార్ రాష్ట్రం పట్ల, బిహారీల పట్ల వారి ప్రేమానురాగాలు ఆ లేఖలో కనిపించాయి.
శ్రీ నితీశ్ కుమార్ గారితో నేను విజ్ఞప్తి చేస్తున్నా.. శ్రీ రఘువంశ్ ప్రసాద్ గారు తన చివరి లేఖలో పేర్కొంన్న అంశాలను పూర్తిచేసేందుకు మీరు, నేను కలిసి పూర్తి ప్రయత్నం చేద్దాం. వారు పేర్కొన్న అభివృద్ధిని బిహార్ ప్రజలకు అందిద్దాం. మరోసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునేముందు శ్రీ రఘువంశ్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
బిహార్ గవర్నర్ శ్రీ ఫాగు చౌహాన్ జీ, బిహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్ జీ, కేంద్ర మంత్రిమండలి సహచరులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ జీ, రవిశంకర్ ప్రసాద్ జీ, శ్రీ గిరిరాజ్ సింగ్ జీ, ఆర్కే సింగ్ జీ, అశ్వినీ కుమార్ చౌబేజీ, నిత్యానంద్ రాయ్ జీ, బిహార్ డిప్యూటీ సీఎం శ్రీ సుశీల్ కుమార్ మోదీజీ, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, అంతర్జాల వేదిక ద్వారా కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రియ సోదర, సోదరీమణులారా,
మీ అందరికీ శుభాకాంక్షలు, నేడు అమరులు, శూరుల గడ్డపై ప్రారంభోత్సవం జరుగుతున్న పథకాలతో బిహార్‌తోపాటు తూర్పు భారత దేశంలోని చాలా ప్రాంతాలకు విస్తృత ప్రయోజనం జరగనుంది. ఇవాళ 900 కోట్ల రూపాయల విలువైన కీలకమైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎల్పీజీ పైప్ లైన్ ప్రాజెక్టు, భారీ బాట్లింగ్ ప్రాజెక్టు కూడా ఉంది. ఇలాంటి చక్కటి పథకాలు ప్రారంభమవుతున్న సదర్భంగా బిహార్ వాసులందరికీ హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా,
కొన్నేళ్ల క్రితం బిహార్‌కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినపుడు మా దృష్టంతా రాష్ట్రంలో చేపట్టాల్సిన మౌలిక వసతులపైనే ఉంది. ఇందులో భాగంగా ఉద్దేశించిన దుర్గాపూర్-బాంకా సెక్షన్ మధ్యలోని కీలకమైన పైప్ లైన్ ప్రాజెక్టును ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రెండున్నరేళ్ల క్రితం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే అవకాశం కూడా నాకు కలిగింది. ఈ సెక్షన్ దాదాపు 200 కిలోమీటర్ల పొడవుంది. ఈ ప్రాంతంలో పైప్‌లైన్ పని చేయడం సవాళ్లతో కూడుకున్న పని అని నాకు చెప్పారు. ఎందుకంటే ఈ రెండు ప్రాంతాల మధ్య దాదాపు 10 పెద్ద నదులు, దట్టమైన అడవులు, రాతికొండలున్నాయి. అలాంటి ప్రాంతాల్లో పనిచేయడం అంత సులభమేం కాదు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, రాష్ట్ర ప్రభుత్వ సహకారం, మన ఇంజనీర్లు, కార్మిక సోదరుల కఠిన శ్రమ కారనంగానే ఈప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తయింది. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి ఒక్కరికీ హార్దిక అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
బిహార్ కోసం ప్రధానమంత్రి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీలో పెట్రోలియంతోపాటు గ్యాస్ సంబంధింత 10 పెద్ద ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వార దాదాపు 21వేల కోట్లను వెచ్చించాల్సి ఉంది. ఇందులో ఇది ఏడో ప్రాజెక్టు. దీని పని కూడా పూర్తయింది. దీన్ని బిహార్ ప్రజలకు అంకితం చేసేశాము దీనికి ముందు పాట్నా ఎల్పీజీ ప్లాంట్ విస్తరణ, నిల్వ సామర్థ్యాన్ని పెంచాల్సిన పని, పూర్ణియా ఎల్పీజీ ప్లాంట్ విస్తరణ, ముజఫర్ పూర్ లో కొత్త ఎల్పీజీ ప్లాంట్, ఈ ప్రాజెక్టులన్నింటినీ ముందే పూర్తిచేశాం. జగదీశ్ పూర్ – హల్దియా పైప్ లైన్ ప్రాజెక్టులోని ని ఓ భాగం బిహార్‌నుంచి ప్రయాణించే భాగం పని కూడా గతేడాది మార్చ్ లోనే పూర్తి చేశాం. మోతిహారీ, అమ్లేఖ్ గంజ్ పైప్ లైన్‌ను పైప్ లైన్ తో అనుసంధానించే పని కూడా పూర్తయింది.
