రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

రవాణా వాహనాల్లో అంతర్జాతీయ స్థాయి ఉద్గార ప్రమాణాలు, భద్రత చర్యలు త్వరలోనే అమలు


Posted On: 12 SEP 2020 3:32PM by PIB Hyderabad

రవాణా వాహనాల్లో అంతర్జాతీయ స్థాయి ఉద్గార ప్రమాణాలు, భద్రత చర్యల అమల్లో మరిన్ని సంస్కరణలకు కేంద్రం సంకల్పించింది. వాహన రంగం ప్రగతి, జీడీపీలో దాని వాటా పెంచడానికి దీర్ఘకాలిక నియంత్రణ ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ తరహా నిబంధనల్లో, అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారతీయ వాహన పరిశ్రమను నిలబెట్టడానికి కేంద్ర వద్ద ప్రణాళికలు ఉన్నాయి.

    ఈ తరహా మార్పులతో భారతీయ వాహన రంగంలో వేగం పెరిగింది. ప్రయాణీకుల భద్రత, ఉద్గారాల నియంత్రణ, అనుసంధాన సాంకేతికతలో ఇటీవలి సంవత్సరాల్లో అనేక మార్పులొచ్చాయి. ఉద్గారాల ప్రమాణాల్లో బీఎస్‌-4 నుంచి నేరుగా బీఎస్‌-6కు మారడం ద్వారా.. యూరప్‌, జపాన్‌, అమెరికా స్థాయికి చేరడం ముఖ్యమైన మార్పుల్లో ఒకటి. మోటారు వాహనాల చట్టం (ఎంవీఏ)లో ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర సవరణలు సానుకూల స్పందనను సాధించాయి.

    భారతీయ వాహన రంగంలో ఉద్గారాల నియంత్రణ స్థాయిని, భద్రత ప్రమాణాలను పెంచడానికి 'కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ' అనేక నిబంధనలు తీసుకొచ్చింది. యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ, ఎయిర్‌ బ్యాగులు, వేగ హెచ్చరిక వ్యవస్థ, రివర్స్‌ పార్కింగ్‌ అసిస్ట్‌, క్రాషింగ్‌ ప్రమాణాలు వంటివాటిపై ముసాయిదా ప్రకటనలు వీటిలో కొన్ని.

    సంబంధిత విభాగ వాహనాల్లో 'ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ సిస్టం' (ఈఎస్‌సీ‌), 'బ్రేక్‌ అసిస్ట్‌ సిస్టం' ప్రమాణాలను వచ్చే రెండేళ్లలో అమలుచేసే ప్రక్రియను మంత్రిత్వ శాఖ రూపొందిస్తోంది. బస్సుల్లో 'ఈఎస్‌సీ'పై గతేడాది ముసాయిదా ప్రకటన కూడా ఇచ్చింది. 2023 ఏప్రిల్‌ నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించింది.

    వాహన రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు అమలు చేయాల్సిన ముఖ్యమైన విభాగాలను మంత్రిత్వ శాఖ గుర్తించింది. 'టైర్లలో గాలి పర్యవేక్షణ వ్యవస్థ' వీటిలో ఒకటి. వచ్చే నెల నుంచే ఇది అమల్లోకి రానుంది. వాహనాల కొలతలు, భవన నిర్మాణ సామగ్రితో కూడిన వాహనాలకు సంబంధించిన భద్రత ప్రమాణాలను ఇప్పటికే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ద్విచక్ర వాహనాల్లో సైడ్‌ స్టాండ్‌, ఫుట్‌ రెస్ట్‌ వంటివాటి భద్రత ప్రమాణాలను కూడా స్పష్టంగా వెల్లడించింది. త్వరలోనే ఇవన్నీ అమల్లోకి రానున్నాయి. 

 

*****

 



(Release ID: 1653652) Visitor Counter : 179