గతంలో ఒక తరంలో పని ప్రారంభమైతే.. ఆ పని ఫలితాలను తర్వాతి తరం చూసేందుకు వీలుండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. నవభారతం, నవ బిహార్ నిర్మాణానికి ఇదే గుర్తింపు. ఇలాంటి పని సంస్కృతినే మనం ముందుకు తీసుకెళ్లాలి. ఈ కార్యక్రమాలు పూర్తవడంలో నితీశ్ జీ పాత్ర కూడా కీలకమే. ఇలా నిరంతరం శ్రమిస్తూ బిహార్‌తోపాటు తూర్పు భారతాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్దాం.
మిత్రులారా,
‘సామర్థ్య మూలం స్వాతంత్ర్యం, శ్రమ మూలం వైభవం’ అని మన శాస్త్రాల్లో చెప్పారు. అంటే.. సామర్థ్యం కారణంగా స్వాతంత్ర్యం సిద్ధిస్తుంది. అలాగే శ్రమిశక్తితోనే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో పయనిస్తుంది. బిహార్
తూర్పు భారతంలో సామర్థ్యానికి కొదువలేదు, ప్రకృతి కూడా వనరులకు లోటుచేయలేదు. అయినా దశాబ్దాలపాటు బిహార్, తూర్పు భారతం అభివృద్ధికి ఎందుకు దూరంగా ఉంది. ఇందుకు రాజకీయ, ఆర్థిక ప్రాధాన్యతలే కారణం.
ఈ పరిస్థితుల కారణంగానే.. తూర్పుభారతంలో, బిహార్‌లో మౌలికవసతుల ప్రాజెక్టులు ఎప్పుడు అంతులేని జాప్యానికి బాధితులుగా మిగిలిపోయాయి. రోడ్, రైలు, విమాన, ఇంటర్నెట్ అనుసంధానత ప్రాథమిక అవసరాలుగా గుర్తించబడలేదు. అంతే కాదు రోడ్డు వేస్తున్నప్పడు కూడా కేవలం వాహనాల కోసమే ఈ రోడ్డు వేస్తున్నాం నడుస్తూ వెళ్లేవారికోసం కాదన్న పరిస్థితులుండేవి. ఆ ఆలోచనే గందరగోళంగా ఉండేది.
ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ ఆధారిత పరివ్రమలు, పెట్రో కనెక్టివిటీ వంటి అంశాల గురించి బిహార్ లో గతంలో కనీసం ఆలోచించేవారు కూడా కాదు. సముద్ర తీర ప్రాంతం లేకపోవడం, నాలుగువైపులా భూమి ఉండటం వల్ల తీర ప్రాంతాల్లాగా పెట్రో, గ్యాస్ ఆధారిత పరిశ్రమలకు ఇక్కడ అవకాశం ఉండేది కాదు. అందుకే బిహార్ లో గ్యాస్ ఆధారిత వ్యవస్థ, ఉద్యోగాల కల్పన ఓ సవాల్ గా మారింది.
మిత్రులారా,
గ్యాస్ ఆధారిత పరిశ్రమలు, పెట్రో కనెక్టివిటీ వంటివి వినేందుకు కాస్త సాంకేతికపరమైన అంశాలుగా కనిపిస్తాయి. కానీ.. ఇవి నేరుగా ప్రజల జీవితాలను ప్రభావితం చేయగలవు. ఈ పరిశ్రమలు లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాలకు సీఎన్జీ, పీఎన్జీ అందుబాటులోకి వస్తున్నప్పుడు బిహార్ కు ఎందుకు ఈ సౌకర్యాలు ఉండకూడదన్న సంకల్పంతోనే మేం ముందడుగు వేశాం.
ప్రధానమంత్రి ఊర్జా గంగా యోజనలో భాగంగా తూర్పు భారతాన్ని తూర్పు సముద్రంలోని పారాదీప్ ను, పశ్చిమ సముద్ర తీరాన్ని కాండ్లా రేవుతో అనుసంధానం చేసే భగీరథ ప్రయత్నం ప్రారంభమైంది. దాదాపు 3వేల కిలోమీటర్ల పొడవైన ఈ పైప్ లైన్ ద్వారా 7 రాష్ట్రలను అనుసంధానం చేయవచ్చు. ఇందులో బిహార్ కు ప్రముఖమైన స్థానం ఉంది. పారాదీప్-హల్దియా నుంచి వచ్చే లైన్ ఇప్పుడు బాంకా వరకు పూర్తయింది. దీన్ని మున్ముందు పాట్నా, ముజఫర్ పూర్ వరకు విస్తరిస్తాము. కాండ్లా నుంచి వచ్చే లైన్ గోరఖ్ పూర్ వరకు వచ్చేసింది. దీన్ని కూడా అనుసంధానం చేస్తున్నాం. ఈ పైప్ లైన్ ప్రాజెక్ట్ మొత్తం పూర్తయితే.. ప్రపంచంలోనే అతిపెద్ద పైప్ లైన్ ప్రాజెక్ట్ ల్లో ఇదొకటిగా నిలిచిపోనుంది.
మిత్రులారా,
ఈ గ్యాస్ పైప్ లైన్ కారణంగానే బిహార్ లో సిలిండర్లను నింపే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. బాంకా, చంపారన్ ల్లో ఇలాంటి 2 కొత్త బాట్లింగ్ ప్రాజెక్టులు ఇవాళ జాతికి అంకితం చేశాము. ఈ రెండు ప్లాంట్లలో ఏటా 1.25కోట్ల సిలిండర్లను నింపే సామర్థ్యముంది. వీటి ద్వారా బిహార్ లోని బాంకా, భగల్పూర్, జుమాయీ, అర్ రియా, కిషన్ గంజ్, కటిహార్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, ముజఫర్ పూర్, సివాన్, గోపాల్ గంజ్, సీతామఢీ జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది.
జార్ఖండ్ లోని గోడ్డా, దేవ్ ఘర్, దుమ్కా, సాహిబ్ గంజ్, పాకుండ్ జిల్లాలు.. ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు అవసరమైన ఎల్పీజీ అవసరాలను కూడా ఈ ప్లాంట్లు తీర్చగలవు. ఈ ప్రాజెక్టుల వ్యవస్థాపన ద్వారా వేలమంది బిహారీలకు ఉద్యోగాల కల్పన జరుగుతోంది. భవిష్యత్తులోనూ ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయి.
మిత్రులారా,
బరౌనీలో మూతబడిన ఎరువుల కార్మాగారాన్ని ఇప్పుడు గ్యాస్ పైప్ లైన్ తో అనుసంధానం చేసే కార్యక్రమం వీలైనంత త్వరగా ప్రారంభం కానుంది. గ్యాస్ అనుసంధానత ద్వారా ఒకవైపు ఎరువుల, మరోవైపు విద్యుత్, స్టీల్ పరిశ్రమలు పనిచేయడం జోరందుకుంటుంది. మరోవైపు సీఎన్జీ ద్వారా పర్యావరణ హిత ఇంధనం, ఇంటింటింకీ పైప్డ్ గ్యాస్ కనెక్షన్ అందుబాటులోకి వస్తాయి. ఇందులో భాగంగానే ఇవాళ బిహార్, జార్ఖండ్ లోని చాలా జిల్లాల్లో పైప్ ల ద్వారా తక్కువ ధరకే గ్యాస్ అందించే కార్య్రమాలు ప్రారంభమయ్యాయి. ఇది దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ పర్యావరణహిత గ్యాస్ కనెక్షన్ అందించే కార్యక్రమానికి ఊతమిస్తోంది.
మిత్రులారా,
ఉజ్వల యోజన ద్వారా నేడు దేశంలోని 8 కోట్ల పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం ద్వారా పేదల జీవితాల్లోఎలాంటి మార్పులు వచ్చాయనేది కరోనా సమయంలో మనమంతా చూశాం. ఇంట్లో ఉండటం తప్పనిసరైన పరిస్థితుల్లో ఈ 8 కోట్ల కుటుంబాల్లోని మన సోదరులు, సోదరీమణులకు వంట చేసేందుకు ఇంధనం కోసం బయటకు వెళ్లే పరిస్థితి వస్తే పరిస్థితి ఎలా ఉండేదో మీరే ఆలోచించండి.
మిత్రులారా,
కరోనా సమయంలో ఉజ్వల పథకం లబ్ధిదారులకు కోట్ల సిలిండర్లను ఉచితంగా అందించాం. ఇందులో బిహార్ నుంచి కూడా లక్షల మంది లబ్ధిదారులున్నారు. లక్షల పేదల కుటుంబాలున్నాయి. ఈ సందర్భంగా పెట్రోలియం, గ్యాస్ కంపెనీలతోపాటు గ్యాస్ డెలివరీ చేస్తున్న కరోనా వారియర్స్ ను కూడా ప్రశంసిస్తున్నాను. కరోనా కష్టకాలంలోనూ అందరి ఇళ్లకు గ్యాస్ సమస్య రాకుండా సహాయపడిన గొప్ప మనసు వీరిది. మహమ్మారి ఉన్నా సిలిండర్ పంపిణీకి ఎక్కడా విరామం కలగకుండా పనిచేశారు.
మిత్రులారా,
ఒకప్పుడు దేశమంతా, బిహార్ లోనూ గ్యాస్ కనెక్షన్ ఉండటం కేవలం సంపన్నులకే సాధ్యమయ్యేది. గ్యాస్ కనెక్షన్ పొందేందుకు సిఫారసు లేఖల కోసం కాళ్లు అరిగేలా తిరగాల్సి వచ్చేంది. ఎంపీల ఇంటిముందు క్యూలు కట్టేవారు. గ్యాస్ కనెక్షన్ ఉన్న ఇళ్లను బాగా ఉన్న కుటుంబాలనేవారు. సమాజంలోని పీడిత, బాధిత, వంచిత కుటుంబాలను ఎవరూ పట్టించుకునేవారు కాదు. వారి సమస్యలను ఎప్పుడూ పట్టించుకునేవారే కాదు. కానీ బిహర్లో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఉజ్వల యోజన ద్వారానే బిహార్ లో దాదాపు 1.25కోట్ల మంది పేదల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందాయి. ఇది కోట్లాది బిహారీల కుటుంబాల్లో మార్పులు తీసుకొచ్చింది. వీరంతా తమ శక్తిని వంటచెరకును ఏరుకునే బదులు జీవితాలను ముందుకు తీసుకెళ్లడంలో వినియోగిస్తున్నారు.
మిత్రులారా,
బిహార్ దేశంలో ప్రతిభకు కేంద్రస్థానమని, పవర్ హౌజ్ అని చెప్పేందుక నేను సంకోచించను. బిహార్ యువత ప్రతిభాపాటవాలు ప్రతిచోటా విస్తరించాయి. భారత ప్రభుత్వంలోనూ బిహార్ నుంచి వచ్చిన ఈ ప్రాంత బిడ్డలు దేశసేవ చేస్తున్నారు. ఇతరుల జీవితాల్లో సానకూల మార్పును తీసుకొస్తున్నారు. మీర ఏ ఐఐటీకి వెళ్లినా అక్కడ బిహారీ వెలుగులు కనబడతాయి. ఏ విద్యాసంస్థకు వెళ్లినా.. మరేచోటికి వెళ్లినా.. దేశం కోసం, తన సమాజం కోసం ఏదైనా చేయలన్న కలలను కళ్లలో నింపుకుని కష్టపడి పనిచేసే బిహారీ బిడ్డలు కనబడతారు. ఇక్కడి కళలు, సంగీతం, ఆరోగ్యకరమైన, పౌష్టికరమైన భోజనం గురించి దేశమంతా చర్చించుకుంటారు. దేశంలోని ఏ రాష్ట్రానికి వెళ్లినా బిహారీల శక్తి సామర్థ్యాలు, ఇక్కడి శ్రామికుల నైపుణ్యం ఆయా రాష్ట్రాల అభివృద్ధిలో కనబడతాయి. అందుకే బిహారీలు అందరినీ కలుపుకుని పోతారు. ఇదే బిహార్ అద్భుతమైన క్షమతకు నిదర్శనం. అందుకే ఎక్కడో ఒకచోట బిహార్ కు మేం రుణపడి ఉన్నాం. దాన్ని తీర్చుకునేందుకే ఈ సేవ చేసుకుంటున్నాం, బిహార్ గౌరవాన్ని పెంచేలా సుపరిపాలనను అందిస్తాం.
మిత్రులారా,
సరైన ప్రభుత్వం ఉండి. సరైన నిర్ణయాలు తీసుకుని, స్పష్టమైన విధివిధానాలను రూపొందించుకుని ముందుకెళ్తే అభివృద్ధి పథంలో దూసుకెళ్లడంతోపాటు నెంబర్ వన్ గా నిలవడం సాధ్యమేనని.. గత 15 ఏళ్లలో బిహార్ ప్రభుత్వం నిరూపించింది. మేం బిహార్ అన్నరంగాల్లో ముందుకెళ్లేలా ప్రయత్నిస్తున్నాం. ప్రతి రంగంలోని సమస్యల పరిష్కారానికి మార్గాలు వెతుకుతున్నాం. తద్వారా బిహార్ అభివద్ధిలో దూసుకుపోవాలని, తన సామర్థ్యానికి అనుగుణంగాం రాణించాలని ఆశిస్తున్నాం.
మిత్రులారా,
బిహార్ నవయువకులు చదువుకుని ఏం చేస్తారని ఇక్కడి కొందరు నాయకులు అంటున్నారు. వారు పొలాల్లో పనిచేస్తే సరిపోతుందంటున్నారు. ఇలాంటి ఆలోచనే నైపుణ్యవంతులైన బిహారీ యువకుల శక్తిసామర్థ్యాలపట్ల తీవ్ర అన్యాయాన్ని మిగిల్చింది. ఇక్కడ ఉన్నత విద్యాసంస్థలను స్థాపించలేదు. దీంతో బిహారీ యువకులు బయట రాష్ట్రాలకు వెళ్లి చదువుకోవాల్సి వచ్చింది. అక్కడే ఉద్యోగం చేయడం అనివార్యమైంది.
మిత్రులారా, పొలాల్లో పనిచేయడం చాలా గౌరవప్రదమైన విషయం. కానీ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించకపోవడం కూడా సరైంది కాదు కదా. ఇవాళ బిహార్ లో పెద్ద పెద్ద ఉన్నతవిద్యాసంస్థలు నెలకొల్పబడ్డాయి. వ్యవసాయ కళాశాలలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య పెరిగిపోయింది. రాష్ట్రంలో ఐఐటీ, ఐఐఎం సంస్థలు బిహారీ యువకుల ఉన్నతాశయాలకు మద్దతుగా నిలుస్తున్నాయి. నితీశ్ కుమార్ గారి హయాంలోనే బిహార్లో రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఒక ఐఐటీ, ఒక ఐఐఎం, ఒక నిఫ్ట్, ఒక నేషనల్ లా ఇనిస్టిట్యూట్ వంటి అనే పెద్ద పెద్ద విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. పాలిటెక్నిక్ సంస్థల సంఖ్య మూడురెట్లు పెరిగింది. స్టార్టప్ ఇండియా, ముద్రా యోజన వంటి పథకాలు బిహార్ యువత సొంతగా వ్యాపారాలు ప్రారంభించేందుకు ఆర్థికంగా ఆదుకుంటున్నాయి. ప్రభుత్వ ప్రయత్నం కారణంగా జిల్లా కేంద్రానికో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకానుంది.
మిత్రులారా,
బిహార్లో విద్యుత్ పరిస్థితేంటో మీ అందరికీ తెలుసు. గ్రామాల్లో రోజుకు రెండు, మూడు గంటల కరెంట్ ఉంటే, పట్టణాల్లో 8-10 గంటల కరెంట్ ఉంటే అదే గొప్పగా చెప్పుకునేవారు. కానీ నేడు బిహార్ గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో విద్యుత్ అందుబాటు గతంలో కంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ఉంది.
మిత్రులారా,
విద్యుత్, పెట్రోలియం, గ్యాస్ అనుసంధానిత రంగాల్లో ఆధునిక మౌలిక వసతుల కల్పన జరుగుతోందో.. సంస్కరణలు తీసుకురాబడుతున్నాయో.. అవి ప్రజల జీవనాన్ని సులభతరం చేయడంతోపాటు ఉద్యోగకల్పనను, ఆర్థిక వ్యవస్థను కూడా మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. కరోనా సందర్భంగా మరోసారి పెట్రోలియం అనుసంధానిత కార్యక్రమాల కల్పన మరింత వేగవంతమైంది. రిఫైనరీ ప్రాజెక్టులైనా, అన్వేషణ, ఉత్పతి ఆధారిత ప్రాజెక్టులయినా, పైప్ లైన్, సిటీ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టులయినా.. ఏ ప్రాజెక్టయినా శుంకుస్థాపన జరగడమో.. ప్రారంభించుకోవడమో జరిగింది. ఇవన్నీ 8వేల ప్రాజెక్టులు, వీటిపై 6లక్షల కోట రూపాయల ఖర్చు చేయబడతాయి. దీన్ని బట్టి దేశవ్యాప్తంగా, బిహార్ లో గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకోసం ఏ స్థాయిలో పనులు జరుగుతున్నాయో మీరు అంచనా వేయవచ్చు.
ఇంతేకాదు, ఈ ప్రాజెక్టుల్లో గతంలో పనిచేసిన వారు తిరిగొస్తున్నారు. దీని ద్వారా ఉపాధికల్పనకోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మిత్రులారా, ఇంత పెద్ద మహమ్మారి దేశంలోని ప్రతి ఒక్కరికీ ఎన్నో సమస్యలను సృష్టించింది. ఇన్ని సమస్యలు ఎదురైనా దేశం ఎక్కడా ఆగలేదు, బిహార్ ఎక్కడా ఆగలేదు.
వందల లక్షల కోట్ల రూపాయల విలువైన జాతీయ మౌలికవసతుల పైప్ లైన్ ప్రాజెక్ట్ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంటుంది. బిహార్, తూర్పు భారతంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. తద్వారా ఈ ప్రాంతం దేశ ఆత్మవిశ్వాసానికి ప్రధాన కేంద్రంగా మార్చేందుకు మనమంతా మరింత వేగంగా పనులు చేయాల్సి ఉంటుంది. వేలకోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా బిహార్ ప్రజలకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా తల్లులు, సోదరీమణుల జీవితాలు మరింత సౌలభ్యం కానున్నందున వారందరికీ శుభాకాంక్షలు.
కరోనా సమస్యల ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అందుకే ప్రతి ఒక్కరికీ మళ్లీ మళ్లీ చెబుతున్నా.. ఈ మహమ్మరికి టీకా వచ్చేంతవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలసత్వాన్ని ప్రదర్శించవద్దు. రెండు గజాల దూరం, మాస్క్, సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటివి చేయడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం మానుకోవాలి. ఇతరులకు గుర్తుచేస్తూ ఉండాలి.
మీరు అప్రమత్తంగా ఉంటేనే బిహార్ ఆరోగ్యంగా ఉంటుంది, దేశం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సందర్భంగా మరోసారి మీ అందరికీ బిహార్ అభివృద్ధి యాత్రలో భాగంగా చేపట్టి ప్రాజెక్టుల నేపథ్యంలో శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా.
ధన్యవాదములు.
***
(Release ID: 1654291)
Visitor Counter : 202
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam